Share News

జగనే కాంగ్రెస్‌కి వెన్నుపోటు దారుడు.. విజయసాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Nov 25 , 2026 | 06:46 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై పరివర్తన రాజనీతి పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఆత్మ గౌరవానికి భంగం కలగడంతోనే వైసీపీని, తన రాజ్యసభను వదిలిపెట్టానని స్పష్టం చేశారు.

జగనే కాంగ్రెస్‌కి వెన్నుపోటు దారుడు.. విజయసాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్
Vijay Sai Reddy

ఢిల్లీ, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) పరివర్తన రాజనీతి పార్టీ (PRP) అధ్యక్షుడు, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijay Sai Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఆత్మ గౌరవానికి భంగం కలగడంతోనే వైసీపీని, తన రాజ్యసభను వదిలిపెట్టానని స్పష్టం చేశారు. ఈరోజు (బుధవారం) ఢిల్లీ వేదికగా మీడియాతో విజయసాయిరెడ్డి మాట్లాడారు. తనను వెన్నుపోటు దారుడని జగన్ అండ్ కో అనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. జగనే కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు దారుడని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వైఎస్సార్‌ను రెండుసార్లు ముఖ్యమంత్రిని చేసిందని ప్రస్తావించారు. వైఎస్సార్‌ చనిపోయిన తర్వాత జగన్ హస్తం పార్టీ సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేశారని గుర్తుచేశారు.సీఎం పదవి ఇవ్వనందుకు జగన్ కాంగ్రెస్‌కి రాజీనామా చేశారని ఆగ్రహించారు. ఇది ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ తన ఆత్మకథ పుస్తకంలో ప్రస్తావించారని అన్నారు.


ముఖ్యమంత్రి పదవి కోసం హస్తం పార్టీని జగన్ ఒత్తిడి చేశారని విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. జగన్ ఎలా రాజీనామా చేశారో తాను అలానే రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు. తాను ఎలా ఆయనకు వెన్నుపోటు పొడిచేవాడిని అవుతానని ప్రశ్నించారు. వైఎస్ కుటుంబానికి 40 ఏళ్లు సేవా చేశానని ప్రస్తావించారు. జగన్‌తో పాటు ఏడాది పాటు జైల్లో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేసిన త్యాగం, పని వల్ల తనకు పార్టీలో పదవి ఇచ్చారని స్పష్టం చేశారు. అన్ని వర్గాలకు పరివర్తన రాజనీతి పార్టీలో అవకాశం ఉంటుందని మాటిచ్చారు. తమ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనారిటీ సామాజికవర్గాలకు అవకాశం కల్పిస్తానని భరోసా కల్పించారు. ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా పరివర్తన రాజనీతి పార్టీ ఉంటుందని తెలిపారు.ఆంధ్రకు మూడో ఆల్టర్నేటివ్ పార్టీ అవసరమని తెలిపారు. రెండు రాజకీయ కుటుంబాలు, రాష్ట్రంలో పార్టీలను నడుపుతున్నాయని అన్నారు. ఒకరు ఒక సామాజికవర్గానికి చెందిన వారని.. మరొకరు క్రిస్టియన్‌కి చెందినవారని చెప్పారు.తమ పార్టీలో యువతను ప్రోత్సహిస్తామని తెలిపారు.


తాను పరివర్తన పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండనని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్, అసెంబ్లీ సీట్లలో 66 శాతం యువతకు కేటాయిస్తామని మాటిచ్చారు. జెన్‌జీకి అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. కొత్త ఏడాది ఉగాది నుంచి రాష్ట్రంలో పాదయాత్ర చేస్తానని అన్నారు. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి పాదయాత్ర నిర్వహిస్తూ రాష్ట్రం మొత్తం తాను తిరుగుతానని తెలిపారు. 2019- 2024 మధ్య ఏపీలో మత మార్పిడులు పెరిగాయని చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా ఎవరైనా ఏదైనా మతాన్ని ఆచరించవచ్చని అన్నారు. ఒత్తిడి చేసి మత మార్పిడులు చేయకూడదని తెలిపారు. ఏపీలో రిజర్వాయర్ల నిర్మాణంపై దృష్టి పెడతామని చెప్పారు. 5 వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తుందని తెలిపారు.రాష్ట్రాన్ని సమానంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. మహిళలకు రక్షణ కల్పిస్తామని మాటిచ్చారు.


ఏపీలో ఉద్యోగ అవకాశాలు పెంచుతామని అన్నారు. హిందువుల్లో వివక్షకు గురవుతున్నారని.. అందుకే క్రిస్టియన్లుగా మారుతున్నారని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. కమ్మ, కాపు, రెడ్డి కులాల వారు వారి కోసం చర్చిలు కట్టుకుంటున్నారని, ఆ కులాల వారు మాత్రమే ఆ చర్చిలోకి అనుమతి ఉంటుందని తెలిపారు. ఏపీలో కల్వరి టెంపుల్స్ ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. సమాజాన్ని విభజించేలా కొందరు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హిందూ సంస్కృతి, నమ్మకాలను విమర్శించే వారిపై ఎందుకు చర్యలు లేవని ప్రశ్నించారు. గుడి ఆదాయం నుంచి పూజారులు, ఆలయ మరమ్మతుల పనులు జరుగుతున్నాయని..కానీ మసీదులు, చర్చిల కోసం ప్రభుత్వ నిధులను ఎందుకు ఖర్చు చేస్తున్నాయని విజయసాయిరెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.

Updated Date - Nov 25 , 2026 | 07:14 PM