సర్కారు చెప్పినా.. చెరలోనే!
ABN , Publish Date - Sep 27 , 2026 | 02:55 AM
దేవుడు వర మిచ్చినా, పూజారి కరుణించడు అంటే ఇదేనేమో! పట్టా భూములను నిషేధ జాబితా 22(ఏ) నుంచి తొలగించేందుకు ప్రభుత్వం ఆర్డీవోలకు అధికారం ఇచ్చింది. అయితే, తమ ఆమోదం లేకుండా నిషేధ విముక్తి చేయడానికి వీల్లేదంటూ...
నేతల మోకాలడ్డుతో 22(ఏ)పరిష్కార ప్రక్రియకు అడ్డంకులు
నిషేధ భూముల విముక్తి అధికారం ఆర్డీవోలకు
ప్రక్రియను సులభతరం చేసిన కూటమి సర్కారు
కానీ, ఆర్డీవోలపై డివిజన్ స్థాయిలో తీవ్ర ఒత్తిళ్లు
చాలాచోట్ల ఎమ్మెల్యే, కలెక్టర్ చెబితేనే నిషేధ విముక్తి
బాధితులు వారి చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే
కోర్టులు చెప్పిన కేసుల్లోనూ పెండింగే
కర్నూలు, తిరుపతి, విశాఖ, ఏలూరు, అనకాపల్లిలోభారీగా దరఖాస్తులు పెండింగ్
దేవుడు వర మిచ్చినా, పూజారి కరుణించడు అంటే ఇదేనేమో! పట్టా భూములను నిషేధ జాబితా 22(ఏ) నుంచి తొలగించేందుకు ప్రభుత్వం ఆర్డీవోలకు అధికారం ఇచ్చింది. అయితే, తమ ఆమోదం లేకుండా నిషేధ విముక్తి చేయడానికి వీల్లేదంటూ కొందరు ఎమ్మెల్యేలు, జిల్లాల్లోని కీలక నేతలు కొర్రీలు పెడుతున్నారు. బాధితులు వచ్చి తమను కలిసి ఆమోదం తీసుకోవాలని సదరు నేతలు షరతు పెడుతున్నారు. పెద్దపెద్ద కేసుల్లో తమ ఆమోదం కూడా ఉండాల్సిందేనంటూ కలెక్టర్లు సైతం ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో ప్రభుత్వం చెబుతున్నట్టు నిషేధ విముక్తి ప్రక్రియ సులభతరం కావడం.. కాగితాలకే పరిమితమవుతోంది. ఆచరణలో మళ్లీ మొదటికొచ్చింది. దీంతో అక్టోబరు నెలాఖరు నాటికే పట్టా భూములకు నిషేధ విముక్తి చేయాలన్న సర్కారు సంకల్పం దెబ్బతింటోంది!
(అమరావతి-ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఇచ్చిన నిషేధ విముక్తి వరం ప్రజలకు దక్కడంలో పలుచోట్ల అవరోధాలు ఎదురవుతున్నాయి. కూట మి ప్రభుత్వం ఇటీవలే ఫ్రీ హోల్డ్ భూములకు లైన్‌క్లియర్ చేసిన సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన జీవో 596 ఆధారంగా అసైన్డ్ చట్టం-1977(చట్టసవరణ) పరిధిలో 20 ఏళ్ల అసైన్‌మెంట్ కాలపరిమితి దాటిన భూములను ఫ్రీహోల్డ్‌గా ప్రకటించి, వాటి సాగుదారులకే శాశ్వత హక్కులు కట్టబెడుతూ ఈనెల 15న ప్రభుత్వం జీవో 588ను జారీ చేసింది. అలాగే, జగన్ ప్రభుత్వంలో రాజకీయ కక్షలు, స్థానిక వివాదాలు, గొడవల కారణంగా పట్టా భూములను సైతం నిషేధ జాబితా 22(ఏ)లో చేర్చిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో అన్యాయంగా తమ భూములను నిషేధ జాబితాలో చేర్చారని, వాటికి విముక్తి కల్పించాలని ప్రభుత్వానికి వేలాది మంది రైతులు, భూ హక్కుదారుల నుంచి విన్నపాలు వచ్చాయి.
ఈ సమస్య పరిష్కారం కోసం సర్కారు గత రెండేళ్లుగా అనేక ప్రయత్నాలు చేస్తోంది. కలెక్టర్‌లపై ప్రజాప్రతినిధుల ఒత్తిడి లేకుండా చేసేందుకు అనేక చర్యలు చేపట్టింది. ఇంకా సంస్థాగతంగా రెవెన్యూశాఖలో సంస్కరణలు తీసుకొచ్చింది. జిల్లా కలెక్టర్ కేంద్రీకృతంగా ఉన్న అపరిమిత అధికారాల్లో కోతపెట్టింది. పట్టా భూములను నిషేధ జాబితా 22(ఏ) నుంచి తొలగించే అధికారం కలెక్టర్ నుంచి తప్పించి ఆర్డీవోలకు బదిలీ చేసింది. ఇక ఈ సమస్య పరిష్కారంలో ఏ అడ్డంకులు ఉండకూడదని భావించి, వచ్చే అక్టోబరు నాటికి పట్టా భూములన్నింటినీ నిషేధ జాబితానుంచి తొలగించాలని రెవెన్యూశాఖ టార్గెట్ ఇచ్చింది. దీంతో సమస్య పరిష్కారం అవుతుందని సర్కారు కూడా ఊపిరి పీల్చుకుంటోంది. అందుకే వచ్చే మార్చి నాటికి భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఉంటామని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆచరణలో ప్రభుత్వం అనుకున్నట్లుగా సానుకూల పరిష్కారం దొరకడం లేదు. మళ్లీ పూర్వ పరిస్థితులే వచ్చాయి.
అది ఎలాగంటే..
నిషేధ విముక్తి అధికారం కలెక్టర్ వద్ద ఉన్నప్పుడు జిల్లా మంత్రులు, ఇంచార్జి మంత్రులు, కీలక ప్రజాప్రతినిధులు, బాగా పలుకుబడి ఉన్న ఎమ్మెల్యేల మాట చెల్లుబాటు అయింది. అంటే, వారు సిఫారసు చేసిన కేసుల్లోని భూములే నిషేధ విముక్తిని పొందేవి. దీని వల్ల ప్రభుత్వం ఆశించినట్లుగా భూ వివాదాల పరిష్కారం ముందుకు సాగలేదు. దీన్ని గమనించి కలెక్టర్‌ల వద్ద ఉన్న అధికారం తీసి ఆర్డీవోలకు ఇచ్చింది. ఇప్పుడు పరిష్కారం డివిజన్ స్థాయికి చేరుకుంది అన్నమాట. ఇక్కడే ఎమ్మెల్యేలు, జిల్లా ప్రజాప్రతినిధులు అధికారులను ఒడిసి పట్టుకుంటున్నారు. తమ నియోజకవర్గం పరిధిలోని భూమి సమస్యను తమకు తెలియకుండా పరిష్కరించవద్దని కొందరు ఎమ్మెల్యేలు, ఇంకా కీలక నేతలు ఆర్డీవోలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. తమ మాట విననిపక్షంలో ‘ఈ ఆర్డీవో మాకొద్దు’ అని ఫిర్యాదులు చేస్తామని కూడా హెచ్చరికలు చేయిస్తున్నారు. సాధారణంగా ఆర్డీవోల నియామకంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫారసులే కీలకంగా ఉంటున్నాయి. కాబట్టి, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు కష్టం కలిగే పనిచేయడానికి అధికారులకు ధైర్యం చాలడం లేదు. దీంతో తమ లాగిన్‌కు వచ్చిన 22(ఏ) ఫైళ్ల బాధితులను కొందరు అధికారులు పిలిచి మాట్లాడి..ఎమ్మెల్యేను ప్రసన్నం చేసుకొని ఫోన్ చేయించాలని చెబుతున్నారు. తమకు స్థానిక ఎమ్మెల్యే లేదా పైస్థాయి వ్యక్తుల నుంచి ఫోన్ వస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని కొందరు ఆర్డీవోలు తెగేసి చెబుతున్నారు.
కొన్ని కేసుల్లో బాధితులు వెళ్లి జిల్లా కలెక్టర్‌ను కలిసి రావాలని, ఆయనతో ఫోన్ చేయించాలని కూడా కొందరు ఆర్డీవోలు చెబుతున్నట్లు తెలిసింది. అంటే, పెద్ద విస్తీర్ణం ఉన్న భూముల కేసుల్లో కొందరు కలెక్టర్లు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిసింది. తమ మౌఖిక ఆమోదంతోనే నిషేధ విముక్తి చేయాలని ఓ ఉత్తరాంధ్ర కలెక్టర్ ఆర్డీవోలకు హుకుం జారీ చేశారు. ‘‘మీకు ఆదేశాలు ఉన్నాయని ఫటాఫట్ ఫైల్స్ క్లియర్ చేయవద్దు. మా అనుమతి తీసుకోండి. మేం చెప్పినవే చేయాలి’’ అని రాయలసీమలో ఓ కలెక్టర్ ఆదేశించారు.
పెండింగ్ కూడా పరిష్కారమే..
అధికారిక లెక్కల ప్రకారం కూటమి సర్కారు వచ్చాక అంటే, 2024, జూన్‌నుంచి ఈనెల 7వ తేదీ నాటికి 22(ఏ) విముక్తి కోరుతూ 15,775 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 12,857 పరిష్కరించామని, 2,918 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు రెవెన్యూశాఖ ప్రభుత్వానికి నివేదించింది. పరిష్కరించిన దరఖాస్తులు చాలా ఎక్కువ గానే ఉన్నాయి కదా...ఇక సమస్య ఏమిటి అన్న ప్రశ్న వస్తుంది. కానీ పరిష్కారంలోనే పెద్ద లోగుట్టు ఉంది. 22(ఏ) దరఖాస్తును పరిష్కారం కోసం పైల్‌ను ఓపెన్‌చేసి వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో పెట్టారు. అలా పెండింగ్‌లో పెట్టడాన్ని కూడా పరిష్కారం( డిస్పోజ్)గా చూపించారు కొందరు కలెక్టర్లు. ఇలా డిస్పోజ్ చేశామని చెప్పి పెండింగ్ పెట్టిన ఫైళ్లే 6500 దాకా ఉన్నట్లు తెలిసింది. ఇందులో సింహభాగం, తిరుపతి, విశాఖపట్నం, తూర్పుగోదావరి, అనకాపల్లి, విజయనగరం, ఏలూరు, కర్నూలు, కడప జిల్లాల్లో ఉన్నట్లు సమాచారం. ఇక అధికారికంగానే పెండింగ్ పెట్టిన జాబితాలో కర్నూలు, తిరుపతి, విశాఖలు తొలిస్థానాల్లో ఉన్నాయి. కర్నూలులో 238, తిరుపతిలో 215, విశాఖలో 204 ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. నిషేధ విముక్తి కల్పించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా వాటిని అమలు చేయని జిల్లాల్లో ఏలూరు, తిరుపతి, విశాఖ జిల్లాలు ముందు వరుసలో ఉన్నాయి.
ఏలూరు జిల్లాలో ఓ రైతు భూమిని నిషేధ జాబితా నుంచి తొలగించాలని 2025 లో హైకోర్టు ఆదేశించింది. కానీ ఇప్పటి వరకు ఆ ఫైలు పరిష్కారం కాలేదు. మొన్నటి వరకు ఆ ఫైలు కలెక్టర్ లాగిన్‌లోనే ఉంది. ఇదే విషయమై రైతు పీజీఆర్‌ఎ్‌సకు వెళ్లి హైకోర్టు ఆదేశాల మేరకు తన భూమిని నిషేధ జాబితా 22(ఏ) నుంచి తొలగించాలని కోరినా ఉపయోగం లేదు. ప్రస్తుతం ఈ ఫైలు ఏలూరు కలెక్టరేట్ నుంచి ప్రభుత్వానికి వచ్చింది. ప్రభుత్వ స్థాయిలోనూ అదే నాన్చుడు ధోరణి కొనసాగుతోంది. తిరుపతి జిల్లాల్లో కోర్టు ఆదేశాలున్నా అమలుచేయనివి మూడు కేసులున్నాయి. విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలో 10 కేసుల్లో కోర్టు ఆదేశాలున్నా భూములకు నిషేధ విముక్తి లభించడం లేదు. ఇందులో నాలుగు కేసుల్లో కోర్టు ధిక్కారం నమోదైనా అధికారులు తమకేం పట్టనట్లే ఉన్నారు.
ఇదీ మతలబు..
సెటిల్‌మెంట్ ద్వారా అయాచితంగా డబ్బు లేదా భూమి వస్తుందన్న ఆశే 22(ఏ) పరిష్కారంపై ఎమ్మెల్యేలు పట్టు బిగించేలా చేస్తోంది. బాధితులు తమకు ఏదో ఒకటి ఆఫర్ చేసి ఆర్డీవోకు ఫోన్ చేయించుకుంటారని వారి ప్రయత్నం. అందుకే బాధితులు ముందుగా వచ్చి తమను కలవాలని కొందరు ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. దీంతో రూల్స్‌ప్రకారం సహజంగా నిషేధ విముక్తి కావాల్సిన భూముల ఫైళ్లు అధికారుల లాగిన్‌లోనే ఉండిపోతున్నాయి. ఇంకా ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తే, దాన్ని పెండింగ్‌లో పెట్టి పరిష్కరించేశామని లెక్కలు చెబుతున్న దారుణ పరిస్థితులూ క్షేత్రస్థాయిలో ఉన్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు