విజయ డెయిరీ డైరెక్టర్లకు షాక్!
ABN , Publish Date - Nov 17 , 2026 | 06:44 AM
కృష్ణా జిల్లా పాల ఉత్పత్తుదారుల పరస్పర సహకారం సంఘం (విజయ డెయిరీ) పాలకమండలి డైరెక్టర్ల ఎన్నికల విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
వారి ఎన్నిక రద్దు ఉత్తర్వులకు హైకోర్టు సమర్థన
సాయి వెంకటరమణ, బాలవర్ధనరావు,
విజయ డెయిరీ పిటిషన్ల కొట్టివేత
అమరావతి, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లా పాల ఉత్పత్తుదారుల పరస్పర సహకారం సంఘం (విజయ డెయిరీ) పాలకమండలి డైరెక్టర్ల ఎన్నికల విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2023 ఆగస్టు 12న జరిగిన డైరెక్టర్ల ఎన్నికను రద్దు చేస్తూ రాష్ట్ర సహకార ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును సమర్థించింది. వీరపనేని శివరామప్రసాద్ నామినేషన్‌ను పరిగణనలోకి తీసుకుని డైరెక్టర్ పోస్టులకు తిరిగి ఎన్నికలు నిర్వహించాలన్న ట్రైబ్యునల్ ఉత్తర్వులతోనూ ఏకీభవించింది. సదరు ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ డైరెక్టర్లుగా ఎన్నికైన వేమూరి సాయి వెంకటరమణ, దాసరి వెంకట బాలవర్ధనరావు(ప్రస్తుత చైర్మన్), విజయ డెయిరీ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. మరోవైపు డైరెక్టర్ పోస్టులకు జరిగిన ఎన్నికల్లో పెనమకూరు పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు వీరపనేని శివరామప్రసాద్ వేసిన నామినేషన్‌ను తిరస్కరిస్తూ ఎన్నికల అధికారి జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు తప్పుబట్టింది. కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘం, శివరామప్రసాద్ సతీమణి పద్మజ ప్రొప్రయిటర్‌గా ఉన్న రాట్నాలమ్మ డెయిరీ మధ్య ఆర్థిక లావాదేవీల వివాదాన్ని కారణంగా చూపుతూ ఆయన నామినేషన్‌ను తిరస్కరించడాన్ని ఆక్షేపించింది.
ట్రైబ్యునల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్ సోమవారం తీర్పు ఇచ్చారు. విజయ డెయిరీ పాలకమండలి డైరెక్టర్ పోస్టు కోసం 2022 ఆగస్టులో జరిగిన ఎన్నికల్లో పెనమకూరు పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు వీరపనేని శివరామప్రసాద్ నామినేషన్ వేశారు. అయితే ఆయన భార్య ప్రొప్రయిటర్‌గా ఉన్న రాట్నాలమ్మ డెయిరీ.. సహకార సంఘానికి బకాయిపడిందని, బైలా ప్రకారం బకాయిపడినవారు పోటీ చేయడానికి అనర్హులని పేర్కొంటూ ఆయన నామినేషన్‌ను ఎన్నికల అధికారి తిరస్కరించారు. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శివరామప్రసాద్ సహకార ట్రైబ్యునల్‌ను(ఈవోపీ నెం.56/2022) ఆశ్రయించగా.. ఎన్నికల అధికారి నిర్ణయాన్ని ట్రైబ్యునల్ సమర్థించింది. దీంతో ట్రైబ్యునల్ నిర్ణయంపై శివరామప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల అధికారి ఉత్తర్వులను చెల్లనవిగా ప్రకటించడంతో పాటు మూడు డైరెక్టర్ పోస్టులకు తిరిగి ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలని కోరారు. డైరెక్టర్ పోస్టు కోసం 2023 ఆగస్టులో జరిగిన ఎన్నికల్లో శివరామ ప్రసాద్ మరోసారి నామినేషన్ వేయగా సహకార సంఘానికి బకాయిపడ్డారనే కారణంతోనే తిరస్కరించారు. అలాగే 2023 నామినేషన్‌లో ఆయన్ను బలపరిచిన వ్యక్తి చివరి రెండు జనరల్ బాడీ సమావేశాలకు హాజరుకాలేదంటూ మరో కారణం చూపారు. నామినేషన్‌ను తిరస్కరిస్తూ ఎన్నికల అధికారి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ శివరామప్రసాద్ మళ్లీ సహకార ట్రైబ్యునల్‌ను(ఈవోపీ నం.16/2023)ని ఆశ్రయించారు. విచారించిన ట్రైబ్యునల్.. ఆయన నామినేషన్‌ను పరిగణనలోకి తీసుకుని డైరెక్టర్ పోస్టులకు తిరిగి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ డైరెక్టర్లుగా ఎన్నికైన వేమూరి సాయి వెంకటరమణ, దాసరి వెంకట బాలవర్ధనరావు, కృష్ణా జిల్లా పాల ఉత్పత్తుదారుల సంఘం వేర్వేరుగా పిటిషన్లు వేశారు. వాటిపై సోమవారం నిర్ణయాన్ని వెల్లడించారు.
తీర్పులో ఏముందంటే..
‘వీరపనేని శివరామప్రసాద్ సతీమణికి చెందిన రాట్నాలమ్మ డెయిరీ... కృష్ణాజిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘానికి కోట్ల రూపాయలు బకాయిపడిందని, బైలా 24(1)(హెచ్)(ఈ) ప్రకారం బకాయి ఉన్నవారు పోటీ చేయడానికి అనర్హులనే కారణంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. అయితే రికార్డులను పరిశీలిస్తే.. రాట్నాలమ్మ డెయిరీ, సహకార సంఘానికి మధ్య వ్యాపార లావాదేవీలు 2021నాటికే ముగిశాయి. 2022, 23 నామినేషన్ల సమయానికి వారి మధ్య ఎలాంటి ఒప్పందాలూ లేవు. రాట్నాలమ్మ డెయిరీకి శివరామప్రసాద్ సతీమణి పద్మజ ఏకైక ప్రొప్రయిటర్. వ్యాపార నష్టాలకు, అప్పులకు ఆమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం.. చట్టపరమైన గ్యారెంటీ పత్రాలు లేకుండా భార్య వ్యాపార అప్పులు, ఒప్పందాలకు.. నేరుగా భర్తను, కుటుంబ సభ్యులను బాధ్యులను చేయడానికి వీల్లేదు. కాబట్టి, శివరామప్రసాద్ నామినేషన్ తిరస్కరించడం చట్టవిరుద్ధం. ట్రైబ్యునల్ పనివేళలు ముగిసిన తర్వాత.. సభ్యుడి రిటైర్మెంట్ రోజు నిర్ణయాన్ని వెల్లడించడాన్ని పిటిషనర్ ఆక్షేపించారు. అయితే, దీనికి ఎలాంటి దురుద్దేశాలూ ఆపాదించలేం’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.