జగన్ హయాంలో అవినీతిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు!
ABN , Publish Date - Sep 24 , 2026 | 05:48 AM
వైసీపీ ప్రభుత్వ హయంలో రాష్ట్రంలో సహజ వనరులను దోచి ప్రభుత్వ ఖజానాకు లక్షల కోట్లు నష్టం చేశారని, ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణలో సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను, రెవెన్యూ, రాష్ట్ర ప్రభుత్వ పోలీసులతో సిట్ ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిల్‌పై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది.
కొన్నింటిపై దర్యాప్తు సాగుతోంది.. మరికొన్నింటిపై విజిలెన్స్ విచారణ
వివరాల సమర్పణకు సమయమివ్వండి
హైకోర్టుకు ఏజీ దమ్మాలపాటి అభ్యర్థన.. అంగీకరించిన ధర్మాసనం
అమరావతి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయంలో రాష్ట్రంలో సహజ వనరులను దోచి ప్రభుత్వ ఖజానాకు లక్షల కోట్లు నష్టం చేశారని, ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణలో సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను, రెవెన్యూ, రాష్ట్ర ప్రభుత్వ పోలీసులతో సిట్ ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిల్‌పై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. పిల్‌లో పిటిషనర్ లేవనెత్తిన పలు అంశాలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని నివేదించారు. కొన్ని అంశాల్లో దర్యాప్తు జరుగుతోందని, మరికొన్ని వాటిల్లో విజిలెన్స్ విచారణ జరుగుతోందని తెలిపారు. పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచుతామని.. కొంత సమయం ఇవ్వాలని కోరారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ఇందుకు అంగీకరించింది. ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై వివరాలు తమ ముందుంచాలని ఆదేశించింది. ఈ పిల్‌ను ఢిల్లీకి చెందిన న్యాయవాది మెహక్ మహేశ్వరి గత ఏడాది దాఖలు చేశారు. ఆదాయనికి మించి ఆస్తులు కలిగి ఉన్న జగన్ తదితరుల పై నిష్పాక్షిక దర్యాప్తునకు వీలుగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసేలా సీబీఐ, ఈడీని ఆదేశించాలని కోరారు.