Share News

మరో మూడు నెలలు..

ABN , Publish Date - Jan 23 , 2026 | 01:31 AM

పూర్వపు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల మధ్య వశిష్ఠ నది దిండి-చించినాడ మధ్య నిర్మించిన వారధి మరమ్మతు పనుల్లో ఎన లేని జాప్యం ప్రయాణికుల పాలిట శాపంగా మారనుంది. మరో మూడు నెలల వరకు ఈ వారఽధిపై బస్సులు, భారీ వాహనాలు వంటివి ప్రయాణించే పరిస్థితులు లేవు. ఎప్పటికీ ఈ వారధి మరమ్మతు పనులు పూర్తవుతాయో జాతీయ రహదారుల శాఖ అధికారులు చెప్పలేని నిస్సహాయస్థితిలో ఉన్నారు.

మరో మూడు నెలలు..
దిండి-చించినాడ వారధి..

  • సాగుతున్న దిండి-చించినాడ వంతెన మరమ్మతు పనులు

  • ప్రణాళికలు లేకుండానే భారీ వాహనాలు నిలుపుదల

  • పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు

  • బేరింగ్‌లు వచ్చేదెప్పుడు.. మరమ్మతులు పూర్తయ్యేదెన్నడు

  • ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్న ప్రైవేటు వాహనాలు

(ఆంధ్రజ్యోతి-అమలాపురం)

పూర్వపు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల మధ్య వశిష్ఠ నది దిండి-చించినాడ మధ్య నిర్మించిన వారధి మరమ్మతు పనుల్లో ఎన లేని జాప్యం ప్రయాణికుల పాలిట శాపంగా మారనుంది. మరో మూడు నెలల వరకు ఈ వారఽధిపై బస్సులు, భారీ వాహనాలు వంటివి ప్రయాణించే పరిస్థితులు లేవు. ఎప్పటికీ ఈ వారధి మరమ్మతు పనులు పూర్తవుతాయో జాతీయ రహదారుల శాఖ అధికారులు చెప్పలేని నిస్సహాయస్థితిలో ఉన్నారు. గత కొన్ని నెలల నుంచి దిండి-చించినాడ మధ్య భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. రాజోలు, అటు పాలకొల్లు, నరసాపురం, ఇటు అమలాపురం డిపోల నుంచి బస్సులన్నీ రావులపాలెం, సిద్ధాంతం మీదుగా వెళుతున్నాయి. ముఖ్యంగా ఉఽభయగోదావరి జిల్లాల వారధిగా ఉన్న ఈ వంతెన పైనుంచి స్కూళ్లు, కాలేజీల బస్సులు వందకు పైగానే నిత్యం నడుస్తుంటాయి. అయితే బస్సుల రాకపోకలు నిలిపివేయడం వల్ల విద్యార్థులు ఇరువైపుల నుంచి కాలినడకన నడిచి వంతెనకు అటు, ఇటు ఉంచిన వాహనాలపై కాలేజీలకు వెళ్లవల్సిన పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధిచెందిన అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా బస్సులపై భక్తులు హాజరవుతారు. వాస్తవానికి సంక్రాంతి, అంతర్వేది కల్యాణ సమయానికి వారధికి అవసరమైన బేరింగ్‌ల మరమ్మతులు పూర్తిచేస్తామని జిల్లా అధికారులు చేసిన ప్రకటన ఆచరణ సాధ్యం కావడంలేదు. తాజాగా ఈమరమ్మతులు పర్యవేక్షిస్తున్న అధికారులను అడుగుతుంటే బేరింగ్‌లు ఆర్డర్‌ ఇచ్చాం.. అవి వచ్చిన తర్వాత వంతెనకు రీప్లేస్‌ చేస్తే తప్ప వాహనాలను ఎట్టిపరిస్థితుల్లోను ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని అనుమతించే ప్రసక్తేలేదని హైవే అధికారులు చెబుతున్నారు. అయితే ఇటు రాజోలు నుంచి, అటు పాలకొల్లు, నరసాపురం నుంచి వారధి దాటి గమ్యస్థానాలకు చేరుకునే ప్రయాణికులను కార్లు, ఆటోలకు చెందినవారు నిలువుదోపిడీ చేస్తున్నారు. చించినాడ నుంచి దిండికి రావాలంటే రూ.70 నుంచి రూ.80 వసూలు చేసే పరిస్థితులు ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. ఇక కార్లు వారు చెప్పిన ధరకే ప్రయాణికులు ఎక్కాల్సిన పరిస్థితులున్నారు. దిండి-చించినాడ వంతెన మరమ్మతుపనులపై జిల్లా యంత్రాంగం కూడా కచ్చితమైన ప్రణాళికలు లేకుండా వివిధ రాష్ట్రాల్లో సంభవిస్తున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని హడావుడిగా నిలుపుదల చేశారు. ఇప్పుడు ఆ వారధికి అవసరమైన బేరింగ్‌లు ఎప్పుడొస్తాయో, మరమ్మతులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియక ప్రజలు అయోమయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ వారధి మరమ్మతు పనులపై ప్రజాప్రతినిధులు స్పందించాల్సి ఉంది.

Updated Date - Jan 23 , 2026 | 01:31 AM