పవనోత్సాహం
ABN , Publish Date - Jan 10 , 2026 | 01:05 AM
‘నా గళం.. బలం మీరే.. పిఠాపురం ఎప్పుడూ నా గుండెల్లో ఉంటుంది. అన్ని విధాలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి పిఠాపురాన్ని మోడల్‌గా తీర్చిదిద్దుతానని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు.
పిఠాపురాన సందడే..సందడి
మూడు రోజుల పాటుఉత్సవాలు
మార్చి 14న జనసేన ఆవిర్భావ సభ
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
(కాకినాడ/పిఠాపురం-ఆంధ్రజ్యోతి)
‘నా గళం.. బలం మీరే.. పిఠాపురం ఎప్పుడూ నా గుండెల్లో ఉంటుంది. అన్ని విధాలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి పిఠాపురాన్ని మోడల్‌గా తీర్చిదిద్దుతానని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ జూనియర్ కళాశాల క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలను ప్రారంభించి మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరిగినా రాజకీయం చేస్తోందని వైసీపీ తీరుపై మండిపడ్డారు. తనపై రాజకీయ విమర్శలు చేస్తే చేయండని..కానీ పిఠాపురం వచ్చి గొడవలు పెడితే ఏరేస్తానని హెచ్చరించారు. మార్చి 14న పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నియోజకవర్గం పార్టీకి ఐడియలాజికల్ హెడ్‌క్వార్టర్ అని వివరించారు. తనకు యుద్ధకళలు అంటే ఇష్టమని, త్వరలో పిఠాపురంలో తన ట్రస్ట్ తరపున మార్షల్ అకాడమీ..ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఏర్పా టు చేస్తున్నట్టు ప్రకటించారు. తాను నియోజకవర్గంలో పెళ్లిళ్లు, పేరంటాళ్లకు రావడం లేదని కొందరు అంటు న్నారని.. రాష్ట్రం కోసం, దేశం కోసం పనిచేసే తనలాంటి వ్యక్తికి మద్దతు ఇవ్వాలని కోరారు. నాయకుడు ఇక్కడ లేకపోయినా పనులు జరగడమే సమర్థ నాయకత్వమని పేర్కొని తనను విమర్శించే వాళ్లకు పవన్ ఘాటుగా సమాధానమిచ్చారు. గతేడాది రూ.308 కోట్లతో పిఠాపురంలో అభివృద్ధికి పనులకు శ్రీకారం చుట్టామని వీటి లో 70 శాతం పనులు పూర్తయ్యాయని,మళ్లీ ఇప్పుడు రూ.211 కోట్లతో అదనపు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఛిన్నాభిన్నం చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరిచేస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి పి.నారాయణ తెలిపారు. అమృత్-2 కింద పట్టణాల అభివృద్ధికి రూ.28,500 కోట్లు నిధులు వచ్చాయని, స్వచ్ఛభారత్ కింద మరో రూ.3,500 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. రైతు పక్షం మాది అని గొప్పలు చెప్పుకున్న వైసీపీ ప్రభుత్వంలో రైతులకు ధాన్యం సొమ్ములను 6-9 నెలలకుగానీ చెల్లించలేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో 24 గంటల వ్యవధిలోనే రైతులకు సొమ్ములు చెల్లిస్తున్నామని తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి రైతులకు రూ.9,480 కోట్లు చెల్లించామని చెప్పారు. పిఠాపురాన్ని టెంపుల్ సర్క్యూట్‌లో చేర్చి అభివృద్ధి చేయాలన్నది పవన్ లక్ష్యమని తెలిపారు. నేటి తరానికి సంస్కృ తి సంప్రదాయాలను తెలియచెప్పేందుకు పవన్ పీఠికాపురం సంక్రాంతి మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పిఠాపురానికి వారం రోజుల ముందే సంక్రాంతి వచ్చిందని చెప్పారు.నేటి నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయన్నారు. కాకినాడ పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో శుక్రవారం ఉదయం హెలీకాఫ్టర్ దిగిన పవ న్ అక్కడి నుంచి రోడ్డుమార్గాన సంక్రాంతి ఉత్సవా లకు చేరుకున్నారు. సభ ముగిసిన తర్వాత పిఠాపురంలో 40 నిమిషాల పాటు కాలినడకన పర్యటించి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు.పిఠాపురం మోహన్‌నగర్, ఇందిరానగర్ కాలనీల్లో పర్యటించారు. గోర్స రైల్వే గేటు, డ్రైవర్స్‌కాలనీ వెళ్లే మార్గాల్లో పారిశుధ్యం అధ్వా నంగా ఉండడంపై మండిపడ్డారు. మీరేం చేస్తున్నారు. ఇలాంటి చోట మీరు నివాసం ఉంటారా.. నన్ను వచ్చి ఊడవమంటారా అంటూ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ అపూర్వ భరత్, మునిసిపల్ కమిషనరు నామ కనకారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కార్యక్ర మంలో ఎమ్మెల్యే పంతం నానాజీ,ఎమ్మెల్సీ పద్మశ్రీ, డీసీసీబీ చైర్మన్ తుమ్మలబాబు, పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వర్మ తదితరులు పాల్గొన్నారు.
గోదారండే..కోడిపందేలండే!
పవన్ తన ప్రసంగంలో సరదాగా గోదారి యాస మాట్లాడి అలరించారు. సంక్రాంతిని ప్రస్తావిస్తూ ‘గోదారండే.. కోడిపందేలండే..’అని చాలామంది తనతో అనే వారని..‘కానీ సంక్రాంతి అంటే అవే కాదు.జూదం, పందెం భోగి మంటల్లో కలిసిపోవాలి. సంక్రాంతి భూమిని నమ్మే ప్రతివారి పండుగ. ప్రకృతి ఆరాధన నుంచి వచ్చిన సంక్రాంతిని అన్ని మతాలు జరపాలి. పీఠికాపురం ఇకపై శాశ్వత సంక్రాంతి ఉత్సవాలకు కేం ద్రం కావాలి’ అన్నారు. సంప్రదాయ నృత్యాలను పవన్ ఆసక్తి గా తిలకించి వారితో సరదాగా కాసేపు ముచ్చటించి ఫొటోలు దిగారు. థింసా నృత్య కళాకారిణులతో కలిసి నృత్యం చేశారు. హరిదాసులకు స్వయంపాక దానం చేశారు. చిన్నారులకు భోగిపళ్లు వేశారు. రాట్నం ఒడికి చేనేత మగ్గాన్ని పరిశీలించారు. లేపాక్షి స్టాల్‌లో ఏటికొప్పాక బొమ్మల తయారీని పరిశీలించారు.