Tomato Prices Soar: అన్నదాతలకు గుడ్ డేస్.. లాభాల పంట పండిస్తున్న టమోటా
ABN , Publish Date - Jan 05 , 2026 | 12:39 PM
సీజన్‌తో సంబంధంలేకుండా మండలంలో ఎప్పుడూ రైతులు టమోటాను సాగుచేస్తారు. ఎకరంలో పంట సాగుకు రూ.1.50 లక్షలనుంచి రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెడతారు. ఏడాదిగా గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోయారు.
తనకల్లు, జనవరి 4(ఆంధ్రజ్యోతి): అన్నదాతలకు టమోటా లాభాల పంట పండిస్తోంది. రైతుపై సిరుల వాన కురిపిస్తోంది. ధరలు ఆశాజనకంగా ఉండడంతో అన్నదాతలు ఆదాయాన్ని చవిచూస్తున్నారు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువు, అంగళ్లు, మదనపల్లి మార్కెట్లలో 30 కేజీల బాక్స్ ధర రూ.850నుంచి రూ.వెయ్యి వరకు పలుకుతోంది. కర్ణాటకలోని కోలార్, వడ్డిపల్లి, చింతామణి మార్కెట్లలో 15 కేజీల బాక్సు రూ.500 నుంచి రూ.650 వరకు కొనసాగుతున్నట్లు రైతులు చెబుతున్నారు. దీంతో భారీ లాభాలు గడిస్తున్నారు.
పెట్టుబడి భారీగానే..
సీజన్‌తో సంబంధంలేకుండా మండలంలో ఎప్పుడూ రైతులు టమోటాను సాగుచేస్తారు. ఎకరంలో పంట సాగుకు రూ.1.50 లక్షలనుంచి రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెడతారు. ఏడాదిగా గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోయారు. పంటను పొలంలోనే వదిలేసిన వారూ ఉన్నారు. కొన్ని రోజులుగా ధరలు నిలకడగా ఉంటుండడంతో ఊరట పొందుతున్నారు. కొంతమంది రైతులు వదిలివేసిన టమోటా తోటలను సైతం తిరిగి ఎరువులు, మందులు ఉపయోగించి, సంరక్షించుకుంటున్నారు. మండలంలో పండించిన టమోటాలను రైతులు అన్నమయ్య జిల్లాలోని మొలకలచెరువు, ఆంగళ్లు, మదనపల్లితో పాటు కర్ణాటకలోని కోలార్, చింతామణి, వడ్డిపల్లి మార్కెట్లకు తరలిస్తుంటారు. రోజూ మండలం నుంచి వందలాది బాక్సుల టమోటాలు వివిధ మార్కెట్లకు తీసుకెళ్తుంటారు.
ధరలు నిలకడగా ఉండడం ఆనందమే
ప్రస్తుతం టమోటా ధరలు నిలకడగా కొనసాగుతుండడం ఆనందమే. 20 రోజులపాటు ధరలు ఇలాగే కొనసాగుతూ.. తరువాత పెరిగే అవకాశం ఉందంటున్నారు. వారానికి రెండుమార్లు నాలుగు వందలకుగా పైగా బాక్సులను మార్కెట్‌లకు తరలిస్తున్నాం. మొలకలచెరువు మార్కెట్లో విక్రయిస్తున్నాం. చీడపీడలు, వైరస్ నివారణతోపాటు యజమాన్య పద్దతులు పాటిస్తేనే దిగుబడి వస్తుంది.
-కోటిరెడ్డి, రైతు, చీకటిమానుపల్లి
లాభాల బాట
టమోటా ధరలు నిలకడగా ఉంటుండడంతో ఆదాయం వస్తోంది. వారానికి రెండుమార్లు కర్ణాటకలోని చింతామణి మార్కెట్‌కు టమోటాలను తరలిస్తున్నాం. అక్కడ మార్కెట్లో 15 కేజీల టమోటా బాక్సు ధర రూ.500 నుంచి రూ.650 వరకు పలుకుతోంది. దీంతో రైతులు లాభాల బాట పట్టారు.
-సూర్యనారాయణ, రైతు, కొత్తకురవపల్లి
ఇవి కూడా చదవండి
నల్లమల సాగర్‌ను అడ్డుకోండి.. సుప్రీంకోర్టులో టీ సర్కార్ వాదనలు
ఇంట్లో భార్యాభర్తల ఫొటోను ఏ దిశలో ఉంచాలి?