జగన్ పీఏనా.. మజాకా?
ABN , Publish Date - May 28 , 2026 | 05:06 AM
అక్రమార్జనలో జగన్ పీఏ కె.నాగేశ్వర రెడ్డి(కేఎన్‌ఆర్) ‘ఘనత’ ఇదీ. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భారీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన లావాదేవీల్లో...
ఐదేళ్లలో కేఎన్‌ఆర్ వందల కోట్ల అక్రమార్జన.. లిక్కర్ ముఠాకు.. వైసీపీ అధినేతకు మధ్య వారధి
జగన్ సీఎం కాకముందు అద్దె ఇంట్లో సాదాసీదాగా
గద్దెనెక్కాక అనూహ్య సంపద
3 రాష్ట్రాల్లో ఆస్తులు, వెంచర్లు, ఇళ్లు, కంపెనీలు
తిరుపతి, దర్శి, జగ్గయ్యపేట, భోగాపురంలో భూములు
బెంగళూరు, హైదరాబాద్, బెజవాడ, కడప, తిరుపతిలో ఇళ్లు
భార్య బ్యాంకు ఖాతాలో 20 కోట్లు.. 2 కిలోలకు పైగా బంగారం
బెజవాడలో కార్ల షోరూమ్, హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీ
అతడు.. కడప జిల్లా కమలాపురంలో చిన్న టిఫిన్ సెంటర్ ద్వారా జీవించే కుటుంబానికి చెందిన వ్యక్తి. అతి సామాన్యుడు. కేవలం పది వేల రూపాయలు జీతం తీసుకుని ఒక పత్రికలో పనిచేశాడు. తర్వాత వ్యక్తిగత సహాయకుడిగా చేరాడు. 2019 వరకు అద్దె ఇంట్లో సాదాసీదా జీవితం గడిపాడు. ఇదీ నేపథ్యం. సీన్ కట్ చేస్తే.. 2019-24 మధ్య వందల కోట్ల ఆస్తులు సంపాదించాడు. పీఏగా పనిచేసే వ్యక్తి ఇన్ని ఆస్తులు కూడబెట్టడం నిజంగా సాధ్యమా? అంటే.. ఇతరులకు కాకపోవచ్చు కానీ మాజీ సీఎం జగన్ పీఏకు మాత్రం చాలా సులువు..!
అక్రమార్జనలో జగన్ పీఏ కె.నాగేశ్వర రెడ్డి(కేఎన్‌ఆర్) ‘ఘనత’ ఇదీ. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భారీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన లావాదేవీల్లో కేఎన్‌ఆర్ ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగా విచారణకు పిలిపించి సిట్ అధికారులు ప్రశ్నించారు. దిమ్మతిరిగే ఆస్తుల చిట్టా బయట పడింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో కేఎన్‌ఆర్‌కు వందల కోట్ల విలువైన ఇళ్లు, వ్యాపారాలు, స్థిరాస్తులు.. భార్య బ్యాంకు ఖాతాలో సుమారు 20 కోట్ల రూపాయల వరకూ లావాదేవీలు బయట పడ్డాయి. ఈ సొమ్ము పలువురి ఖాతాల నుంచి బదిలీ కావడంతో పాటు పలు ప్రాంతాల నుంచి నగదు డిపాజిట్ చేసినట్లు సిట్ తేల్చింది. జగన్‌కు ఎక్కడెక్కడ ప్యాలె్‌సలు ఉన్నాయో అక్కడంతా ఇళ్లున్న కేఎన్‌ఆర్‌కు తిరుపతిలో అదనంగా ఉంది.
ఏది అడిగినా దాటవేత ధోరణి
గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన 3,500 కోట్ల లిక్కర్ స్కామ్‌ను సిట్ విచారిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముడుపుల సొమ్ము కోట్లాది రూపాయలు తరలించినట్లు తేల్చింది. ఆయన ఆస్తుల వివరాలు పరిశీలించగా.. తిరుపతి జిల్లా కేవీబీ పురం మండలంలో ఒల్లూరు వద్ద కేవీఆర్ ఇన్‌ఫ్రా పేరుతో వేసిన 47ఎకరాల లే అవుట్ వివరాలు బయట పడ్డాయి. అందులో నుంచి ఆస్తులు కొనుగోలు చేసిన వారిలో జగన్ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న కేఎన్‌ఆర్ పేరిట పదెకరాలు 2021లో రిజిస్టర్ అయినట్లు తేలింది. ఎకరా రూ.8 లక్షల చొప్పున పదెకరాల ఆస్తిని కేఎన్‌ఆర్ రూ.81 లక్షలకు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. దీంతో ఆయనకు సిట్ అధికారులు నోటీసులిచ్చి విచారణకు పిలిచారు. విజయవాడలోని పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో ఉన్న సిట్ ఆఫీసుకు బుధవారం ఉదయం పది గంటలకు న్యాయవాదులతో కలిసి వచ్చిన కేఎన్‌ఆర్‌ను సాయంత్రం 7.30 వరకూ సిట్ అధికారులు ప్రశ్నించారు. చెవిరెడ్డి కుటుంబానికి చెందిన కేవీఆర్ ఇన్‌ఫ్రాలో పదెకరాల భూమి కొనుగోలు చేయడానికి రూ.81 లక్షల డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని సిట్ అధికారులు ప్రశ్నించారు. తనకు గుర్తులేదని, ఆడిటర్ చూసుకుంటారని కేఎన్‌ఆర్ బదులిచ్చారు. అధికారులు ఏది అడిగినా దాటవేత ధోరణితో వ్యవహరించారు. అయితే ఒక్కో ఆస్తి చిట్టా బయట పెడుతూ.. ఈ డబ్బులన్నీ లిక్కర్ స్కామ్‌లో ముడుపుల ద్వారా వచ్చినవేనా? అని అధికారులు ప్రశ్నించారు. దీంతో అవాక్కైన కేఎన్‌ఆర్ పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. ‘చిన్న టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసుకుని జీవించే కుటుంబానికి చెందిన మీరు జగన్ పంచన చేరక ముందు వరకూ అతి సామాన్యుడు.. కానీ ఇప్పుడు వందల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయి? అని అధికారులు ప్రశ్నించారు. తనకు విజయవాడలో కార్ల షోరూమ్‌లో భాగస్వామ్యం ఉందని, బామ్మర్ది రఘునాథ్ రెడ్డి పేరుతో ఉన్న ఐటీ కంపెనీలో భార్య శశికళకు వాటా ఉందని వెల్లడించినట్లు తెలిసింది. పెట్టుబడి పెట్టడానికి సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? బ్యాంకు లోను తీసుకున్నారా? అప్పు చేశారా? అంటూ సిట్ అధికారులు ప్రశ్నించగా.. ఆడిటర్ చూసుకుంటారని కేఎన్‌ఆర్ బదులిచ్చారు. చాలా ప్రశ్నలకు ఇదే సమాధానమిచ్చినట్లు తెలిసింది.
కాల్ డేటా సేకరణ
లిక్కర్ స్కామ్‌లో ముఠా సభ్యులకు ముఖ్యమంత్రి జగన్‌కు మధ్య వారధిగా కేఎన్‌ఆర్ వ్యవహరించినట్లు తెలిసింది. లిక్కర్ పాలసీ రూపకల్పన నుంచి ప్రతి వారం మద్యం ముడుపులు సక్రమంగా అందుతున్నాయా.. వాటిని ఎక్కడ నిల్వ చేస్తున్నారు.. ఎన్నికల కోసం ఎలా ఖర్చు చేయాలి.. తదితర విషయాలు చర్చించే ప్రతి సమయంలోనూ లిక్క ర్ గ్యాంగ్‌కు జగన్‌తో సమావేశం ఏర్పాటు చేసింది కేఎన్‌ఆర్ అని సిట్ గుర్తించింది. గత వైసీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి జగన్‌తో మాట్లాడాలంటే కేఎన్‌ఆర్‌కు ఫోన్ చేయా లి. లిక్కర్ స్కామ్‌లో కీలక నిందితులందరితోనూ కేఎన్‌ఆర్ నిరంతరం ఫోన్‌లో మాట్లాడినట్లు సిట్ కాల్ డేటా సేకరించింది. జగన్‌తో వాళ్లు ఏమి మాట్లాడారు.. మీరు అక్కడ ఉండి ఏమి విన్నారు.. మీకు అందిన కమీషన్ ఎంత.. తదితర ప్రశ్నలు అడగ్గా అ న్నింటికీ సమాధానాలు దాటవేసినట్లు తెలిసింది.
-అమరావతి, ఆంధ్రజ్యోతి
నేడూ విచారణ
మొదట్లో కడప జిల్లాలో ఓ పత్రికలో పనిచేసిన కేఎన్‌ఆర్.. వైఎ్‌సఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తనయుడు జగన్ స్థాపించిన సాక్షి పత్రికలో చేరారు. అనంతరం జగన్ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా చేరారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకూ ఆయనది సాదాసీదా జీవితమే. జగన్ సీఎం అయ్యాక 2019-2024 మధ్య ఆయన జీవితం అనూహ్యంగా మారిపోయింది. జగన్ పీఏగా ప్రస్తుతం రూపాయి జీతం కూడా లేకుండా పనిచేస్తున్న కేఎన్‌ఆర్‌కు 2019 నుంచి 2024 మధ్యలో ఇన్ని వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయనే దానిపై సిట్ అధికారులు కూపీ లాగుతున్నారు. బుధవారం సుదీర్ఘంగా విచారించిన సిట్ అధికారులు గురువారం మరోమారు ప్రశ్నించి మరిన్ని కీలక విషయాలు వెలికితీసే అవకాశం ఉంది.
ఇదీ కేఎన్‌ఆర్ ఆస్తుల చిట్టా
బెంగళూరులో రెండు ఫ్లాట్లు, తిరుపతిలో మరో రెండు .
హైదరాబాద్, కడప, విజయవాడలో ఇళ్ల నిర్మాణం చేపట్టారు.
బెజవాడలో కార్ల షోరూమ్, హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో వాటా.
జగ్గయ్యపేట ప్రాంతంలో 40 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రకాశం జిల్లా దర్శిలో పదెకరాలు, భోగాపురం విమానాశ్రయం వద్ద భారీగా భూములు .
భార్యకు రెండు కిలోలకు పైగా బంగారం.