జగన్ మేనమామ భూబాగోతం!
ABN , Publish Date - May 14 , 2026 | 05:37 AM
మాజీ సీఎం జగన్ మేనమామ, కడప జిల్లా.. కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి. రవీంద్రనాథరెడ్డి రూటే సెపరేటు. ఐదేళ్ల వైసీపీ హయాంలో జిల్లాలో పెద్దఎత్తున భూ కబ్జాలు జరిగాయి. ముఖ్యంగా కడప నగరం చుట్టూ ఉన్న కమలాపురం నియోజకవర్గ పరిధిలోని సీకే దిన్నె....
కడప రింగు రోడ్డులోని నిషేధిత భూములు రవీంద్రనాథరెడ్డి స్వాహా
సొసైటీ విభేదాలను అనుకూలంగా మార్చుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే
రూ.150 కోట్ల భూములను తొలుత కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్
గత 2024 ఎన్నికలకు ముందు పలువురికి మరోసారి రిజిస్ట్రేషన్
పెద్దదస్తగిరి హత్యతో వెలుగులోకి
ఆయన భార్య పేరిట 9.70 ఎకరాలు
హత్యకు-భూమికి లింకుపై పోలీసుల ఆరా
(కడప-ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్ మేనమామ, కడప జిల్లా.. కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి. రవీంద్రనాథరెడ్డి రూటే సెపరేటు. ఐదేళ్ల వైసీపీ హయాంలో జిల్లాలో పెద్దఎత్తున భూ కబ్జాలు జరిగాయి. ముఖ్యంగా కడప నగరం చుట్టూ ఉన్న కమలాపురం నియోజకవర్గ పరిధిలోని సీకే దిన్నె, చెన్నూరు మండలాల్లో ప్రైవేటు ఆస్తులను భారీ ఎత్తున సొంతం చేసుకున్నారు. నిషేధిత జాబితాలో ఉన్నా సరే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ భూబాగోతాన్ని ‘ఆంధ్రజ్యోతి’ పలుమార్లు ప్రచురించింది. అయితే.. అప్పట్లో అధికారులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించారు. తాజాగా వైసీపీ నేత పెద్దదస్తగిరి హత్య అనంతరం ఆయన ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను పరిశీలించగా రవీంద్రనాఽథరెడ్డి భూబాగోతం వెలుగు చూసింది. నిషేధిత జాబితాలో ఉన్న భూములతోపాటు కోర్టు కేసులు ఉన్న రూ.150 కోట్లు విలువ చేసే భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్న విషయం బట్టబయలైంది. తయ్యబ్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ కడప చుట్టుపక్కల ఉండే కడప, సీకేదిన్నె రెవెన్యూ పరిఽధిలో భూములు కొన్నది. సీకేదిన్నె రెవెన్యూ పొలం 20/1లో 8.92 ఎకరాలు, 21/1లో 3.48, 21/3లో 4.74, 22/3లో 7.12 ఎకరాలు మొత్తం 24.26 ఎకరాల భూమి ఉంది. సొసైటీ సభ్యుల మధ్య విబేధాలను పసిగట్టిన రవీంద్రనాథరెడ్డి.. ఓ వర్గాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని రూ.150 కోట్ల విలువ చేసే ఈ భూములను సొంతం చేసుకునే పన్నాగం పన్నారు. ‘లక్ష్మీ పద్మావతి కన్‌స్ట్రక్షన్’ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి తన భార్య పోచంరెడ్డి అరుణకుమారి, కుమారుడు నరేన్‌రామాంజులరెడ్డి, పెద్దదస్తగిరితో పాటు మొత్తం ఆరుగురిని సభ్యులుగా చేర్చారు. అనంతరం.. సొసైటీలోని అనుకూల వర్గాన్ని చేరదీసి 2022లో రిజిస్ట్రేషన్ చేయించే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంపై సొసైటీలోని మరో వర్గం ఫిర్యాదు చేయడంతో రిజిస్ట్రేషన్‌ను పెండింగులో పెట్టారు. తొలుత కొద్దిరోజులు పెండింగులో పెట్టినా.. తిరిగి వాటిని రిజిస్ట్రేషన్ చేశారు. వాస్తవానికి ఈ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయి. వీటిని ఎవరికీ రిజిస్ట్రేషన్ చేయకూడదనే విషయం అధికారులకు కూడా తెలుసు. అయినప్పటికీ అప్పటి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కావడంతో రవీంద్రనాథరెడ్డి ఒత్తిడి మేరకు ఆయా భూములను రిజిస్ట్రేషన్ చేశారు.
వైసీపీ దిగిపోతుందని తెలిసి!
కన్‌స్ట్రక్షన్ సంస్థ పేరిట ఉన్న భూములను 2024, మార్చి 11న రవీంద్రనాథరెడ్డి వేరేవారికి రిజిస్ట్రేషన్ చేయించారు. పెద్దదస్తగిరి భార్య రమణమ్మ పేరిట 9.70 ఎకరాలు, కడప నబీకోట్‌కు చెందిన దగ్గుబాటి శ్రీనివాసులు పేరిట 8.92 ఎకరాలు, ఆర్‌కే నగర్‌కు చెందిన రాజుశ్రీమతి అనే ఆమె పేరిట మిగిలిన భూములు రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే.. వైసీపీ ప్రభుత్వం ఎలానూ దిగిపోతుందని తెలిసి.. తన కుటుంబం పేరుతో ఉన్న భూములను హడావుడిగా వేరేవారి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారని తెలిసింది. వీరంతా రవీంద్రనాథరెడ్డి బినామీలేనన్న ప్రచారం జరుగుతోంది.
పెద్దదస్తగిరి హత్యతో వెలుగులోకి..
పెద్దదస్తగిరి హత్య తర్వాత పోలీసులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి పెద్ద ఎత్తున డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఈ భూముల విలువ రూ.100 కోట్లకు పైగా ఉండొచ్చని ప్రచారం జరిగింది. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆ డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. మృతుడు పెద్దదస్తగిరి మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డికి ముఖ్య అనుచరుడుగా ఉండటంతో పాటు బినామీ అని సమాచారం. లక్ష్మీపద్మావతి కన్‌స్ట్రక్షన్ పేరిట ఉన్న భూముల్లో 9.70 ఎకరాల భూమిని పెద్దదస్తగిరి భార్య పేరిట రిజిష్టరు చేయించడం దీనికి బలం చేకూరుస్తోంది. అయితే నిషేధిత జాబితాలో ఉన్నా, కోర్టులో ఉన్నా కూడా భూములను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం గమనార్హం. పెద్దదస్తగిరి హత్యలో ఈ భూమికి సంబంధించిన వివాదం ఏమైనా ఉందా? తన భార్య పేరిట ఉన్న భూములను బదలాయించే విషయంలో ఏమైనా గొడవలు జరిగాయా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.