Share News

అతివేగం... అనర్థం!

ABN , Publish Date - Jan 20 , 2026 | 12:24 AM

కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు హైవే చెంతనే ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడి 11మందికి గాయాలయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.

అతివేగం... అనర్థం!
పొలాల్లోకి బోల్తా కొట్టిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు

హైవే చెంతనే ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా

బస్సులో 24మంది ప్రయాణికులు.. 11 మందికి గాయాలు

బస్సు అద్దాలు పగులకొట్టి బయటకు తీసిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులు

పిఠాపురం, కాకినాడ ప్రభుత్వాసుపత్రులకు తరలింపు

కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు వద్ద సంఘటన

గొల్లప్రోలు రూరల్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు హైవే చెంతనే ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడి 11మందికి గాయాలయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.

అసలేం జరిగిందంటే...?

శ్రీకాకుళం నుంచి భీమవరానికి విజయకృష్ణ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్‌ బస్సు ఆదివారం రాత్రి బయలుదేరింది. సోమవారం తెల్లవారుజామున 2గంటల సమయంలో కాకినాడ జిల్లా కత్తిపూడి దాటి చేబ్రోలు శివారు సత్తెమ్మతల్లి ఆలయం వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి 216వ జాతీయ రహదారి చెంతనే ఉన్న పోల్స్‌ను ఢీకొని బోనస్‌ రాజులుకు చెందిన పంటపొలాల్లోకి దూసుకుపోయి బోల్తా పడి పల్టీలు కొట్టింది. ప్రమాద సమయంలో ప్రయాణికులందూ గాఢనిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా ప్రమాదానికి గురవ్వడంతో భయకంపితులై కేకలు వేశారు. ఈ బస్సు వెనుకే వస్తున్న ఆర్టీసీ బస్సు ఆ శబ్దం విని బస్సు ఆపి వేశారు. ప్రయాణికులతో కలిసి వెళ్లి ప్రవేట్‌ ట్రా వెల్స్‌ బస్సు అద్దాలు పగులకొట్టి అందులో ఉన్న ప్రయాణికులందరిని సురక్షితంగా బయటకు తీశారు. ప్రమాద సమయం లో బస్సులో 24 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి ప్రాంతానికి చెందిన బెహరా రవికుమార్‌, సీహెచ్‌.రవిళి, విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన ఏ.ప్రియాంక, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన ఏ ఎస్‌వీఎస్‌ మూర్తి, కాలిశెట్టి దీపక్‌, మల్లీశ్వరిలు, నరసాపురం సమీపంలోని రుస్తానాబాద్‌కు చెందిన ఏలూరి విష్ణువర్థన్‌, కాలిగీటి దిలీప్‌, కూరా నా విశాల్‌ సహా 11మందికి గాయాలయ్యా యి. వారిని హైవే అంబులెన్స్‌లో హైవే పోలీసులు పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరికొందరికి అతి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స అనంతరం వేర్వేరు బస్సుల్లో వారి వారి స్వస్థలాలకు పంపారు. వారంతా సంక్రాంతి పండుగకు వెళ్లి తిరిగి వస్తున్నట్టు సమాచారం. సంఘటనా స్థలా న్ని పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్‌, గొల్లప్రోలు ఎస్‌ఐ ఎన్‌.రామకృష్ణ, మోటార్‌ వెహికల్‌ ఇనస్పెక్టర్‌ గౌరీశంకర్‌ తదితరులు పరిశీలించారు. ప్రవేట్‌ ట్రావెల్స్‌ బస్సు కండిషన్‌ను తనిఖీ చేశారు. కాగా బస్సు డ్రైవర్‌ అతివేగంగా నిర్లక్ష్యంగా నడపడమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

అనుమతులే లేవు...

చేబ్రోలు శివారులో ప్రమాదానికి గురైన విజయకృష్ణా ట్రావెల్స్‌కు చెందిన బస్సును సరైన అనుమతులు లేకుండా తిప్పుతున్నట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని రవాణా శాఖాధికారులు గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏపీ 39 యూజెడ్‌ 32 55 నెంబరు గల ఈ బస్సుకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలో ట్రాన్స్‌పోర్టు సర్వీసుగా మాత్రమే అనుమతి ఉంది. అయితే బస్సును శ్రీకాకుళం, భీమవరం, నరసాపురం మధ్య టిక్కెట్‌ సర్వీసుగా తిప్పుతున్నట్టు చెప్తున్నారు. కేవలం సీటింగ్‌కే పర్మిషన్‌ ఉండగా స్లీపర్‌బస్సుగా మార్చారు. బస్సు కండిషన్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా బస్‌ కండిషన్‌, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌, అనుమతులపై పరిశీలన జరిపిన మోటార్‌ వెహికల్‌ ఇనస్పెక్టర్లు గౌరీశంకర్‌, నాగేంద్రబాబు రాత్రి వరకూ గొల్లప్రోలు పోలీసులకు ఏ నివేదిక ఇవ్వలేదు. కాగా ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్‌ను అందులో ప్రయాణిస్తున్నవారు తుని నుంచి కత్తిపూడి వచ్చే సమయంలో రెండుసార్లు హెచ్చరించినా బస్సు నిలిపివేయాలని చెప్పినా వినకుండా అతివేగంగా నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదానికి కారణమయ్యాడని క్షతగాత్రులు పేర్కొంటున్నారు.

Updated Date - Jan 20 , 2026 | 12:24 AM