న్యాయవ్యవస్థపై నమ్మకం కలిగించాలి
ABN , Publish Date - Sep 27 , 2026 | 03:50 AM
న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం కలిగించేలా నడుచుకోవాలని న్యాయాధికారులకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్ సూచించారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో నిర్మించిన కోర్టు భవనాలను..
న్యాయాధికారులకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచన
కదిరిలో అదనపు కోర్టులు, భవనాల ప్రారంభోత్సవం
వర్చువల్‌గా హాజరైన జస్టిస్ లిసా గిల్
కదిరి లీగల్ సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం కలిగించేలా నడుచుకోవాలని న్యాయాధికారులకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్ సూచించారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో నిర్మించిన కోర్టు భవనాలను, కొత్తగా మంజూరైన రెండు అదనపు కోర్టులను శనివారం ఆమె వర్చువల్‌గా ప్రారంభించారు. కదిరిలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవానికి హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టుఫోలియో జడ్జి జస్టిస్ బీఎస్ భానుమతి, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సురేశ్ రెడ్డి, జస్టిస్ చల్లా గుణరంజన్ హాజరయ్యారు. జిల్లా ప్రధాన న్యాయాధికారి ఇ.భీమారావు వారికి స్వాగతం పలికారు. కదిరి సీనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి వాసుదేవన్ వందన సమర్పణ చేశారు.
జస్టిస్ లిసాగిల్ వర్చువల్‌గా హాజరై, కోర్టులను, కోర్టు భవనాలను ప్రారంభించి, ఉపన్యసించారు. నూతన న్యాయస్థానాలు ప్రజల విశ్వాసానికి నిలువుటద్దంగా నిలవాలని పిలుపునిచ్చారు. తీర్పులు వెలువరించే సందర్భంలో, నిర్ణయాలు తీసుకునే సమయంలో నీతి, నిజాయతీ, నిబద్ధత, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని న్యాయాధికారులకు సూచించారు. న్యాయవ్యవస్థకు న్యాయమూర్తులు, న్యాయవాదులు రథచక్రాల్లాంటివారని జస్టిస్ బీఎస్ భానుమతి అన్నారు. రెండింటిలో ఏ చక్రం పనిచేయకపోయినా రథం ఆగిపోతుందని, వ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు