Share News

నాతో గడిపితేనే టీసీ ఇస్తా!

ABN , Publish Date - Jul 09 , 2026 | 04:57 AM

భావి పౌరులైన విద్యార్థులకు మార్గదర్శిగా ఉండాల్సిన ఆ ప్రిన్సిపల్‌ కొన్నాళ్లుగా తన వికృత చేష్టలతో ఓ విద్యార్థికి నరకం చూపిస్తున్నాడు. కాలేజీ నుంచి టీసీ (ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికేట్‌) కావాలని..

నాతో గడిపితేనే టీసీ ఇస్తా!

  • విద్యార్థికి పీజీ కాలేజీ ప్రిన్సిపల్‌ మార్క్‌ లైంగిక వేధింపులు

  • ఆ అబ్బాయిని బలవంతంగా ఇంటికి రప్పించుకున్న వైనం

  • ప్రిన్సిపల్‌ మర్మాంగాలను కొరికిన బాధితుడు

  • గాయం, రక్తస్రావంతో ప్రిన్సిపల్‌ గగ్గోలు

  • నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో ఘటన

  • ప్రిన్సిపల్‌పై బాధితుడి ఫిర్యాదు.. మద్దతుగా రోడ్డెక్కిన విద్యార్థులు

కొల్లాపూర్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): భావి పౌరులైన విద్యార్థులకు మార్గదర్శిగా ఉండాల్సిన ఆ ప్రిన్సిపల్‌ కొన్నాళ్లుగా తన వికృత చేష్టలతో ఓ విద్యార్థికి నరకం చూపిస్తున్నాడు. కాలేజీ నుంచి టీసీ (ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికేట్‌) కావాలని ఆ విద్యార్థి కోరితే, తన లైంగిక కోరిక తీర్చితేనే ఆ పత్రం ఇస్తానంటూ ప్రిన్సిపల్‌ వేధింపులకు గురిచేస్తున్నాడు. పైగా ఆ అబ్బాయిని బలవంతంగా తన ఇంటికి పిలిపించుకుంటే బాధితుడు, వేధింపులను భరించలేక ప్రిన్సిపల్‌ మర్మాంగాలను గట్టిగా కొరికాడు! తీవ్ర గాయం, రక్తస్రావంతో లబోదిబోమంటూ సదరు ప్రిన్సిపల్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. నిందితుడు కొల్లాపూర్‌ పీజీ కాలేజీ ప్రిన్సిపల్‌ మార్క్‌ పోలోనియస్‌! బాధిత విద్యార్థిది జగిత్యాల జిల్లా. బాధితుడి కథనం ప్రకారం.. తన ఇంటికొచ్చి శారీరకంగా కలిస్తేనే టీసీ ఇస్తానంటూ విద్యార్థికి మార్క్‌ చెప్పాడు. ఈసారి ఎలాగైనా మార్క్‌ దారుణాలను బయటపెట్టాలనే ఉద్దేశంతో బాధితుడు తన స్నేహితులను వెంటబెట్టుకొని ప్రిన్సిపల్‌ ఇంటికి వెళ్లాడు. స్నేహితులను బయటే ఉంచి తానొక్కడే లోపలికి వెళ్లాడు. అక్కడ బాధితుడి పట్ల మార్క్‌ అనైతిక చేష్టలను బయట నుంచి అతడి స్నేహితులు వీడియో తీశారు. అయితే గాయం తాలూకు బాధతో ప్రిన్సిపల్‌ అక్కడి నుంచి పరారవ్వగానే తన స్నేహితులను వెంటబెట్టుకొని బాధితుడు నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. గతంలో మార్క్‌ రెండుసార్లు తనను ఇంటికి పిలిపించుకొని అశ్లీల, అనైతిక చర్యలకు పాల్పడ్డాడని.. కాలేజీలో చదువుకు ఆటంకం ఏర్పడుతుందనే భయంతో భరించానని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.


కాగా మార్క్‌ను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి కఠిన శిక్షపడేలా చూడాలని ఎస్‌ఎ్‌ఫఐ, డీవైఎం ఆధ్వర్యంలో బుధవారం పీజీ కాలేజీ ఎదుట విద్యార్థులు రాస్తారోకో చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళనను విరమింపజేశారు. కాగా ఈ ఘటన పట్ల పాలమూరు విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. బుధవారం కొల్లాపూర్‌ కళాశాలకు వచ్చిన రిజిస్ట్రార్‌ రమేశ్‌ బాబు ఓఎస్డీ మధుసూదన్‌.. బాధ్యులపై కఠిన చర్యలుంటాయని, అవసరమైతే ప్రిన్సిపల్‌ను సస్పెండ్‌ చేసేందుకు వెనుకాడబోమని చెప్పారు. ఈ ఘటనపై సమాచారం ఇవ్వకుండా ప్రొఫెసర్లు మౌనంగా ఉండటంపై సంజాయిషీ కోరతామని తెలిపారు. కాగా మార్క్‌ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధిత విద్యార్థిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Updated Date - Jul 09 , 2026 | 04:58 AM