Share News

మాజీ గిరిజన ఎంపీ రత్నాభాయి మృతి

ABN , Publish Date - Feb 16 , 2026 | 12:46 AM

రంపచోడవరం, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): మాజీ రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్‌పార్టీ గిరిజన మహిళా నేత తటపట్ల రత్నాభాయి(79) ఆదివారం అర్ధరాత్రి రంపచోడవరంలో మృతి చెందారు. గత కొంతకాలంగా స్వల్ప అనారోగ్యంతోనే ఉన్నా ఆమె అందరికీ అందుబాటులోనే ఉంటూ వచ్చారు. కాగా ఆదివారం రాత్రి బాగా పొ

మాజీ గిరిజన ఎంపీ రత్నాభాయి మృతి
టి.రత్నాభాయి(ఫైల్‌ ఫోటో)

-1972 నుంచి కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీగా పలు పదవులు

రంపచోడవరం, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): మాజీ రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్‌పార్టీ గిరిజన మహిళా నేత తటపట్ల రత్నాభాయి(79) ఆదివారం అర్ధరాత్రి రంపచోడవరంలో మృతి చెందారు. గత కొంతకాలంగా స్వల్ప అనారోగ్యంతోనే ఉన్నా ఆమె అందరికీ అందుబాటులోనే ఉంటూ వచ్చారు. కాగా ఆదివారం రాత్రి బాగా పొద్దుపోయాక తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆమెను హుటాహుటిన రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి, అత్యవసర వైద్య సేవలు అందించారు. కానీ పరిస్థితి చేయిదాటిపోయింది. ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ 1972లో రాజకీయారంగేట్రం చేసి కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎల్లవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో అనేక కీలక పదవులు నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న ప్రత్యేక గుర్తింపుతో 2005 నుంచి 2007 వరకూ గిరిజన సహకార సంస్థ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. 2008 నుంచి 2014 వర కూ రాజ్యసభ సభ్యురాలిగా ఎంపికయ్యారు. రాజ్యసభ పదవీకాలం ముగిసిన వెంటనే ఎ.పి.శాసన మండలికి సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2020 వరకూ ఎమ్మెల్సీగా కొనసాగారు. భర్త పి.సత్యనారాయణ కూడా సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడిగా ఉన్నారు. వీరికి అమర్‌మిత్ర, అరుణ్‌మిత్ర అను ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈమె మరణం పట్ల కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, గిరిజన నాయకులు సర్వత్రా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఈమెకు అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తారు.

Updated Date - Feb 16 , 2026 | 12:46 AM