Share News

ఉత్తకోతలేనా...

ABN , Publish Date - Jan 20 , 2026 | 01:34 AM

river cuttins

ఉత్తకోతలేనా...

ఆంధ్రజ్యోతి-ముమ్మిడివరం)

ముమ్మిడివరం మండల పరిధిలోని కమిని, లంకాఫ్‌ఠాణేలంక గోదావరి నదీపాయల మధ్య ఉండే గ్రామాలు. కమిని గతంలో రెవెన్యూ గ్రామం. అప్పటి వార్షిక ఆదాయం రూ.60 వేలు. 3,100 ఎకరం లంక భూమి ఉండేది. ఈ రెవె న్యూ గ్రామంలో ఉన్న గురజాపులంక, సలాదివారిపాలెం, వలసలతిప్ప గ్రామాలు నదీకోతకు గురవుతున్నాయి. వీటి పరిధిలోని సుమారు 2వేల ఎకరాల భూమి నదీపాతంకాగా, మరో 1100 ఎకరాల భూమి మిగిలి ఉంది. గ్రామంలోని పంచాయతీ కార్యాలయం, కచేరీ చావిడి, రామాలయం, మండువా లోగిళ్లు, పాఠశాల, మంచినీటి బావులు సైతం నదీగర్భంలో కలసిపోయాయి. దీంతో ఆ గ్రామంలోని పలు కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. ప్రస్తుతం 264 కుటుంబాలకు చెందిన 1020 మంది అక్కడ ఉన్నారు. ఇక లంకాఫ్‌ ఠాణేలంక గ్రామం గతంలో ఠాణేలంకలో అంతర్భాగంగా ఉండేది. ఠాణేలంక నుంచి పళ్లవారిపాలెం పంచాయతీ ఏర్పాటైంది. ఆ తరువాత పళ్లవారిపాలెం పంచాయతీ నుంచి లంకాఫ్‌ఠాణేలంక ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది. గ్రామంలో 600 ఎకరాల భూమి ఉండగా 792 కుటుంబాలకు చెందిన 2,378 మంది జనాభా ఉన్నారు. ఇటీవల వరదలకు సుమారు 200 వ్యవసాయ భూమి కోతకు గురైంది. ప్రస్తుతం గోదావరికి వస్తున్న వరదలకు ఎంతోకొంత భూమి కోతకు గురవుతూనే ఉంది. గోదావరి ఆధునికీకరణలో భాగంగా 2008లో రూ.22 కోట్లతో గ్రోయిన్లు, రివిట్‌మెంట్‌ వంటి పనులు చేశారు. అయినవిల్లి మండలం యలకల్లంక నుంచి కమిని పంచాయతీ పరిధిలోని గురజాపులంక వరకు వీటిని నిర్మించారు. అయితే వరదలకు ఈ గ్రోయిన్లు కొంత దెబ్బతిన్నాయి. పళ్లవారిపాలెం, లంకాఫ్‌ఠాణేలంక గ్రామాల మధ్య నదీపాయపై 1998-99లో రూ.3 కోట్ల 25 లక్షలతో రామకృష్ణ మిషన్‌వారు వారధి నిర్మించారు. వారధి గోదావరివైపు పిల్లర్‌ వద్ద భూమి నదీకోతకు గురవుతోంది. 30 మీటర్లు వెడల్పు, 50 మీటర్ల పొడువున్న కోతకు గురైంది. ఇది మరికొంత పెరిగితే వంతెన మనుగడకు ప్రమాదం పొంది ఉంది. 2023లో గోదావరి వరదలు వచ్చినప్పుడు ఆగస్టు 8న లంక వాసులను పరామర్శించేందుకు విచ్చేసిన నాటి సీఎం జగన్మోహన్‌రెడ్డికి లంకవాసులు నదీకోత విషయాన్ని దృష్టికి తీసుకువెళ్లగా ఆయన స్పందించి 15 రోజుల్లో లంక భూముల రక్షణకు టెండర్లు పిలుస్తాం. మరో నెల రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి. కలెక్టర్‌ స్వయంగా ఇక్కడ పనుల ప్రగతిని స్వయంగా ఫొటోలుతీసి అప్‌లోడ్‌ చేస్తారని హామీ ఇచ్చి రూ.150 నుంచి రూ.200 కోట్లు మంజూరుచేశారు. 3.700 కిలోమీటర్ల మేర ఈ రక్షణ చర్యలు రివిట్‌మెంట్‌, పిచ్చింగ్‌ వంటి పనులు చేపట్టనున్నట్టు ప్రకటించారు. గురజాపులంకలో 600 మీటర్లు, కూనాలంకలో 800 మీటర్లు, లంకాఫ్‌ఠాణేలంకలో 400 మీటర్లు, పళ్లవారిపాలెం వివేకానంద వారధి వద్ద 300 మీటర్లు, అయినవిల్లి మండలం కొండుకుందురులంక వద్ద 600 మీటర్లు, పొట్టిలంక వద్ద వెయ్యి మీటర్లు రివిట్‌మెంట్‌, పిచ్చింగ్‌ వంటి పనులు చేపట్టనున్నట్టు ఆయన ప్రకటించారు. అయితే ఆ హామీలు మాత్రం నెరవేరలేదు. ఆ తరువాత కూటమి నాయకులు లంక భూముల రక్షణ విషయమై ఎన్నికల్లో హామీనిచ్చారు. ఎన్నికల అనంతరం వరదల సమయంలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు లంక గ్రామాల రక్షణకు ప్రతిపాదనలు రూపొందింపజేశారు. రూ.240 కోట్లతో 4.800 కిలోమీటర్ల మేర రివిట్‌మెంట్‌, పిచ్చింగ్‌ వంటి పనులకు ప్రతిపాదనలు రూపొందించారు. గురజాపులంకలో 800 మీటర్లు, కూనాలంక వద్ద కిలోమీటరు, లంకాఫ్‌ ఠాణేలంక వద్ద 600 మీటర్లు, సలాదివారిపాలెం 2 కిలోమీటర్లు, వివేకానంద వారధి వద్ద 400 మీటర్లు, ఐ.పోలవరం మండలం మురమళ్లలో 500 మీటర్లు రక్షణ చర్యలకు ప్రతిపాదనలు రూపొదించారు. అయితే ఇంకా ఈ నిధులు మంజూరు కాలేదు. ఇదికాక కాట్రేనికోన మండలం కుండలేశ్వరం వద్ద ఏటిగట్టు రక్షణకు 200 మీటర్ల మేర ప్రొటెక్షన్‌వాల్‌, గ్రావెల్‌ఫిల్లింగ్‌ వంటి పనులకు రూ.800 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి నివేదించారు. కానీ ఇంతవరకు దీనిపై ఎలాంటి కదలిక లేదు.

Updated Date - Jan 20 , 2026 | 01:34 AM