Share News

ఖరీఫ్‌కు ఊపిరి

ABN , Publish Date - Sep 24 , 2026 | 04:52 AM

ఎల్‌నినో ప్రభావంతో 100 రోజులుగా వర్షాభావంతో ఎండుముఖం పడుతున్న ఖరీఫ్‌ పంటలకు తీవ్ర వాయుగుండం ఊపిరి పోసింది.

ఖరీఫ్‌కు ఊపిరి

  • తీవ్ర వాయుగుండంతో నాలుగు రోజులుగా వర్షాలు

  • 55 శాతం నుంచి 41.5 శాతానికి తగ్గిన వాన లోటు

  • పత్తి, వరి, మిర్చి, మొక్కజొన్న, ఇతర పంటలకు జీవం

అమరావతి, విశాఖపట్నం, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో 100 రోజులుగా వర్షాభావంతో ఎండుముఖం పడుతున్న ఖరీఫ్‌ పంటలకు తీవ్ర వాయుగుండం ఊపిరి పోసింది. గత నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు పత్తి, వరి, మిర్చి, మొక్కజొన్న, ఇతర పంటలకు జీవం పోశాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో కురుస్తున్న భారీ వర్షాలు వరి, మొక్కజొన్నకు, దక్షిణకోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పత్తి, మిరప, ఇతర పంటలు, ఉద్యాన తోటలకు నీటి తడులు అందించినట్లైందని రైతులు, అధికారులు చెప్తున్నారు. వర్షపాతం లోటు 55 శాతం నుంచి 41.5 శాతానికి తగ్గింది. మొన్నటి దాకా ఆరు జిల్లాలు తీవ్రలోటులో ఉండగా, ప్రస్తుతం అన్నమయ్య జిల్లా మాత్రమే తీవ్రలోటులో కొనసాగుతోంది.

ఎక్కడ ఎంత వర్షం?

బుధవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో 8.82, లక్ష్మీనరపుపేటలో 7.95, ఎన్టీఆర్‌ జిల్లా విసన్నపేటలో 7.33, ఎ.కొండూరులో 7.25, రెడ్డిగూడెంలో 7.14, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో 6.9, ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో 6.4, ఎన్టీఆర్‌ జిల్లా మైలవరంలో 6.15, శ్రీకాకుళం జిల్లా మందసలో 6.05 సెంటీమీటర్ల వాన పడింది. ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు సరిహద్దు ప్రాంతాల నుంచి హిరమండలం రిజర్వాయర్‌కు భారీగా వరద చేరుతోంది. గేట్లెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్‌ వర్షాలు, వరదల ప్రభావాన్ని నిశితంగా పర్యవేక్షిస్తోంది. ఆర్టీజీఎస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి తీవ్ర వాయుగుండం కదలికలను, వాతావరణ మార్పులను గమనిస్తూ క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తోంది.


తీరం దాటిన తీవ్ర వాయుగుండం

తీవ్ర వాయుగుండం తీరం దిశగా వచ్చేసరికి వేగం పెంచింది. బుధవారం 10 గంటలకు భోగాపురం, కళింగపట్నం మధ్య తీరాన్ని తాకింది. గురువారం తెల్లవారుజాము వరకు తీరం దాటే ప్రక్రియ కొనసాగింది. ఆ సమయంలో గంటకు 50 నుంచి 60, అప్పుడప్పుడు 70 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. తీరం దాటిన తర్వాత తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్ర మీదుగా ఒడిశా వైపు పయనించనున్నదని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా నుంచి మధ్య, ఉత్తర భారతం వైపు వెళ్లి ఈనెల 25వ తేదీకల్లా క్రమేపీ బలహీనపడనున్నదని అంచనా వేసింది. ఉత్తరాంధ్ర, దానికి ఆనుకొని దక్షిణ ఒడిసాలోని నదులకు కేంద్ర జలసంఘం వరద హెచ్చరికలు జారీ చేసింది.

నేడు కోస్తాలో భారీ వర్షాలు

గురువారం ఉత్తరకోస్తాలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. గురు, శుక్రవారాల్లో తీరం వెంబడి బలమైన గాలులు వీయనున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అక్కడక్కడా ఆకస్మిక వరదలు సంభవించే అవకాశమూ ఉందని హెచ్చరించింది. మరో 48గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సహాయ చర్యల కోసం శ్రీకాకుళంలో 3, అల్లూరి, విశాఖ జిల్లాల్లో రెండేసి, పోలవరం, అనకాపల్లి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచినట్టు తెలిపింది.

Updated Date - Sep 24 , 2026 | 04:52 AM