హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ లీసా గిల్!
ABN , Publish Date - Feb 28 , 2026 | 05:04 AM
ఏపీ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ రానున్నారు. ప్రస్తుతం పంజాబ్- హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఆమెను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ .....
ఏపీ హైకోర్టు తొలి మహిళా సీజేగా రికార్డు!
అమరావతి, న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ రానున్నారు. ప్రస్తుతం పంజాబ్- హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఆమెను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం గురువారం కేంద్రానికి సిఫారసు చేసింది. ప్రస్తుత ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ వచ్చే నెల 24న పదవీ విరమణ చేయనుండగా ఆయన స్థానంలో జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు చేపడతారు. కాగా ఏపీ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా చరిత్రకెక్కుతారు. అప్పటివరకు తదుపరి సీజే హోదాలో హైకోర్టులో కొనసాగుతారు. అంతకు ముందే పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్తారని ప్రచారం కూడా జరుగుతోంది.
కొలీజియం కొత్త విధానం..
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకంలో సుప్రీంకోర్టు కొలీజియం కొత్త విధానం ప్రవేశపెట్టింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో గురువారం సమావేశమై, న్యాయ పరిపాలనలో సామర్థ్యం, నాణ్యతలను మరింత పెంచడానికి.. సీజే బాధ్యతలు తీసుకునే న్యాయమూర్తిని ఆ పదవికి ఖాళీ ఏర్పడడానికి రెండు నెలల ముందే సంబంధిత కోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించింది. దీని వల్ల ఆ హైకోర్టు వ్యవహారాల పై అవగాహన పెరుగుతుందనేది కొలీజియం భావన. అందులోభాగంగానే జస్టిస్ లీసాను ఏపీ హైకోర్టుకు, జస్టిస్ ఎస్‌ఏ ధర్మాధికారిని మద్రాస్ హైకోర్టుకు తదుపరి సీజేలుగా నియమించారు. ప్రస్తుతం ఆయన కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు.
జస్టిస్ లీసా గిల్ నేపథ్యం..
జస్టిస్ లీసా గిల్ పాఠశాల విద్యను చండీగఢ్‌లో, ఆ తర్వాత జీసీజీ కళాశాలలో డిగ్రీ, పంజాబ్ వర్సిటీ నుంచి న్యాయ శాస్త్రంలో పట్టా పొందారు. 1990లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. అనంతరం పంజాబ్- హరియాణా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. క్రిమినల్, సివిల్, సర్వీస్, రెవెన్యూ, రాజ్యాంగపరమైన కేసులు వాదించడంలో నైపుణ్యం గడించారు. 2014 మార్చి 31 నుంచి పంజాబ్-హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు.