ఎగ్‌మతులేక!
ABN , Publish Date - Mar 09 , 2026 | 01:11 AM
అనపర్తి/మండపేట/కాకినాడ, మార్చి 8 (ఆంధ్రజ్యోతి) : కోడిగుడ్డు ధర పడిపోయింది. ఇజ్రాయెల్ (పశ్చిమాసియా), ఇరాన్ - అమెరికా యుద్ధం దెబ్బకు గుడ్డు ఎగుమతులకు బ్రేక్ పడింది.ఈ క్రమంలో గుడ్ల నిల్వలు పెరిగి రేటు సగానికి తగ్గింది. నిన్న మెన్నటి వరకు రికార్డు సృష్టించిన గుడ్డు ధర నేడు రైతు కళ్లల్లో కన్నీ
ఒక్కసారిగా దిగజారిన గుడ్డు ధర
నాడు వెరీగుడ్.. నేడు వెరీ బ్యాడ్
ఈ ఏడాది రూ.6.95కు చేరి రికార్డు
ప్రస్తుతం రూ.4.25కు పడిన ధర
రూ.3.80కే ట్రేడర్లు కొనుగోలు
యుద్ధంతో నిలిచిన ఎగుమతులు
రైతుల వద్ద పేరుకున్న నిల్వలు
భారీగా నష్టపోతున్న రైతాంగం
అనపర్తి/మండపేట/కాకినాడ, మార్చి 8 (ఆంధ్రజ్యోతి) : కోడిగుడ్డు ధర పడిపోయింది. ఇజ్రాయెల్ (పశ్చిమాసియా), ఇరాన్ - అమెరికా యుద్ధం దెబ్బకు గుడ్డు ఎగుమతులకు బ్రేక్ పడింది.ఈ క్రమంలో గుడ్ల నిల్వలు పెరిగి రేటు సగానికి తగ్గింది. నిన్న మెన్నటి వరకు రికార్డు సృష్టించిన గుడ్డు ధర నేడు రైతు కళ్లల్లో కన్నీళ్లు రప్పిస్తోంది. గత సీజన్‌లో గోదావరి నెక్ ధర రూ.6.95 పైసలకు చేరి రికార్డు సృష్టించడంతో రైతులు ఆనందపడ్డారు.అయితే ఇదంతా 15 రోజులకే పరిమితం కావడం.. ప్రస్తుతం భారీగా దిగజారడంతో రైతులు గుడ్లు తేలేస్తున్నారు. ఒక వైపు యుద్ధ మేఘాలు, మరో వైపు రం జాన్ ఉపవాసాలతో అటు గుడ్ల ఎగుమతులకు ఆటకం కలగడం, వినియోగం తగ్గడంతో గుడ్డు ధర పతనావస్థకు చేరుకుంది. శుక్ర, శనివారాల్లో పేపర్ ధర రూ.4.25 పైసలు ఉన్నప్పటికీ ట్రేడర్లు మాత్రం రూ.3.80 పైసలకే గుడ్లు కొనుగోలు చేశారు.పేపరు ధర ప్రకారం కమిషన్ పోను రైతుకు రూ.4లు రావాల్సి ఉండగా మరో 20 పైసలు నష్టపోతున్నామని రైతులంటున్నా రు.ఇప్పటికే ఉన్న ధరతో నష్టాల పాలవుతున్నామని రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యం లో మరో ఇరవై పైసలు తగ్గించి ట్రేడ ర్లు కొనుగోలు చేయడంతో రైతులు నష్టపోతున్నారు.
పెరుగుతున్న గుడ్ల నిల్వలు..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గతంలో రోజుకు కోటి గుడ్లు ఉత్పత్తి అయ్యేవి. ప్రస్తుతం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సుమారు నాలుగు కోట్ల వరకు ఫారం కోళ్లను పెంచుతున్నారు. వీటి ద్వారా మూడున్నర కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయ్యే గుడ్లలో సుమారు రెండు కోట్లకుపైగా కోడిగుడ్లను ఈశాన్య రాష్ట్రాలైన అస్సోం, పశ్చి మబెంగాల్, ఒడిస్సా, తదితర రాష్ట్రా లకు ఎగుమతి చేస్తున్నారు. మిగిలిన గుడ్లు మన రాష్ట్రం నుంచి తమిళనాడుకు ఎగుమతి చేసి అక్కడ ఉన్న పోర్టు ద్వారా దుబాయ్ గల్ఫ్ దేశాలకు రవాణా చేస్తుంటారు. ప్రతి రోజూ ఉమ్మడి జిల్లాలో సుమారు 50 వరకు లారీల ద్వారా కోడిగుడ్లను ఎగుమతి చేస్తారు. అయితే ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే పరిస్థితుల్లేక గుడ్డు ధర పడిపోయింది.యుద్ధవాతావరణం కారణంగా మూడు నాలుగు రోజులుగా విదేశా లకు మూడు కోట్ల మేర గుడ్లు ఎగుమతులు నిలిచి పోయాయని నిర్వాహకులు చెబు తు న్నారు.గుడ్డు నిల్వ ఉంటే పాడయ్యే ప్రమా దం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఈ నెల ఐదోతేదీ నుంచి గుడ్ల ధరలు పడిపోతున్నాయి.
రైతుల లబోదిబో..
నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ(నెక్) ధరల ప్రకారం నవంబరులో రూ.5.80 వద్ద మొదలు కాగా అత్యధికంగా రూ.6.50కి చేరుకుంది. డిసెంబర్ నెలలో రూ.6.35 వద్ద ప్రారంభమై.. ఒక్కో గుడ్డు రూ.6.75 నుంచి రూ.7 వరకు ధర ఉంది. బహిరంగ మార్కెట్లో దుకాణ యజమానులు రూ.8 వరకు అంటే రూపాయి ’ఎగ్’స్ట్రా బాదుడు బాదేశారు. పౌలీ్ట్ర వ్యాపారులు అధి కంగా ఉండే తూర్పుగోదావరి జిల్లా అనపర్తి, మండపేట, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో హోల్‌సేల్‌గా ఒక గుడ్డు ధర అత్యధికంగా రూ.7.15గా అప్పట్లో నిర్ణయించారు. ప్రస్తుతం మూడు నెలల అనంతరం గుడ్డు ధర అమాం తంగా పడిపోవడంతో పౌల్ర్టీ రైతులు ఆందోళన చెందుతున్నారు. గుడ్ల ధరలు తగ్గినా బహిరంగ మార్కెట్లో పాత ధరల్లోనే విక్రయిస్తూ వినియోగదారుల జేబుకు చిల్లులు పెడుతున్నారు.
వ్యా‘ఫారం’ బాగోక..
ప్రస్తుతం పౌలీ్ట్ర రైతుల వ్యా’ఫారం’ ఆందోళన కలిగిస్తోంది. గుడ్డు ఉత్పత్తికి సుమారుగా రూ.5.50 పైసల వరకు ఖర్చవుతుందని.. సాధారణంగా లక్ష కోళ్ళు ఉన్న ఫారంలో గుడ్లు దిగుబడి 85 వేల వరకు వచ్చేది.. ఇటీవల అనేక వ్యాధులు రావడంతో దిగుబడి 70 వేలకు పడిపోయిందని రైతులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో కేవలం ధర వ్యత్యాసంతోనే లక్ష కోళ్లు ఉన్న ఫారంలో రోజుకు 1.20 లక్షల నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1 లక్ష, 2 లక్షల ఫారాలే అధికంగా ఉన్నాయని నష్టాలు భారీగా ఉంటాయని రైతులు వాపోతున్నారు. వచ్చేది వేవవి కావడంతో కోళ్ల ఫారం నిర్వహణకు ఖర్చులు అధికం కావడమే కాకుండా కోళ్ల మరణాలు పెరిగే అవకాశం ఉందని దీంతో నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం రాయితీలు కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు.