Share News

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు తప్పవు

ABN , Publish Date - Jan 04 , 2026 | 12:47 AM

అమలాపురం, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అల్లర్లు సృష్టించే వారిపై, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని ఏ

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు తప్పవు
అమలాపురంలో అధికారులతో సమీక్షిస్తున్న డీఐజీ అశోక్‌కుమార్‌, ఎస్పీ రాహుల్‌మీనా

దేవాలయాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేపట్టాలి

ఏలూరు రేంజ్‌ డీఐజీ అశోక్‌కుమార్‌

అమలాపురం, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అల్లర్లు సృష్టించే వారిపై, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని ఏలూరు రేంజ్‌ డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌ హెచ్చరించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రాహుల్‌మీనాతో కలిసి జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో శనివారం సుదీర్ఘంగా శాంతి భద్రతలపై సమీక్షించారు. జిల్లాలో శాంతి భద్రతలు, లైవ్‌ ఇష్యూస్‌, భవిష్యత్తులో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై డీఐజీ సమీక్ష నిర్వహించారు. కొన్ని కీలక అంశాలను వివరించారు. ఐజీ ప్రతిపాదించిన పది పాయింట్ల ఫార్మూలాను ప్రతీ స్టేషన్‌లో కచ్చితంగా అమలుచేయాలని ఆదేశించారు. దేశ, రాష్ట్ర నాయకుల విగ్రహాల ఏర్పాటు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, వివాదాలను ముందే గుర్తించి అవసరమైతే సంబంధిత అధికారుల సహాయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. సున్నితమైన అంశాలపై ప్రత్యేక నిఘా ఉంచి సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియచేయాలన్నారు. రౌడీషీటర్లు, అల్లర్లకు ప్రేరేపించే వ్యక్తులపై నిఘా ఉంచి సీఆర్పీసీ సెక్షన్‌ 107 కింద బైండోవర్‌ను అమలుచేయాలని తెలిపారు.

ప్రజలకు నమ్మకం కలిగించాలి..

‘‘క్షేత్రస్థాయిలో పోలీసు అధికారులు సమస్యాత్మక గ్రామాలను సందర్శించి ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకం కలిగించాలి. గ్రామాలను సెన్సిటివ్‌, నార్మల్‌ గ్రామాలుగా విభజించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సంక్రాంతి పండుగలో గ్యాంబ్లింగ్‌ కేసుల నిందితులపై నిఘా ఉంచి వారిని అవసరమైతే బైండోవర్‌ చేయాలి. వివాదాస్పద ప్రాంతాల్లో పోలీసు పికెట్లు ఏర్పాటుచేసి పీస్‌ కమిటీ ద్వారా స్నేహపూర్వకంగా సమస్యలు పరిష్కరించాలి. పరిస్థితిని బట్టి సెక్షన్‌ 30, సెక్షన్‌ 144ను కఠినంగా అమలు చేయాలి. ఏదైనా ప్రాంతంలో గొడవ జరిగితే ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని ఆయన పేర్కొన్నారు. దేవాలయాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. రావులపాలెం సంఘటన, ద్రాక్షారామం శివలింగం ధ్వంసం, న్యూఇయర్‌ వేడుకల్లో జరిగాన పరిణామాలను కూలంకుషంగా సమీక్షించారు. ద్రాక్షారామ ఘటనలో నిందితుడి అరెస్టు, రామచంద్రపురం మైనరు బాలిక హత్య కేసును సమర్థవంతంగా చేధించడంతో ఎస్పీ రాహుల్‌ మీనాను ఐజీ అశోక్‌కుమార్‌ అభినందించారు. పలువురు పోలీసు అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2026 | 12:47 AM