ఇరుసుమండ బ్లోఔట్ కథ సుఖాంతం
ABN , Publish Date - Jan 11 , 2026 | 12:59 AM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలోని మోరి-5 బావిలో డీప్ ఇండస్ర్టీస్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తున్న డ్రిల్లింగ్ సైట్‌లో సంభవించిన బ్లోఔట్ మంటలు మంటలు, గ్యాస్ నియంత్రణ అదుపులోకి వచ్చాయి. దీంతో ఇరుసుమండ, లక్కవరంతో పాటు పరిసర గ్రామాల్లోని ప్ర
ఆరు రోజుల వ్యవధిలో పూర్తి నియంత్రణ
విజయం సాధించిన ఓఎన్జీసీ నిపుణుల బృందం
అధికారులు, ప్రజాప్రతినిధులకు ప్రశంసల వెల్లువ
నిపుణుల బృందానికి కృతజ్ఞతలు
(అమలాపురం-ఆంధ్రజ్యోతి)
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలోని మోరి-5 బావిలో డీప్ ఇండస్ర్టీస్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తున్న డ్రిల్లింగ్ సైట్‌లో సంభవించిన బ్లోఔట్ మంటలు మంటలు, గ్యాస్ నియంత్రణ అదుపులోకి వచ్చాయి. దీంతో ఇరుసుమండ, లక్కవరంతో పాటు పరిసర గ్రామాల్లోని ప్రజలు ఇప్పటివరకు పడిన బాధను మరిచిపోయి ఊపిరి పీ ల్చుకున్నారు. 6 రోజుల్లోనే బ్లోఔట్ ఘటన సుఖాంతంగాముగియడంతో ఆనందంవ్యక్తం చేస్తున్నారు.
పునరావాసం భేష్..
ఈనెల 5న బ్లోఔట్ సంభవించిన తరువాత ఇరుసుమండ, లక్కవరంతో సహా వివిధ ప్రాంతాలకు చెందిన 500 మందిని లక్కవరంలో రెండు పునరావాస కేంద్రాలకు తరలించి ఆహార వసతులు కల్పించారు. 48 గంటల తరువాత పరిస్థితిని అదుపులోకి తెచ్చిన వెంటనే మొత్తం 5 గ్రామాలకు విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్ధరించడంతో పునరావాస కేంద్రాల నుంచి బాధితులు ఇళ్లకు చేరుకున్నారు. బ్లోఔట్ వల్ల సంభవించిన పంట నష్టాలను అంచనావేసి బాధితులకు సహాయం అందించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. మానసికంగా తీవ్ర వేదనకు గురైన తమకు ఓఎన్జీసీ సంస్థ పరిహారం అందించి ఆదుకోవాలనే డిమాండ్ ఇప్పుడు బాధిత గ్రామాల్లో రగులుకుంటుంది. దీనికి రాజకీయ నాయకులు కూడా ఆజ్యం పోస్తుండడంతో ఉద్యమ కార్యాచరణకు రంగం సిద్ధమవుతుంది. కంటిమీద కునుకు లేకుండా గడిపిన ఐదు గ్రామాల ప్రజలకు బ్లోఔట్ పూర్తిస్థాయిలో నియంత్రణలోకి వచ్చిందన్న వార్తతో ఊపిరి పీల్చుకుని బాధను పక్కన పెట్టి సంక్రాంతి పర్వదినాలకు సన్నద్ధమవుతున్నారు.
బాధిత గ్రామస్తుల హర్షం..
బ్లోఔట్ సంభవించిన నాటి నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీల నేతలు అందించిన చేయూతకు బాధిత గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్, అమలాపురం ఎంపీ గంటి హరీష్‌బాలయోగి, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌తో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ, కాంగ్రెస్‌తో సహా వివిధ పక్షాల నేతలు బ్లోఔట్ ప్రాంతాన్ని సందర్శించారు. బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ పక్షాల నేతలు, ప్రజాసంఘాలు ఓఎన్జీసీ సంస్థ కార్యకలాపాలను నిలువరించాలంటూ ఆందోళనకు దిగారు.
ఓఎన్జీసీ నిపుణులకు అభినందనలు
ఓఎన్జీసీకి చెందిన నిపుణుల బృందాలు ఆరు రోజుల వ్యవధిలోనే ఇరుసుమండ బ్లోఔట్‌ను అదుపులోకి తెచ్చి అందరితోను ప్రశంసలు పొందుతున్నారు. ముఖ్యంగా ఓఎన్జీసీకి చెందిన ఉన్నతాధికారులైన సక్సేనా, శ్రీహరితో పాటు శాంతనూర్‌దాస్‌తో సహా ఆ శాఖకు చెందిన నిపుణులైన బృందాలు అనతికాలంలోనే పురోగతి సాధించడం పట్ల స్థానికులు కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుని శనివారం 10 గంటల నుంచి 3 గంటల వ్యవధిలో విజయవంతంగా బ్లోఔట్ వెల్‌మౌత్‌ను బీవోటీ ద్వారా మూసివేయడంతో ఆరురోజుల ఉత్కంఠకు తెరపడడంతో ప్రజలు ఊపిరీ పీల్చుకుంటున్నారు.
నేడు రైతులతో సమావేశం
మలికిపురం, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): మలికిపురం మండలం ఇరుసుమండ వద్ద బ్లోఔట్ కథ సుఖాంతమైంది. శని వారం ఉదయం 10.20 నుంచి 10.30 గంటల మధ్య వెల్‌క్యాప్ చేశారు. బావి వద్ద సిబ్బంది కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం లక్కవరం దొడ్డాస్ ఫంక్షన్‌హాలులో రైతులతో సమావేశం జరుగుతుందని..ఎంపీ హరీష్‌మాధుర్, ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, కలెక్టర్ మహేష్‌కుమార్ పాల్గొంటారని తహశీల్దార్ శ్రీనివాసరావు తెలిపారు.