థాంక్యూ డిప్యూటీ సీఎం సార్
ABN , Publish Date - Jan 11 , 2026 | 01:05 AM
పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ రెండో రోజు పర్య టించారు.
వెల్లువెత్తిన వినతులు
పిఠాపురం/గొల్లప్రోలు, జనవరి 10 (ఆంధ్రజ్యోతి) : పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ రెండో రోజు పర్య టించారు. పీఠికాపురం సంక్రాంతి మహోత్సవాలను శుక్ర వారం ప్రారంభించిన పవన్ రెండో రోజు శనివారం ప్రజల సమస్యలు విన్నారు. పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. నియోజకవర్గ నాయకులతోనూ చర్చిం చారు. పిఠాపురం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో బసచేసిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను కలిసేందుకు ఉమ్మడి తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల నుంచి పలువురు శనివారం వచ్చారు. వీరందరి రాకతో ఆర్‌అండ్‌బీ పరిసరాలు జనసందోహంగా మారాయి. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు అష్టకష్టాలు పడ్డారు. వీరిలో కొందరిని లోపలకు పిలిచి పవన్ మాట్లాడారు. ప్రత్తిపాడు జనసేన పార్టీ మాజీ ఇన్‌చార్జి వరుపుల తమ్మయ్యబాబు మరణించి వారం రోజులు గడిచినా పార్టీ తరపున ఎవరు పరామర్శించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన అభిమానులు పవన్‌ను కలిసేందుకు వచ్చారు. పార్టీకి ఆయన ఎంతో సేవ చేశారని తెలిపారు. వీరిని పోలీసులు అడ్డుకోవడం వివాదానికి దారితీసింది. కాగా తమ్మయ్యబాబు అభిమానుల్లో కొందరిని పవన్ పిలిచి మాట్లాడారు. పవన్ బసచేసిన ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలోకి వెళ్లేందుకు జనసేన నాయకులకు చుక్కలు కనిపించా యి. లోపలకు వెళ్లేందుకు వచ్చిన డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్‌లను పోలీసులు అడ్డుకున్నారు. గేటు తీయకపోవడంతో పోలీసులపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరగంట తర్వాత వారిని అనుమతించారు. రాజానగరం మండలం వెలుగుబంద రైతులు జగనన్న కాలనీకి సేకరించిన స్థలాలకు సంబంధించి సొమ్ములు చెల్లించ లేదని..వెంటనే విడుదల చేయాలని కోరారు. గొల్లప్రోలు పట్టణ శివారు హౌసింగ్ కాలనీవాసుల రాకపోకలకు సుద్దగడ్డ వాగుపై బ్రిడ్జి నిర్మించి శుక్రవారం ప్రారంభిం చిన పవన్ శనివారం స్వయంగా పరిశీలించారు. తమ సమస్యను పరిష్కరించిన పవన్‌కు థాంక్యూ డిప్యూటీ సీఎం అంటూ కాలనీవాసుల కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ అపూర్వ భరత్, ఎస్పీ బిందుమాధవ్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, ఆర్డీవో మల్లిబాబు, కమిషనరు శ్రీనివాసులు, తహశీల్దార్ రామకుమార్, ఆర్‌అండ్‌బీ అధికారులు ఉన్నారు.
2 గంటలు.. ఎస్పీ ఆఫీస్‌లోనే..
కాకినాడ, జనవరి 10 (ఆంధ్రజ్యోతి) : లా అండ్ ఆర్డర్ నిర్వహణ పకడ్బందీగా ఉంటూ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని, ఉల్లంఘనకు పాల్పడేవారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జిల్లా పోలీసు యంత్రాంగానికి సూచించారు. కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయాన్ని శనివారం మధ్యాహ్నం సందర్శించి రెండు గంటల పాటు ఉన్నారు.జిల్లాలో శాంతి ఽఽభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై డిప్యూటీ సీఎం ఆరా తీశారు. పలు విభాగాలను పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ రూమ్‌లో డయల్ 100 పనితీరుపై ఆరా తీశారు. ప్రజలకు స్నేహపూర్వక సేవలందిస్తూ పోలీస్ వ్యవస్థను వారికి మరిం త చేరువ చేసేందుకు కృషి చేయాలని సూచించారు. జిల్లాలో శాంతి భద్రల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను ఎస్పీ బిందుమాధవ్ పవన్ కల్యాణ్‌కు వివరించారు.సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ అపూర్వ భరత్,అడిషనల్ ఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, ఎస్‌బీ డీఎస్పీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
80 మంది రైతుల గగ్గోలు
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
జగనన్న కాలనీల పేరిట వైసీపీ చేసిన నిర్వాకాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. రాజానగరం మండలం వెలుగుబంద గ్రామా నికి చెందిన 80 మంది రైతుల నుంచి 50 ఎకరాల భూమిని అప్పటి వైసీపీ ప్రభుత్వం సేకరించింది. 2023లో అప్పటి జిల్లా కలెక్టర్ మాధవీలత అధికారులతో కలిసి స్వయంగా వెలుగుబంధ గ్రామం వచ్చి రైతులతో మాట్లాడి ఇళ్ల స్థలాలకు భూమి ఇచ్చేలా ఒప్పించారు. ఎకరం రూ.85 లక్షల వంతున కొనుగోలు చేయడానికి వైసీపీ ప్రభుత్వం అం గీకరించి రైతుల నుంచి భూమికి సంబంధిం చిన ఒరిజినల్ డాక్యుమెంట్లు, పాసు పుస్తకాలు కూడా తీసుకుంది. సుమారు 38 ఎకరాలకు సంబంధించిన రైతులకు బిల్లులు ఇవ్వడానికి సిద్ధం చేసింది. కానీ డబ్బు మాత్రం ఇవ్వలేదు. 2024 ఎన్నికల వరకూ అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేసింది. ఆ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం.. తెలుగుదేశం కూట మి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో నాటి నుంచి అతీగతీ లేకుండా పోయింది. రైతులు అధికారుల చుట్టూ తిరు గుతున్నారు. ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ అసెంబ్లీలో కూడా భూముల ప్రస్తావన తెచ్చా రు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకో వాల్సి ఉంది.తమకు డబ్బయినా ఇవ్వండి లేదా తమ భూమి డాక్యుమెంట్లయినా ఇచ్చే యండని రైతులు కాదా దేవానందం, మరుకుర్తి సూరి బాబు, కాళ్ల ప్రసాద్, లొల్ల గంగరాజు వంటివారు మహిళలతో కలసి పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్‌ను శనివారం కలిశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.