Share News

వెలిగొండ కట్టింది నేనే!చంద్రబాబు క్రెడిట్‌ చోరీ

ABN , Publish Date - Aug 27 , 2026 | 06:26 AM

వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసింది తానేనని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ప్రకటించారు. సీఎం చంద్రబాబుకు క్రెడిట్‌ చోరీ చేయడమే తెలుసన్నారు. ఈ ప్రాజెక్టును ఎవరు పూర్తి చేశారో.. ఎవరి హయాంలో నిధులు మంజూరయ్యాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని చెప్పారు.

వెలిగొండ కట్టింది నేనే!చంద్రబాబు క్రెడిట్‌ చోరీ

బీసీ నేతలపై తప్పుడు కేసులు: జగన్‌

అమరావతి, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసింది తానేనని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ప్రకటించారు. సీఎం చంద్రబాబుకు క్రెడిట్‌ చోరీ చేయడమే తెలుసన్నారు. ఈ ప్రాజెక్టును ఎవరు పూర్తి చేశారో.. ఎవరి హయాంలో నిధులు మంజూరయ్యాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని చెప్పారు. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి, తాను నిధులు మంజూరు చేసి.. టన్నెల్‌ పనులు పూర్తి చేశామన్నారు, బుధవారం తాడేపల్లి ప్యాలెస్‌లో ఎప్పటిలాగే ఎంపిక చేసుకున్న విలేకరులను పిలిపించుకుని జగన్‌ మాట్లాడారు. రాష్ట్రంలో డేంజర్‌బెల్స్‌ మోగుతున్నాయని, ఎల్‌నినో ప్రభావంతో రాయలసీమతో పాటు కోస్తాంధ్రలో తీవ్ర కరువు ఉన్నా.. ప్రత్యామ్నాయ పంటల ప్రణాకలు అమలు చేయకుండా చంద్రబాబు కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారని ఆరోపించారు. మొత్తం 28 జిల్లాల్లోనూ 625 మండలాల్లో కరువు నెలకొందన్నారు. శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు 854 అడుగులకు చేరితే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా కృష్ణా జలాలను ఇవ్వడం సాధ్యం కాదని జగన్‌ అన్నారు. ఇలాగైతే రాయలసీమకు నీళ్లెలా ఇస్తారని జగన్‌ ప్రశ్నించారు. ప్రాజెక్టులన్నిటిలోనూ జలాలు అడుగంటాయన్నారు. ఇలాంటి తరుణంలో పంటలకు నీళ్లివ్వకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ జల విద్యుదుత్పత్తికి కృష్ణా జలాలను తోడేస్తున్నాయని ఆక్షేపించారు. విద్యుత్‌ అవసరాల కోసం 48,000 క్యూసెక్కులు తోడేస్తుంటే శ్రీశైలం ఖాళీ అయిపోతోందన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నింటిని చంద్రబాబు ఎత్తేశారని జగన్‌ ఆరోపించారు. పంటల బీమాను పూర్తిగా ఎత్తేశారని అన్నారు. తన ఐదేళ్ల పాలనలో ఏకంగా మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ కింద రూ.7800 కోట్లు వ్యయం చేశామని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కరువయ్యాయన్నారు. అద్దంకిలో పోలీసులు గంజాయిని తరలిస్తూ దొరికిపోయారని, పోలీసులు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై మాఫియాగా మారారని విమర్శించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరేందుకు చంద్రబాబు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తానంటూ ఆయన మాయమాటలు చెబుతున్నారన్నారు.

Updated Date - Aug 27 , 2026 | 06:55 AM