ఏదీ దిద్దుబాటు?
ABN , Publish Date - May 21 , 2026 | 04:21 AM
వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలు అక్రమాలకు పాల్పడిన ఓ నేత కాకినాడ పట్టణంలోని సామాన్యులు, పేదల భూములను దోచుకునేందుకు ఆర్‌ఎస్‌ఆర్‌నే (రీ సెటిల్‌మెంట్ రిజిస్టర్) చెరపట్టారు.
గత ప్రభుత్వంలో ఓ వైసీపీ నేత బరితెగింపు
కాకినాడ కలెక్టరేట్‌లోకి చొరబడి ఆర్‌ఎస్‌ఆర్, ఫెయిర్ అడంగల్‌లోని భూ రికార్డులు తారుమారు
బంధువులు, అనుచరుల పేరిట ఆ భూములు
ఆ ప్రభుత్వంలోనే అక్రమ వ్యవహారం బట్టబయలు
కానీ, నేటికీ దిద్దుబాటు కాని నాటి అక్రమ వ్యవహారం
కోర్టు ధిక్కారం అని తెలిసినా సరిదిద్దని వైనం
ఈనాటికీ బాధితులకు అప్పగించని భూమి
మరోసారి నివేదిక కోరిన రెవెన్యూ శాఖ
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలు అక్రమాలకు పాల్పడిన ఓ నేత కాకినాడ పట్టణంలోని సామాన్యులు, పేదల భూములను దోచుకునేందుకు ఆర్‌ఎస్‌ఆర్‌నే (రీ సెటిల్‌మెంట్ రిజిస్టర్) చెరపట్టారు. నాడు తనకున్న బలాన్ని ప్రదర్శించి కలెక్టరేట్‌లో అత్యంత సురక్షితంగా ఉన్న ఆర్‌ఎస్‌ఆర్, ఫెయిర్ అడంగల్‌లోని సామాన్యుల భూములున్న రికార్డును తారుమారుచేశారు. తన అనుచరులు, సొంతవారి పేరిట ఆ భూములు రాయించుకున్నారు. ఇంకా విచిత్రం ఏమంటే, వైసీపీ ప్రభుత్వంలోనే ఈ అక్రమం బయటపడింది. నాటి సీసీఎల్‌ఏ ఆదేశాలతో జాయింట్ కలెక్టర్ విచారణ జరిపి 2023లో అక్రమాలు నిగ్గు తేల్చారు. కానీ పరిస్థితి ఏం మారలేదు. రికార్డును సరిదిద్దలేదు. సామాన్యుల హక్కులు గాలికొదిలేశారు. అక్రమంగా కలెక్టరేట్‌లోకి చొరబడి రికార్డును తారుమారుచేసిన వ్యక్తులు ఎవరో తెలిసినా చర్యలు తీసుకోలేదు. నేటికీ అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. కలెక్టరేట్‌లోని రికార్డుకే దిక్కులేకపోతే ఇక గ్రామ స్థాయిలో ఉండే వాటిని ఎవరు కాపాడతారు? ఈ విషయంలో రాష్ట్ర హైకోర్టు, సీసీఎల్‌ఏ ఇచ్చిన ఆదేశాలు కూడా బుట్టదాఖలవ్వడం ఆ జిల్లాలో రెవెన్యూ అధికారుల తీరును ప్రతిబింబిస్తోంది.
ఇంత నిర్లక్ష్యమా?
హక్కుదారుల ప్రయోజనాలు కాపాడాలని, రికార్డులు పూర్వస్థితికి తీసుకురావాలని, ఇటు హైకోర్టు, అటు సీసీఎల్‌ఏ పలుమార్లు ఆదేశించినా కాకినాడ రెవెన్యూ అధికారుల్లో ఇసుమంతైనా చలనం లేదు. కోర్టుధిక్కార పిటీషన్, సీసీఎల్‌ఏ ఆదేశాల అమలుపై రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రస్తావిస్తూ ఈ ఏడాది మార్చి 2న ఆంధ్రజ్యోతి ‘హై కోర్టు చెబితే మాకేంటి’ అన్న శీర్షికతో వార్తను ప్రచురించింది. దీనికి స్పందించిన రెవెన్యూ అధికారి 195-3లోని భూమికి వేసిన తాళం తీసి, హైకోర్టు ఉత్తర్వు రాకముందే భూమిని హక్కుదారులకు అప్పగించామని నివేదించారు. కానీ ఆచరణలో చట్టబద్దమైన నిబంధనల ప్రకారం ఆ భూమిని హక్కుదారులకు అప్పగించలేదు. ఆర్‌ఎస్‌ఆర్‌ను అడ్డగోలుగా మార్చేసిన అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. ఓ సామాన్యుడు, పేదవాడు చిన్న తప్పుచేస్తే రెవెన్యూ చట్టాలన్నీ ప్రయోగించి శిక్షించే అధికారులు పెద్దల విషయంలో చర్యలు తీసుకోకుండా మౌనం దాల్చారు. ఈ విషయంలో హైకోర్టు, సీసీఎల్‌ఏ ఇచ్చిన ఆదేశాలు కూడా అమలు చేయనంత ధిక్కార దర్పాన్ని అధికారులు ప్రదర్శిస్తుండటం ఆ వైసీపీ నే త పట్ల ఉన్న స్వామిభక్తిని చూపిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. అయితే, ఈ పరిణామాలపై బాధితులు మరోసారి హైకోరుకు వెళ్లారు. కోర్టు రెవెన్యూశాఖకు నోటీసులు ఇచ్చింది. ఈ నేపధ్యంలో సీసీఎల్‌ఏ మరోసారి ఈ భూముల విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని కాకినాడ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఇప్పటిదాకా ఈ భూముల విషయంలో హైకోర్టు, తాము ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏం చర్యలు తీసుకున్నారో నివేదించాలని ఆదేశించారు.
ఇదీ జరిగింది..
కాకినాడ పట్టణం సూర్యారావుపేటలోని నాలుగు సర్వే నంబర్లలోని 13.50 ఎకరాల భూమిపై కీలక వైసీపీ నేత కన్నుపడింది. నాడు జగన్ ప్రభుత్వంలో కీలక ప్రజాప్రతినిధిగా ఉండటంతో రెవెన్యూ అధికారులు, సిబ్బందిని కనుసైగతో శాసించారు. జిల్లా కలెక్టరేట్‌లోని ఆర్‌ఎస్‌ఆర్‌లో ఫెయిర్ అడంగల్‌లో ఉన్న ఆ భూమి రికార్డులను మార్చేయించారు. మొత్తం 18 ఎంట్రీలను మార్చేశారు. అందులో 195-1లో అసలు హక్కుదారు పేరును పెన్నుతో చెరిపేసిదానిపైనే తన ముఖ్య అనుచరుడి పేరు రాయించారు. 195-3లో మరో అనుచరుడి పేరు రాయించారు. దీంతో పేదలు అవి తమ భూములని, వైసీపీ నేత అనుచరులు, భూకబ్జాదారుల నుంచి కాపాడాలని నాటి సీసీఎల్‌ఏ సాయిప్రసాద్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఆ ఫిర్యాదుపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని 2023లో సీసీఎల్‌ఏ ఆదేశించారు. అప్పటి కాకినాడ జాయింట్ కలెక్టర్ విచారణ చేశారు. కలెక్టరేట్‌లో ఉన్న ఫెయిర్ అడంగల్‌ను మార్చేశారని నిగ్గు తేల్చారు. ఫోర్జరీకి పాల్పడి పేర్లు తారుమారు చేశారని 2023, నవంబరు 30న సీసీఎల్‌ఏకు నివేదించారు. ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను రెవెన్యూశాఖ ఆదేశించింది.. ఇదే విషయాన్ని 2025 జూలైలో ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ వార్తపై రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్‌లిద్దరూ స్పందించారు. రికార్డును తారుమారుచేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సామాన్యుల భూములను కాపాడాలని జిల్లా రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. అయినా ఆ ఉత్తర్వులేవీ అమలుకాలేదు. అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. పైగా, అసలు భూ హక్కుదారులను ఇబ్బందులకు గురిచేశారు. సర్వే నంబర్ 195-3లోని ఉన్న భూమిలోకి హక్కుదారులు వెళ్లకుండా రెవెన్యూ అధికారులే గేట్లకు తాళాలు వేసి సీజ్‌చేశారు. దీనిపై బాధితులు హైకోర్టుకు వెళ్లగా, వెంటనే సీజ్‌ను తొలగించి భూమిని హక్కుదారులకు అప్పగించాలని ఆదేశించింది. అయినా అధికారులు స్పందించకపోవడంతో బాధితులు రెవెన్యూ అధికారులపై కోర్టుధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు రెవెన్యూశాఖకు, సీసీఎల్‌ఏకు నోటీసులు జారీచేసింది. లోగడ కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని ఆదేశించినా, ఎందుకు చర్యలు తీసుకోలేదని, తక్షణమే కోర్టు ఆదేశాలను అమలు చేయాలని గతేడాది డిసెంబరులో సీసీఎల్‌ఏ కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారులను ఆదేశించారు.