అంబటి ఇంటిపై దాడి ఘటనలో..టీడీపీ నేతలపై కేసు నమోదు
ABN , Publish Date - Feb 03 , 2026 | 03:59 AM
వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలపై కేసు నమోదు అయింది.
కార్పొరేటర్ బుజ్జి సహా పలువురిపైఫిర్యాదు చేసిన రాంబాబు
దాని ఆధారంగా స్పందించిన పోలీసులు
అంబటి రాంబాబును కస్టడీకి ఇవ్వండి
కోర్టులో పోలీసుల పిటిషన్
రాష్ట్ర వ్యాప్తంగా రాంబాబు పై కేసులు
గుంటూరు, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలపై కేసు నమోదు అయింది. అంబటి రాంబాబు ఫిర్యాదు మేరకు గుంటూరులోని పట్టాభిపురం పోలీ్‌సస్టేషన్ లో సోమవారం కేసు నమోదు చేశారు. టీడీపీ కార్పొరేటర్ వేములపల్లి శ్రీ రాంప్రసాద్ అలియాస్ ఇసుక బుజ్జితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు తన ఇంటిపై దాడి చేసి కార్లు, ఫర్నిచర్ ధ్వంసం చేశారని, కిటికీ అద్దాలు పగలగొట్టారని అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. తన ఇంటికి వచ్చే దారులన్నింటినీ మూసి, తనను అక్రమంగా నిర్బంధించి, దౌర్జన్యం చేసి బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదుచేశారు. కాగా, అంబటి రాంబాబును విచారించేందుకు పోలీసు కస్టడీకి ఇవ్వాల్సిందిగా నల్లపాడు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్ మంగళవారం బెంచ్ పైకి రానుంది. కస్టడీకి అనుమతి వచ్చిన పక్షంలో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తీసుకురానున్నారు. సీఎంను అసభ్య పదజాలంతో దూషించిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా పోలీస్ ేస్టషన్లో కేసులు నమోదయ్యాయి. అనంతపురం, అనకాపల్లితో పాటు రాష్ట్రంలోని వివిధ పోలీస్ ేస్టషన్లలో కేసులు నమోదు చేశారు. ఈ కేసులన్నింటిలో పోలీసులు కోర్టులో పీటీ వారంట్లు వేయనున్నట్లు తెలుస్తోంది.
అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా!
వైసీపీ హయాంలో తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను సానుభూతిపరులతో పాటు సామాన్య ప్రజలను సైతం కేసుల పేరుతో వేధింపులకు గురి చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే సాగుతో చట్టాన్ని పెద్దఎత్తున దుర్వినియోగం చేశారు. పార్టీ జాతీయ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఇలా ఎన్ని దాడులు చేసినా టిడిపి నేతలు ఇచ్చిన ఫిర్యాదులను ఆనాడు పోలీసులు కనీసం తీసుకోవడానికి కూడా సాహసించలేదు. కానీ, అంబటి రాంబాబు కార్యాలయంపై దాడికి పాల్పడిన ఘటనలో ఇప్పుడు పోలీసులు టీడీపీ నాయకులపై కేసు నమోదు చేశారు. ఇదే వైసీపీకీ, టీడీపీకీ ఉన్న తేడా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.