నిరసన గళం!
ABN , Publish Date - Jan 23 , 2026 | 01:26 AM
కేంద్ర ప్రభుత్వం 216-ఇ జాతీయ రహదారి కొత్తగా ఏర్పాటుచేస్తూ ఇటీవల జారీచేసిన నోటిఫికేషన్‌లో ఇళ్లు కోల్పోతున్న బాధితులు, రైతులు ఆందోళనబాట పట్టారు. దీనిలో భాగంగా అమలాపురం రూరల్ మండలానికి చెందిన వివిధ గ్రామాల రైతులు అమలాపురంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేపడుతున్నారు.
కోనసీమ కొత్త హైవే ఏర్పాటుపై వెల్లువెత్తుతున్న అభ్యంతరాలు
216-ఇ కొత్త హైవే ఏర్పాటులో 22 గ్రామాలపై ప్రభావం
అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ జేసీ, డీఆర్వోలకు వినతులు
కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టిన ఇందుపల్లి వాసులు
2021 నాటి అలైన్‌మెంట్ కొనసాగించాలని డిమాండ్
(అమలాపురం-ఆంధ్రజ్యోతి)
కేంద్ర ప్రభుత్వం 216-ఇ జాతీయ రహదారి కొత్తగా ఏర్పాటుచేస్తూ ఇటీవల జారీచేసిన నోటిఫికేషన్‌లో ఇళ్లు కోల్పోతున్న బాధితులు, రైతులు ఆందోళనబాట పట్టారు. దీనిలో భాగంగా అమలాపురం రూరల్ మండలానికి చెందిన వివిధ గ్రామాల రైతులు అమలాపురంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేపడుతున్నారు. కొందరు స్వార్థపరులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం జాతీయ రహదారి అలైన్‌మెంట్ మార్చడంతో ఎందరో పేదలు ఇళ్లను కోల్పోతున్నారని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇందుపల్లి, ఈదరపల్లి, నడిపూడి తదితర గ్రామాల బాధితులు తమ అభ్యంతరాలను కలెక్టర్ కార్యాలయంలో వినతులరూపంలో అందజేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన అలైన్‌మెంట్ మార్పుచేయాలని ఇందుపల్లి గ్రామస్తుల తోపాటు అరవగరువు అగ్రహారానికి చెందిన బాధితులు కలెక్టర్ కార్యాలయంలో ఏవో విశ్వేరరావుకు వినతులు అందించారు. జిల్లాలో కత్తిపూడి నుంచి పామర్రు వరకు ఏర్పాటైన 216 రహదారి మధ్యలో అమలాపురం రూరల్ మండలం పేరూరు నుంచి ఈ హైవే ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి ఇందుపల్లి, ఈదరపల్లి, నడిపూడి, పాలగుమ్మి, మొసలపల్లి, ముక్కామల, అవిడి, పలివెల నుంచి నేరుగా కెనాల్‌ను ఆనుకుని వెదిరేశ్వరం మీదుగా లక్ష్మీపోలవరంలోని కోల్‌కత్తా-చెన్నై వెళ్లే 216-ఏ రహదారిలో అనుసంధానమయ్యేలా 216-ఇ నిర్మాణానికి కేంద్రం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. 22 గ్రామాల పరిధి గుండా ఈ కొత్త హైవేకు సంబంధించిన భూసేకరణ సంబంధించిన సమాచారం గోప్యంగా ఉంచడంతో బాధిత గ్రామాల ప్రజలకు సమాచారం తెలియలేదు. ఇప్పుడు తాజాగా ఈ ప్రకటన బహిర్గతం కావడంతో నాలుగు లైన్ల హైవే రహదారి విస్తరణ అభివృద్ధికి సేకరిస్తున్న భూముల్లో ఆయా ప్రాంతాలకు చెందిన రైతుల పేర్లతోపాటు ఇళ్లు కోల్పోతున్న బాధితుల సమాచారం తెలుసుకుని గ్రామాల వారీగా ఆందోళనలు చేపట్టారు. దీనిలో భాగంగా భూములు కోల్పోతున్నవారు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ కాంపిటేటివ్ అఽధారిటీ నోటిఫికేషన్‌లో పేర్కొన్న జేసీ నిషాంతికి వినతిపత్రాలు అందజేసేందుకు రైతులు, నివాసగృహాల యజమానులు క్యూ కడుతున్నారు. ఈనెల 29వ తేదీతో నోటిఫికేషన్ గడువు ముగియనుండడంతో కలెక్టర్ కార్యాలయంలో వీటిని అందజేస్తున్నారు. దీనిలో భాగంగా అమలాపురం రూరల్ మండల పరిధిలోని 216-ఇ రహదారి వల్ల ఎందరో ఇళ్లు కోల్పోతున్నారని, తమ ఇళ్లతోపాటు విలువైన పంట పొలాలను కాపాడాలని డీఆర్వో మాధవిని కలసి వినతిపత్రాలు అందజేశారు. 2021లో ఇచ్చిన అలైన్‌మెంట్ ప్రకారం 216-ఇ రహదారిని నిర్మించాలని వారు కోరారు. కలెక్టరేట్ ఎదుట బాధితులు కుటుంబ సమేతంగా ఆందోళన చేశారు. కార్యక్రమంలో మల్లుల పోలయ్య, చొల్లంగి అప్పాజీ, నాగిరెడ్డి తాతారావు, ఉర్లింక బుజ్జి తదితరులు పాల్గొన్నారు.