Share News

నాడు గాలికొదిలి.. నేడు నీతులు

ABN , Publish Date - Sep 29 , 2026 | 03:14 AM

జగన్‌ సర్కారులో ఉద్యోగాలైతే ఇచ్చారు కానీ చాలా కాలం జాబ్‌ చార్ట్‌ ఇవ్వలేదు. నాడు వైసీపీ కార్యకర్తలైన వలంటీర్లు చెప్పినట్టు చేయాల్సిన దుస్థితి. సర్వీస్‌ రూల్స్‌ లేవు. పదోన్నతి చానల్‌ లేదు. రెండేళ్ల కాలపరిమితి పూర్తయినా 9 నెలలు ఆలస్యంగా ప్రొబేషన్‌ ప్రకటించారు.

నాడు గాలికొదిలి.. నేడు నీతులు

  • సచివాలయాల ఉద్యోగులపై జగన్‌ మొసలి కన్నీరు

  • ఓ ప్రణాళిక లేకుండా వ్యవస్థకు శ్రీకారం

  • రికార్డు అసిస్టెంట్‌ స్థాయి పోస్టుకు డిగ్రీ అర్హత

  • జాబ్‌ చార్ట్‌, సర్వీసు రూల్స్‌, పదోన్నతి చానల్‌ లేవు

  • వలంటీర్లు చెప్పినట్లు చేయాల్సిన దుస్థితి

  • కాలపరిమితి దాటిన తొమ్మిది నెలలకు ప్రొబేషన్‌

  • అందులోనూ కొందరికే.. అరకొరగా జీతాల పెంపు

  • జగన్‌ దెబ్బకు 12 వేల మంది ఉద్యోగాలు వదిలేశారు

  • ఇప్పుడు వారిని ఉద్దరించినట్టుగా బిల్డప్‌

  • జగన్‌ తీరుపై సచివాలయ ఉద్యోగుల విస్మయం

జగన్‌ సర్కారులో ఉద్యోగాలైతే ఇచ్చారు కానీ చాలా కాలం జాబ్‌ చార్ట్‌ ఇవ్వలేదు. నాడు వైసీపీ కార్యకర్తలైన వలంటీర్లు చెప్పినట్టు చేయాల్సిన దుస్థితి. సర్వీస్‌ రూల్స్‌ లేవు. పదోన్నతి చానల్‌ లేదు. రెండేళ్ల కాలపరిమితి పూర్తయినా 9 నెలలు ఆలస్యంగా ప్రొబేషన్‌ ప్రకటించారు. అరకొరగా జీతాలు పెంచారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో చాలామంది ఉద్యోగులకు ప్రొబేషన్‌ ప్రకటించలేదు. అంతా గందరగోళం. జగన్‌ దెబ్బకు ఏకంగా 12 వేలమంది ఉద్యోగాలు మానేశారు. సొంత ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగం మానేశారంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.

కూటమి ప్రభుత్వం వచ్చాక సచివాలయ వ్యవస్థను గాడిన పెట్టారు. సర్వీసు రూల్స్‌ రూపొందించారు. చాలామంది ఉద్యోగులకు ప్రొబేషన్‌ ప్రకటించి జీతాలు పెంచారు. పలువురికి పదోన్నతులు కల్పించారు. అయితే గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తాను తీసుకొచ్చినందుకే ఆ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం కక్షతో వ్యవహరిస్తోందని జగన్‌ అనడం విచిత్రం. జగన్‌ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

(అమరావతి-ఆంధ్రజ్యోతి): స్థానికంగా పౌరులకు సేవలు అందించాలన్న ఉద్దేశంతో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొస్తున్నట్టు నాడు జగన్‌ సర్కారు ఆర్భాటంగా ప్రకటించింది. లక్షకు పైగా ఉద్యోగాలు ఇస్తున్నట్టు గొప్పలు చెప్పింది. కానీ ఐదేళ్ల పాలనలో సచివాలయ ఉద్యోగుల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి చూపిన దాఖలాల్లేవు. 1.26 లక్షల మంది సచివాలయ ఉద్యోగులను నియమించినా.. నియామకాలు, విధులు అంతా గందరగోళం. జగన్‌ సర్కార్‌ ఐదేళ్లూ వారికి చుక్కలు చూపించింది. వలంటీర్ల కనుసన్నల్లో పనిచేసే దుస్థితి కల్పించింది. నాడు డిగ్రీ అర్హతతో రికార్డు అసిస్టెంట్‌ స్థాయి పోస్టుగా సచివాలయ ఉద్యోగులను నియమించారు. ఏపీపీఎస్సీ పర్యవేక్షణలో డీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టారు. నియామక రాత పరీక్షల్లోనూ అయోమయం.


నోటిఫికేషన్‌లో ఒక రకంగాను, నియామకంలో మరో రకంగాను నిబంధనలు పెట్టారు. డిగ్రీ అర్హత ఉండటంతో ఇదేదో పెద్ద ఉద్యోగం అన్న భావనతో పరీక్షలకు తయారయ్యి ఉద్యోగాలు పొందారు. అయితే జగన్‌ ప్రభుత్వం సక్రమంగా ఉద్యోగుల ప్రొబేషన్‌ ప్రకటించలేదు. సర్వీసు రూల్స్‌, పదోన్నతి చానల్‌ కల్పించకుండా గాలికొదిలేసింది. దీంతో దాదాపు 12 వేలమంది ఉద్యోగాలను వదిలేసి ప్రైవేట్‌ ఉద్యోగాల్లోకి వెళ్లిపోయారు. కొంత మంది సొంత గ్రామాల్లో పోస్టులైనందున ఏదో విధంగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. సచివాలయ ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం చలో విజయవాడ కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో జగన్‌ వారి పట్ల మొసలి కన్నీరు కార్చడంపై పలువురు ఉద్యోగులే విస్తుపోతున్నారు. నాడు ఉద్యోగుల ప్రయోజనాలను పట్టించుకోని జగన్‌ ఇప్పుడు వారి సంక్షేమం గురించి మాట్లాడటంపై ఎద్ద్దేవా చేస్తున్నారు.


జగన్‌ హయాంలో ఇదీ పరిస్థితి

  • ఒక్కో సచివాలయంలో 6 నుంచి 14 మంది దాకా ఉద్యోగులను నియమించారు. వారికి జాబ్‌చార్జ్‌ చాలా కాలం ఇవ్వలేదు.

  • కేవలం నవరత్నాల పథకాల అమలు కోసం సచివాలయ ఉద్యోగులు పనిచేసే పరిస్థితి ఉండేది. అది కూడా వైసీపీ కార్యకర్తలైన వలంటీర్ల ఆదేశాల ప్రకారం పనిచేయాల్సి వచ్చేది.

  • ముందుచూపు లేకుండా ప్రభుత్వ వ్యవస్థలో ఇలాంటి రిక్రూట్‌మెంట్‌లు చేయడం వల్ల సర్వీస్‌ రూల్స్‌ గందరగోళంగా మారిపోయాయి.

  • రికార్డు అసిస్టెంట్‌ స్థాయి పోస్టులు సృష్టించిన జగన్‌ సర్కార్‌ వారికి సర్వీస్‌ రూల్స్‌ గాని, పదోన్నతి చానల్‌ గాని కల్పించకుండా గాలికొదిలేసింది. ఉద్యోగంలో చేరినవారు అదే ఉద్యోగంలో రిటైర్డ్‌ అయ్యే పరిస్థితి కల్పించింది.

  • రెండేళ్ల ప్రొబేషన్‌ పీరియడ్‌ పూర్తి అయినప్పటికీ 9 నెలలు ఆలస్యంగా ప్రొబేషన్‌ ప్రకటించి అరకొరగా జీతాలు పెంచారు. ప్రొబేషన్‌ ప్రకటించేందుకు కూడా క్లిష్టంగా డిపార్ట్‌మెంటల్‌ టెస్ట్‌ పెట్టి ఇబ్బందులు పెట్టారు. జగన్‌ సర్కార్‌ ఐదేళ్ల పాలనలో చాలామంది సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ ప్రకటించలేదు.

  • ఆయా శాఖల ద్వారా ఉద్యోగులను నియమిస్తున్నామని మొదట చెప్పారు. ఆ తర్వాత అందరూ గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోకి వస్తారని మార్పులు చేశారు. మళ్లీ ఆయా శాఖల ద్వారా పదోన్నతి చానల్‌ ఉంటుందని, గ్రామ, వార్డు సచివాలయాల పాలనా నియంత్రణ ఉంటుందని వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసి అయోమయానికి గురిచేశారు.

  • పరిస్థితి నచ్చక కొంతమంది ఉద్యోగాల్ని వదిలేసి వెళ్లిపోయారు. అయితే ఉద్యోగులు అప్పటి వరకు తీసుకున్న గౌరవవేతనాన్ని కూడా వారి నుంచి ప్రభుత్వం వసూలు చేసింది.

  • జగన్‌ సర్కార్‌ హయాంలో పలువురు వైసీపీ కార్యకర్తలు ఉద్యోగులపై దాడులు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే సిబ్బందికి జగన్‌ సర్కార్‌ పట్ల వ్యతిరేకత ఏర్పడింది.


కూటమి సర్కార్‌లో సంస్కరణలు

  • కూటమి సర్కార్‌ వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చారు. జగన్‌ సర్కార్‌ తెచ్చిన వ్యవస్థ అయినప్పటికీ సీఎం చంద్రబాబు ఈ శాఖకు స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు శాఖగా మార్చి పలు మార్పులు తీసుకొచ్చారు.

  • సచివాలయాల్లో ఎవరేం చేస్తున్నారో? ఎవరు ఏ విధులు నిర్వహిస్తున్నారో? పని లేకుండా ఎవరు ఖాళీగా ఉంటున్నారో? అధ్యయనం చేసి సిబ్బందికి రేషనలైజేషన్‌ చేశారు.

  • జనాభాను బట్టి సచివాలయాలను మూడు కేటగిరీలుగా చేసి, ఆయా సచివాలయాల్లో అవసరమైన మేర సిబ్బందిని నియమించారు.

  • సచివాయాల్లోని సిబ్బందికి సర్వీసు రూల్స్‌ రూపొందించారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖతో పాలు పలు శాఖలు పదోన్నతులు కల్పించాయి. ఆయా శాఖల్లో జూనియర్‌ అసిస్టెంట్‌ క్యాడర్‌లో నియమించుకున్నాయి.

  • కూటమి సర్కార్‌ వచ్చిన తర్వాత పలువురు ఉద్యోగులకు ప్రొబేషన్‌ ప్రకటించి జీతాలు పెంచారు.

  • అడ్డగోలుగా ఉన్న వ్యవస్థను దారికి తెచ్చేందుకు మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, ఉన్నతాధికారులు గట్టిగా కృషి చేస్తున్నారు.

  • పలు శాఖల నుంచి వచ్చిన సిబ్బంది కావడం, అందరికీ ఒకే సర్వీసురూల్స్‌ వర్తించకపోవడం తదితర సమస్యలతో ఈ వ్యవస్థ గందరగోళంగా ఉంది. ఉన్నత విద్య చదువుకున్న యువతను ఏదో ఒకరకంగా ప్రభుత్వ సేవల్లో వినియోగించుకోవాలని కూటమి సర్కార్‌ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. పలు శాఖలకు వారిని డిప్యుటేషన్‌పై నియమించేందుకు కూడా చర్యలు తీసుకుంది.

  • సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగానే గుర్తిస్తున్నామని, ఇతర ఉద్యోగులకు కల్పించిన సౌకర్యాలు వారికి కూడా కల్పిస్తున్నామని కూటమి ప్రభుత్వం చెబుతూనే ఉంది.

ఈ వార్తలనూ చదవండి...

పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్‌ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ

పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..

Updated Date - Sep 29 , 2026 | 03:14 AM