త్వరలో దివాన్‌చెరువు వద్ద జూపార్క్
ABN , Publish Date - Jan 08 , 2026 | 12:41 AM
దివాన్‌చెరువు, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా త్వరలోనే దివాన్‌చెరువు వద్ద జూపార్క్ ఏర్పాటు చేయనున్నట్టు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండల పరిధిలోని దివాన్‌చెరువులో ఉన్న అటవీభూమిని
ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునేలా ఏర్పాటు
రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడి
అటవీభూమిని పరిశీలించిన కేంద్రబృందం, అధికారులు
దివాన్‌చెరువు, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా త్వరలోనే దివాన్‌చెరువు వద్ద జూపార్క్ ఏర్పాటు చేయనున్నట్టు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండల పరిధిలోని దివాన్‌చెరువులో ఉన్న అటవీభూమిని ఎంపీ పురందేశ్వరి నేతృత్వంలో ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్రబృందం సభ్యులు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ విలేకర్లతో మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ స్థాయిలో ఈ ప్రతిపాదనకు సానుకూల స్పందన లభించిందని చెప్పారు. సాధ్యాసాధ్యాల పరిశీలన అనంతరం త్వరలో కార్యాచరణ రూపకల్పన చేయనున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈప్రాంత భౌగోళిక పరిస్థితులు, అటవీ విస్తీర్ణం, పర్యావరణ అనుకూలతలపై పరిశీలన కోసం వచ్చిన కేంద్ర బృంద సభ్యులతో కలసి క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయడం జరిగిందన్నారు. ప్రకృతి పర్యాటక అభివృద్ధికి ఈ ప్రాంతం అన్ని విధాలా అనుకూలమని తెలిపారు. ప్రస్తుతం దివాన్‌చెరువు సమీపంలో దాదాపు 311హెక్టార్ల రిజర్వ్ ఫారెస్ట్ ఉందని, అందులో 250 హెక్టార్ల భూమిని జూపార్క్ కోసం వినియోగించుకునే అవకాశం ఉందని ఆమె వెల్లడించారు. ఈ ప్రతిపాదనను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ దృష్టికి తీసుకు వెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి సంబంధిత అధికారి బెన్ నేతృత్వంలో బృందాన్ని ఇక్కడకు పంపారన్నారు.
సరికొత్త విధానంలో...
క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం జూపార్క్ ఏర్పాటుకు ఈ ప్రదేశం అనుకూలమని బృందం నిర్ధారించిందని ఎంపీ తెలిపారు. జంతువులు, పక్షులను బంధించినట్టు కాకుండా సహజ వాతావరణంలోనే సందర్శకులు వీక్షించేలా సరికొత్త విధానంలో జూపార్క్‌ను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. అన్ని అనుకూలిస్తే ఇక్కడ త్వరలో జూపార్క్ రానుందని స్పష్టం చేశారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ప్రజలకు ఆహ్లాకరమైన వాతావరణం అతి త్వరలోనే దివాన్‌చెరువు అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేస్తామన్నారు. దివాన్‌చెరువు వద్ద గల అటవీభూమిలో జూపార్క్‌కు ప్రతిపాదించిన భూమి ఎగుడు దిగుడు లేకుండా సమాంతరమైన నేల కావడంతో అనువైన ప్రాంతం అని అధికారుల బృందం తెలిపిందన్నారు. కార్యక్రమంలో కేంద్ర జూ అథారిటీ సభ్యకార్యదర్శి డాక్టర్ వి.క్లెమెంట్‌బెన్, వన్యపాణి, ప్రాజెక్టు ఎలిఫెంట్, అటవీసంరక్షణ పరిశోధనా శిక్షణ ఇనస్పెక్టర్ జనరల్ సిజెఎకు చెందిన అజయ్, డీఎఫ్‌వో వి.ప్రభాకరరావు, రాష్ట్ర సిల్వి కల్చరిస్ట్ ఆర్.శ్రీనివాస్, ఎప్‌ఆర్వో ఎన్.దావీద్‌రాజు, పద్మావతి, డీఆర్వో లత, ఎఫ్‌బివో గళ్లారంగారావు, కూటమి నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి, ఆళ్ళ శివనాగరాజు, తోటరామకృష్ణ, చిట్టిప్రోలు పద్దరాజు పాల్గొన్నారు.