Share News

భయం గుప్పిట్లో..

ABN , Publish Date - Jan 06 , 2026 | 12:57 AM

మలికిపురం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో సోమవారం జరిగిన గ్యాస్‌ లీకేజీ కారణంగా ఇరుసుమండ లక్కవరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లను ఖాళీ చేశారు. బ్లోఅవుట్‌ భయంతో పశు పక్ష్యాదులను వదిలేసి వెళ్లిపోయారు. లక్కవరం ఎంజీ గార్డె

భయం గుప్పిట్లో..
లక్కవరంలో పునరావాసం పొందుతున్న బాధితులు

బ్లోఅవుట్‌ ఎఫెక్ట్‌.. ఇరుసుమండలో ఇళ్లను ఖాళీ చేసిన ప్రజలు

పునరావాస కేంద్రాలకు తరలింపు

మలికిపురం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో సోమవారం జరిగిన గ్యాస్‌ లీకేజీ కారణంగా ఇరుసుమండ లక్కవరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లను ఖాళీ చేశారు. బ్లోఅవుట్‌ భయంతో పశు పక్ష్యాదులను వదిలేసి వెళ్లిపోయారు. లక్కవరం ఎంజీ గార్డెన్స్‌లో 150 మంది, గుబ్బలపాలెంలో 400 మంది పునరావాసం పొందుతున్నట్టు తహశీల్దార్‌ టి.శ్రీనివాసరావు తెలిపారు. వారికి సోమవారం రాత్రి భోజన సదుపాయం ఏర్పాటుచేశారు. ఇరుసుమండ, లక్కవరం గ్రామాల్లోని బ్లోఅవుట్‌ బాధిత కుటుంబాలు చాలా వరకు బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. బ్లోఅవుట్‌ కారణంగా సోమవారం ఉదయం అంతా మలికిపురం మండలంలో విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. ఇరుసుమండ, లక్కవరం, పోతుమట్ల, చింతలపల్లి, గుబ్బలపాలెం గ్రామాల్లో రాత్రి కూడా విద్యుత్‌ను నిలిపివేసినట్టు విద్యుత్‌ ఏఈ బి.ప్రసాద్‌ తెలిపారు. ఈ గ్రామాలన్నీ చీకట్లో ఉన్నాయి. బ్లోఅవుట్‌ వంద అడుగుల ఎత్తున అగ్నికీలలు మండడంతో ఏ క్షణాన ఏ ప్రమాదం ముంచుకు వస్తుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇరుసుమండ వెళ్లే రహదారిని పోలీసులు మూసివేశారు. జిల్లాస్థాయి అధికారులు బ్లోఅవుట్‌కు సమీపంలోని లక్కవరం-2 సచివాలయంలో ఉండి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. బ్లోఅవుట్‌ను అదుపు చేసే నిపుణులు మంగళవారం మధ్యాహ్నానికి రావచ్చని అధికారులు చెప్తున్నారు. లక్కవరం, ఇరుసుమండ గ్రామాల రోడ్లన్నీ పోలీసు, రెవెన్యూ వాహనాలతో నిండిపోయాయి.

Updated Date - Jan 06 , 2026 | 12:57 AM