మీరు చదవకపోతే...నాకు మైనస్ మార్కులు
ABN , Publish Date - Jun 25 , 2026 | 03:20 AM
విద్యార్థులు బాగా చదివి మంచి ఫలితాలు సాధిస్తే, సీఎం చంద్రబాబు తనకు మంచి మార్కులు వేస్తారని, సక్రమంగా చదవకపోతే మైనస్ మార్కులు వేస్తారని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు.
సీఎం ఊరుకోరు.. నా భవిష్యత్ మీ చేతుల్లోనే..
విద్యార్థులతో లోకేశ్ సరదా వ్యాఖ్యలు
విద్యా వ్యవస్థలో సంస్కరణలు పూర్తి
ఇక ఫలితాలు సాధించాలని టీచర్లకు స్పష్టీకరణ
మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌గా మార్చాలని నిర్దేశం
సమస్యలపై ‘లీప్’ యాప్ ద్వారా నేరుగా తనను సంప్రదించాలని టీచర్లకు సూచన
పీ-4 కింద కృష్ణాజిల్లా కొక్కిలిగడ్డ హైస్కూల్‌లో నిర్మించిన అదనపు తరగతి గదులు ప్రారంభం
మచిలీపట్నం/మోపిదేవి, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు బాగా చదివి మంచి ఫలితాలు సాధిస్తే, సీఎం చంద్రబాబు తనకు మంచి మార్కులు వేస్తారని, సక్రమంగా చదవకపోతే మైనస్ మార్కులు వేస్తారని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ‘నా భవిష్యత్ మీపైనే ఆధారపడి ఉందం’టూ విద్యార్థులను ఉద్దేశించి ఆయన చమత్కరించారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలో పీ-4 పథకంలో భాగంగా రూ.1.40 కోట్లతో నిర్మించిన జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదులను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులతో మంత్రి ముచ్చటించారు. సమాజ నిర్మాణంలో మార్పులు తెచ్చేది విద్యా వ్యవస్థేనని, అందుకే ఆ శాఖను తీసుకున్నానని మంత్రి అన్నారు. గత రెండేళ్లలో విద్యావ్యవస్థలో సంస్కరణలను తీసుకువచ్చామని, వాటికి అనుగుణంగా ఉపాధ్యాయులు శ్రద్ధతో పాఠ్యాంశాలు బోధించి సత్ఫలితాలను సాధించాలని ఆయన సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ రంగాలు అభివృద్ధి చెందుతున్నాయని, వాటిలో రాణించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. ఫార్మటివ్, సమ్మెటివ్ టెస్ట్ ఫలితాల ఆధారంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపరచాలని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం బ్రిడ్జి కోర్సు మెటీరియల్‌ను త్వరలో అందజేస్తామని తెలిపారు. ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన పిల్లలను గుర్తించి, వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపి, నూటి కి నూరుశాతం ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు పనిచేయాలని మంత్రి నిర్దేశించారు. యూనిఫాం, పుస్తకాలు ఇప్పటికే ఇచ్చామని, త్వరలో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా కిట్లు, బూట్లు అందజేస్తామన్నారు. పాఠ్యాంశాలు సులభంగా అర్థం చేసుకునేందుకు లీప్ యాప్‌ను రూపొందించామని, ఇందుకు సంబంధించిన వీడియోలు తయారు చేశామని తెలిపారు. పిల్లలను తల్లిదండ్రులు శ్రద్ధగా చదివించాలని, ఉపాధ్యాయులు నేర్పిన విద్యాబుద్ధుల కారణంగానే తాను ఈ స్థాయికి చేరుకున్నానని వివరించారు.
మెగా డీఎస్సీ నిర్వహణ తీరు భేష్ : టీచర్ మనీషా
155 రోజుల వ్యవధిలోనే డీఎస్సీ నోటిఫికేషన్, పరీక్ష నిర్వహణ, ఉద్యోగాలు ఇవ్వటం వంటి ప్రక్రియలు పారదర్శకంగా నిర్వహించారని 2025 డీఎస్సీ ద్వారా టీచర్‌గా ఎంపికైన మనీషా తెలిపారు. దీనివల్లే తనలాంటి వాళ్లకు టీచర్ కావాలనే కల నెరవేరిందన్నారు. కొక్కిలిగడ్డ హైస్కూల్‌లో ఆట స్థలాన్ని ఏర్పాటు చేయాలని హిందీ టీచర్ అనిత కోరారు. తమపాఠశాలలో సౌకర్యాలు మెరుగుపడటంతో ఈ ఏడాది 39 మంది కొత్తగా పాఠశాలలో చేరారని, వీరంతా ప్రైవేటు పాఠశాల ల నుంచి వచ్చిన వారేనని టీచర్ షర్మిల తెలిపారు. అనంతరం మోపిదేవిలోని శ్రీవల్లీ దేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాన్ని మంత్రి లోకేశ్ సందర్శించారు. పుట్టలో పాలుపోసి స్వామివారిని దర్శించుకున్నారు.
జూలైలో పేరంట్స్- టీచర్స్ మీట్
రాష్ట్రవ్యాప్తంగా జూలై 16, 17, 18 తేదీల్లో పేరంట్స్-టీచర్స్ మీటింగ్‌లు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించామని లోకేశ్ తెలిపారు. ‘‘నా అంచనాలకు అనుగుణంగా విద్యాశాఖలో ఫలితాలు సాధించాలంటే టీచ ర్లు, తల్లిదండ్రులు, అధికారుల సహకారం అవసరం. సమష్టిగా కృషి చేసి ఏపీని మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ గా తీర్చిదిద్దుదాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల ఫొటోలతో పత్రికల్లో యాడ్స్ ఇచ్చాం. ఉపాధ్యాయులు తమ రోజువారీ విధి నిర్వహణలో ఏవైనా సమస్యలు తలెత్తితే ఎంఈవో, డీఈవోల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని, ‘లీప్’ యాప్ ద్వారా తనకు సమస్య వివరించవచ్చన్నారు. గత ఏడాది ప్రభుత్వం అమలు చేసిన వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. ఈ సారి వంద రోజుల యాక్షన్ ప్లాన్ లేకుండానే తొలినుంచే విద్యార్థుల చదువు పట్ల టీచర్లు శ్రద్ధ చూపాలన్నారు. పదో తరగతిలో బాలిక లు ఉత్తీర్ణత సాధించలేకపోతే, ఆ తర్వాత వా రు సామాజికపరంగా పలు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు.
పార్టీ బలోపేతం అందరి బాధ్యత
టీడీపీ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో లోకేశ్ పాల్గొన్నారు. రాష్ట్ర భ విష్యత్ కోసం కూటమి బంధం దీర్ఘకాలం కొనసాగుతుందన్నారు. పార్టీ కోసం ప్రతి ఒక్క కార్యకర్తా సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు.