ఏపీ కరోనా జగన్ : మంత్రి సత్యకుమార్
ABN , Publish Date - Jan 31 , 2026 | 05:23 AM
మాజీ సీఎం జగన్ రాష్టాన్ని పట్టి పీడించిన కరోనా వైరస్ అని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. కూటమి ప్రభుత్వంలోని వైద్య ఆరోగ్య రంగంపై అబద్ధాలు వల్లిస్తూ నిత్యం విషం చిమ్ముతున్న ఆయన...
గుంటూరు మెడికల్, జనవరి 30(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్ రాష్టాన్ని పట్టి పీడించిన కరోనా వైరస్ అని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. కూటమి ప్రభుత్వంలోని వైద్య ఆరోగ్య రంగంపై అబద్ధాలు వల్లిస్తూ నిత్యం విషం చిమ్ముతున్న ఆయన... తన హయాంలో పలు ఆసుపత్రులు, వైద్య కళాశాలల నిర్మాణాలను పట్టించుకోకుండా అర్ధాంతరంగా వదిలేశా అని మంత్రి మండిపడ్డారు. శుక్రవారం గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రిలో జరిగిన కానూరి జింకానా తల్లీ పిల్లల ఆరోగ్య కేంద్రం భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కలసి మంత్రి పాల్గొన్నారు. సభలో జింకాన బిల్డింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బాబురెడ్డి సాగిరెడ్డి మాట్లాడుతూ... గత ప్రభుత్వ హయాంలో తమకు ఎదురైన చేదు అనుభవాలను వివరించారు. ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను, మంత్రులను కలిసేందుకు తాము అమెరికా నుంచి ఇక్కడకు వస్తే కనీసం వారి సమయం కూడా దొరికేదికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సమయంలో ఈ నిర్మాణం ఆగిపోతుందని భయపడ్డామని, ఆ సమయంలో డాక్టర్ ఉమా గవిని వ్యక్తిగతంగా రూ.20 కోట్లు నిధులు విరాళంగా ఇవ్వడంతో తమలో ఆత్మవిశ్వాసం పెరిగి సొంత నిధులతో భవన నిర్మాణం పూర్తి చేశామని వివరించారు. అనంతరం దీనిపై స్పందించిన మంత్రి.. 2020లో కరోనా కారణంగా రెండేళ్ల పాటు కానూరి జింకానా నిర్మాణం నిలిచిపోగా, అనంతరం మరో రెండేళ్ల పాటు జగన్ ప్రభుత్వం నిధులు, అనుమతులు ఇవ్వకపోవడంతో పనులు ఆగిపోయినట్లు తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016లో భూమి పూజ జరిగినా, జగన్ దీనికి నిధులు ఇవ్వలేదని విమర్శించారు.