ప్రేమికుడు పెళ్లి చేసుకోను అన్నాడని.. ‘లైవ్’లో ఆత్మహత్య!
ABN , Publish Date - Jul 29 , 2026 | 08:58 AM
ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకోనని చెప్పడంతో మనస్తాపానికి గురైన యువతి అతడికి వీడియో కాల్ చేసి లైవ్‌లో ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన కాకినాడ జిల్లా గొల్లప్రోలులో మంగళవారం జరిగింది. పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు..
వీడియో కాల్ చేసి ఉరేసుకున్న యువతి
కాకినాడ జిల్లా గొల్లప్రోలులో ఘటన
గొల్లప్రోలు (ఆంధ్రజ్యోతి): ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకోనని చెప్పడంతో మనస్తాపానికి గురైన యువతి అతడికి వీడియో కాల్ చేసి లైవ్‌లో ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన కాకినాడ జిల్లా గొల్లప్రోలులో మంగళవారం జరిగింది. పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు.. గొల్లప్రోలు రైల్వేస్టేషన్ సమీపంలో నివాసముంటున్న తండి పీతాంబర్ ఒడిశాకు చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి. రిటైర్మెంట్ అనంతరం గొల్లప్రోలుకు వచ్చి స్థిరపడ్డారు. అతడి కుమార్తె తండి ఫిస్కిల్లా(27) కాకినాడ ఎస్‌ఆర్‌ఎంటీ మాల్‌లో ఉన్న రిలయన్స్ డిజిటల్‌లో బజాజ్ ఫైనాన్స్ సేల్స్ ఆఫీసర్‌గా పనిచేస్తోంది. తల్లిదండ్రులు ఒడిశాలో ఓ ఫంక్షన్‌కు వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఫిస్కిల్లా మంగళవారం ఉదయం 10గంటల సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉరి వేసుకునే సమయంలో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సహచర ఉద్యోగి, కాకినాడ సమీప మాధవపట్నానికి చెందిన నరేంద్రకుమార్‌కు ఫోన్ చేసి చెప్పింది.
ఆ సమయంలో ఆమె మెడకు చున్నీ తగిలించుకుని రోదిస్తూ మాట్లాడినట్లు తెలుస్తోంది. కంగారు పడిన అతడు వెంటనే పిఠాపురం జగ్గయ్యచెరువులో నివాసముంటున్న ఐడీఎఫ్‌సీలో పనిచేస్తున్న చినబాబుకు ఫోన్ చేసి చెప్పడంతో అతడు అక్కడకు వెళ్లే సరికి చున్నీతో ఉరివేసుకుని కనిపించింది. ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి. దీంతో ఆమెను కిందకు దింపి సీపీఆర్ చేశాడు. అనంతరం పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. కాగా, ఫిస్కిల్లా రెండేళ్లుగా తనతో పాటు పని చేసే ఉద్యోగితో ప్రేమలో ఉన్నట్టు సమాచారం. ఇటీవల అతడు వేరేచోటుకు బదిలీపై వెళ్లాడు. అనంతరం ఆ యువకుడికి పెళ్లి కుదిరినట్టు, ఈ విషయంలో వారి మధ్య వివాదం జరిగినట్టు బంధువులు చెప్తున్నారు. ఫిస్కిల్లా చనిపోయే సమయంలో అతడికే సెల్ఫీ వీడియో కాల్ చేసి ఉరివేసుకున్నట్లు సమాచారం. ప్రేమికుడు ఎవరన్నదీ పోలీసులు గోప్యంగా ఉంచారు. దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు ఎస్‌ఐ ఎన్.రామకృష్ణ తెలిపారు.