Share News

ఏలూరు జిల్లాలో పెద్దపులి కలకలం.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పులి జాడ!

ABN , Publish Date - Nov 18 , 2026 | 05:05 PM

ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ముసునూరు మండలం రమణక్కపేట అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి జాడను అధికారులు డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించారు.

ఏలూరు జిల్లాలో పెద్దపులి కలకలం.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పులి జాడ!
Eluru Tiger

ఏలూరు, నవంబరు 18: ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. ముసునూరు మండలం రమణక్కపేట అటవీ ప్రాంతంలోని కొండగట్టుపై సేదతీరుతున్న పెద్దపులిని ప్రత్యేక రెస్క్యూ బృందం డ్రోన్ కెమెరాల సాయంతో గుర్తించింది. పగటిపూట విశ్రాంతి తీసుకుంటూ, రాత్రి వేళల్లో సంచరించడం పెద్దపులుల సహజ లక్షణమని ఫారెస్ట్ రేంజర్ తెలిపారు. పులి కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు అటవీశాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. గతంలో పులి మెడకు అమర్చిన జీపీఎస్ ట్రాకింగ్ కాలర్ సాయంతో దాని కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నారు.


గ్రామాల ప్రజలకు అధికారుల హెచ్చరికలు

పులి సంచార నేపథ్యంలో దిగవల్లి, కొండపర్వ గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కొండ సరిహద్దు ప్రాంతాల్లో జనసంచారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటవీ ప్రాంతంలోకి పశువులు, మేకలను మేత కోసం తీసుకెళ్లవద్దని పోలీసులు సూచించారు. సుమారు ఐదేళ్ల వయస్సున్న ఈ పెద్దపులికి ఎలాంటి ప్రాణహాని కలగకుండా సురక్షితంగా బంధించేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పుణేకు చెందిన నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ బృందం రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తోంది. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

Updated Date - Nov 18 , 2026 | 05:45 PM