రాజధానిలో బిట్స్ అమరావతి
ABN , Publish Date - Jan 31 , 2026 | 05:10 AM
రాజధాని అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ కొలువుతీరబోతోంది. బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సె్‌స(బీఐటీఎస్) అమరావతిలో 70.011 ఎకరాల్లో ప్రాంగణాన్ని ఏర్పాటు చేయబోతోంది.
మందడం-వెంకటపాలెంలో 70 ఎకరాల్లో ప్రాంగణం
పూర్తయిన భూ విక్రయ ఒప్పందం
ప్రారంభమవుతున్న నిర్మాణ పనులు
మూడు దశల్లో అభివృద్ధి... 10 వేల మందికి విద్యావకాశాలు
గుంటూరు, జనవరి 30(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ కొలువుతీరబోతోంది. బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సె్‌స(బీఐటీఎస్) అమరావతిలో 70.011 ఎకరాల్లో ప్రాంగణాన్ని ఏర్పాటు చేయబోతోంది. బిట్స్‌కు తుళ్లూరు మండలంలోని మందడం, వెంకటపాలెంలో రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించింది. ఈ మేరకు ఏపీసీఆర్డీఏతో శుక్రవారం బిట్స్ ప్రతినిధులు భూ విక్రయ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. కార్యక్రమంలో ఏపీసీఆర్డీఏ ఎస్ట్టేట్స్ విభాగం జాయింట్ డైరెక్టర్ వీ.డేవిడ్ రాజు, బిట్స్ పిలానీ ప్రతినిధిగా డిప్యూటీ రిజిస్ర్టార్ వీవీఎ్‌సఎన్ మూర్తి పాల్గొన్నారు. మందడం సబ్ రిజిస్ర్టార్ సి.హెచ్. రాంబాబు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. సంస్థ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. ‘బిట్స్ అమరావతి క్యాంప్‌సను మూడు దశల్లో అభివృద్ధి చేస్తాం. మొదటి దశలోనే సుమారు రూ.1,000 కోట్ల పెట్టుబడితో క్యాంపస్ పనులు ప్రారంభిస్తున్నాం. ఆధునిక మౌలిక వసతులతో కూడిన స్మార్ట్ భవనాలు, కృత్రిమ మేధ ఆధారిత సేవలు, ఆధునిక బోధన పద్ధతులు, పర్యావరణహిత నిర్మాణాలతో ఈ క్యాంప్‌సను కొత్తతరం విజ్ఞాన కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. 2027 నుంచి అమరావతి క్యాంప్‌సలో విద్యార్థులకు ప్రవేశాలు లభించేలా నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేస్తాం. దశలవారీగా 10,000 మంది విద్యార్థులు అమరావతి బిట్స్‌లో విద్యను అభ్యసించేలా ప్రణాళికాయుతంగా కార్యకలాపాలు నిర్వహిస్తాం. ఈ క్యాంపస్ ద్వారా వందలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి’ అని వారు తెలిపారు.