కో(డీ)ట్లాట!
ABN , Publish Date - Jan 17 , 2026 | 02:21 AM
జిల్లా లో పండగ మూడు రోజులు కోడిపందేలు, గుండాట, పేకాటలు జోరుగా సాగాయి. సుమారు రూ.100 కోట్లకు పైగానే చేతులు మారినట్టు అంచనా. 22 మండలాల్లో మొత్తం 150 వరకూ బరులు నిర్వహించారు
సంక్రాంతి మూడు రోజులు కత్తులు కట్టిన పందెం పుంజులు బరుల్లో నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. బరుల వద్ద గుండాట,పేకాట యథేచ్ఛగా జరిగిపోయాయి. భోగి ముందురోజు వరకు కోడిపందేలు కుదురదంటూ ఎక్కడికక్కడ బరులు ధ్వంసం చేసిన పోలీసులు ఆ తర్వాత మూడు రోజులు మామూళ్ల మత్తులో పూర్తిగా కళ్లుమూసేసుకున్నారు. వెరసి సంక్రాంతి పేరుతో మూడు రోజులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోడిపందేలు,గుండాట,పేకాట కలిపి రూ.500 కోట్ల వరకు లావాదేవీలు జరిగాయి.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పందేల జాతర
ఎక్కడికక్కడ చేతులు మారిన కోట్లు
బైక్‌లు, కార్లు చూపి పందెంగాళ్లకు ఎర
మురమళ్ల బరికి పోటెత్తిన వీఐపీలు
కోనసీమలో అశ్లీల డ్యాన్స్‌లు
3 రోజులు కళ్లు మూసుకున్న ఖాకీలు
రాజమహేంద్రవరం,జనవరి 16 (ఆంధ్రజ్యోతి) : జిల్లా లో పండగ మూడు రోజులు కోడిపందేలు, గుండాట, పేకాటలు జోరుగా సాగాయి. సుమారు రూ.100 కోట్లకు పైగానే చేతులు మారినట్టు అంచనా. 22 మండలాల్లో మొత్తం 150 వరకూ బరులు నిర్వహించారు. సుమారు 20 వేల పందేలు నిర్వహించినట్టు ఒక అంచనా. 2 వేల కు పైగా గుండాట బోర్టులు ఏర్పాటు చేశారు. ఒక్కో బరిలో 4 నుంచి 6 వరకూ గుండాట బోర్డులు వెలిశాయి. బరిని బట్టి రూ. లక్ష నుంచి రూ. కోటి వరకూ పాడు కున్నారు. అన్ని బరుల వెనుక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల దీవెనలు పుష్కలంగా ఉండడం గమనార్హం. కోరుకొండ మండలం కోటి, మధురపూడి ప్రాంతాల్లో భారీగా కోడిపందేలు జూదాలు జరిగాయి. కోటిలో 3 కార్లు,29 బుల్లెట్లు బహుమతులుగా పెట్టారు. మధుర పూడి నుంచి తొర్రేడు వెళ్లే ప్రాంతంలో పెద్ద పేకాట శిబిరం నిర్వహించినట్టు ప్రచారం జరిగింది. నిడద వోలు లో మంత్రి ఇలాకాలో కోడిపందేలు జరిగాయి. డి.ముప్ప వరంలోని ఒక బరిలో గుండాట వద్ద ఘర్షణ జరిగింది. పోలీసులు కేసులు నమోదు చేశారు. గోపాలపురం, నల్లజర్ల, మండపేట, రంగం పేట,కొవ్వూరు, కపిలేశ్వర పురం, ఉండ్రాజవరం, దేవరపల్లి, గోకవరం తదితర మం డలాల్లో పందేలు జరిగాయి. నల్లజర్లలో 10 చోట్ల బరులు ఏర్పాటు చేయగా ఇక్కడ గెలిచిన వారికి బుల్లెట్లు ఇచ్చా రు. రాజమండ్రి రూరల్ పిడింగొయ్యిలో భారీగా పందెలు జరిగాయి. రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నంలో గెలి చిన వారికి 12 బుల్లెట్లు ఇచ్చారు. కోడిపందేల బరు లు, గుండాట బోర్డులు వద్ద జనం కిటకిటలాడారు.
(అమలాపురం -ఆంధ్రజ్యోతి)
సంక్రాంతి మూడు రోజుల పాటు జరిగిన కోడి పందేల, గుండాటలు, పేకాటల్లో సుమారు రూ.150 కోట్ల మేర సొమ్ములు చేతులు మారినట్టు సమాచారం. కోనసీమ జిల్లాలో మురమళ్లతో సహా వందకు పైగా ప్రాంతాల్లో కోడిపందాలు జోరుగా సాగాయి. జిల్లాలోనే అతి పెద్ద బరిగా పేరొందిన ఐ.పోలవరం మండలం మురమళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశా రు. ఇక్కడ పది బోర్డులకు పైగా ఏర్పాటు చేసి ఫోన్‌పే సౌకర్యం కూడా కల్పించారు. ఫ్లడ్ లైట్ల వెలుగులు, డిజిటల్ స్ర్కీన్‌ల మధ్య పందాలు జోరుగా సాగాయి.ఇక్కడ రూ.25 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్టు సమాచారం. రోజుకు 30కి పైగా పందేలు రెండు బరుల్లో నిర్వహించారు. పోటీలను ముమ్మిడివరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబుతో పాటు కాకినాడ, అమలాపురం ఎంపీలు తంగెళ్ల ఉదయశ్రీనివాస్, గంటి హరీశ్ బాలయోగి, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు, టీడీపీ నాయకులు మెట్ల రమణబాబు, సినీనిర్మాత ఆదిత్యరామ్, సినీనటి హేమ తదితరులు పందేలు వీక్షించారు. అమలాపురం, రాజోలు, కొత్తపేట, పి.గన్నవరం, ముమ్మడివరం, రామచంద్రపురం నియోజకవర్గాల పరిధిలోని గ్రామగ్రామాన జూదాల జాతర జోరుగా హుషారుగా సాగాయి. ప్రజలను ఆకర్షించేందుకు కోడూరుపాడు, గున్నేపల్లి అగ్రహారం వంటి ప్రాంతాల్లో రికార్డింగ్ డాన్స్‌లు ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు పందేల్లో పాల్గొని అత్యధికంగా విజేతలైనవారికి బుల్లెట్లను అందజేశారు. అమలాపురం కొంకాపల్లి ఎత్తురోడ్డు వద్ద జరిగిన కోడిపందేల్లో అనాతవరం గ్రామానికి చెందిన వలవల కిరిటీ బుల్లెట్ గెలుచుకున్నారు. ఆత్రేయపురం మండలం లొల్ల బరిలో అధిక పందే ల్లో గెలిచిన వ్యక్తికి క్రెటా కారు ఆఫర్‌గా పెట్టారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత విజేతను ప్రకటిస్తారు. అదే బరిలో మూడు బుల్లెట్లను కూడా పెట్టారు. ఆత్రేయపురం బరిలో రెండు బుల్లెట్లు, తాడిపూడి బరిలో ఒక బుల్లెట్ జోడి పందాల్లో విజేతలకు కానుకగా అందజేశారు. రావులపాలెం బరిలో ఆరు పందేలు గెలిచిన ఒక టీమ్‌కు బుల్లెట్‌ను అందజేశారు. అమలాపురం రూరల్ మండలం గున్నేపల్లి అగ్రహారం, అల్లవరం మండలం కోడూరుపాడు, మామిడికుదురు మండలం ఆదుర్రు, మగటపల్లి, గోగన్నమఠం, కొమరాడ, కరవాక, గెద్దాడ, శివకోడు, కేశనపల్లి, తూర్పుపాలెంలలో అశ్లీల రికార్డింగ్ డాన్స్‌లు హోరెత్తిపోయాయి.
(కాకినాడ,ఆంధ్రజ్యోతి)
సంప్రదాయం పేరుతో మూడు రోజులు పాటు కాకినాడ జిల్లాలో యథేచ్చగా కోడిపందాలు సాగాయి. మూడురోజుల కోడిపందేలు, గుం డాట, పేకాటతో కలిపి రూ. 250 కోట్లు దాటుతుందని పందెం నిర్వాహకులే విశ్లేషిస్తున్నారు. కరప,తాళ్లరేవు,జగ్గంపేట,పిఠాపురం,పెద్దాపురం, తుని,పెదపూడి,కాజులూరు, అన్నవరం తదితర మండలాల్లో ఏకంగా లావాదేవీలు రూ.10కోట్లకుమించిపోయాయి. అటు తాళ్లరేవులో యా నాం రిసార్ట్స్‌లో 40 గదులను ముందే బుక్‌చేసిన ఓ కీలకనేత మూడురోజులు రేయింబవళ్లు పేకాట ఆడించారు. రూ.12 కోట్ల వరకు ఇక్కడ చేతులు మారాయి. మూడు బోర్డుల గేమ్ పేకాటలో రోజుకు మొదటి విన్నర్ రూ.కోటి వరకు గెలుచుకున్నారు. అటు తునిలో పందేలు,గుండాటకు విశాఖ,అనకాపల్లి జిల్లాల నుంచి పందెంగాళ్లు పోటెత్తారు. హైవే వెంబడి తోటల్లో యథేచ్చగా ఇవన్నీ జరుగుతున్నా పోలీసులు అటు వైపు చూడలేదు. కరప మండలంలో స్టేషన్‌కు రూ.30 లక్షల వరకు నిర్వాహకులు ముట్టజెప్పినట్లు సమాచారం. కాకినాడ రూరల్ సర్పవరం కరప, ఉండూరు, కందరాడ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన పందేల వద్ద రిస్ట్‌బ్యాండ్‌లు ఉంటేనే బరుల్లోకి అనుమతించారు. వీటిల్లో ప్రవేశ రుసుమే రూ.1.50 లక్షల నుంచి రూ.3.50 లక్షలు వసూలు చేశారు.ఈ మొత్తం చెల్లించిన వారినే పందేలకు అనుమతించారు. ఎక్కడిక్కడ భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు.ప్రధానంగా బరుల వద్ద పందేల లావాదేవీల వాటా 40 శాతం కాగా, గుండాట, జూదాల లావాదేవీలు 60 శాతం వరకు ఉన్నాయి. ఒక్కొక్క శిబిరం వద్ద కనీసం 3 నుంచి 15 వరకూ బోర్డులు ఏర్పాటు చేసి గుండాట సాగించారు. ఒక్కొక్క బోర్డుకు కనీసం రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ ముట్టజెప్పారు. బెల్టుషాపులు వెలిశాయి.ఒక్కొక్క చోట రూ.50 వేల నుంచి రూ.3లక్షల వరకూ బరుల నిర్వాహకులకు ఇచ్చేలా ఒప్పందాలు జరిగాయి.కోజా ధరలు రూ.5 వేల నుంచి రూ.15 వేలు పలికాయి.
!కోడి పందేల బరుల వద్ద కార్లు, జీపు లు,ఎస్‌వీయూల బహుమతుల మాటున సిండికేట్ మా యాజాలం కొనసాగింది. కోన సీమ జిల్లా మురమళ్ల, రావుల పాలెం, ఆత్రేయపురం, తూర్పు గోదావరి జిల్లా మలక పల్లి,కోరు కొండ, కాకి నాడ జిల్లాలో పలు చోట్ల కోడిపందేల బరుల వద్ద విజేతలకు థార్ జీపులు, కార్లు, బుల్లెట్లు బహుమతులుగా అందజేస్తామని నిర్వాహకులు ప్రకటించారు.సామాజిక మాధ్యమాల్లో ఇవి ట్రెండ్‌గా మారాయి. అయితే అసలు ఇవి ఎవరికి లభిస్తున్నాయో ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 40 మంది ఒక గ్రూపుగా ఏర్పడి పోటీల నిర్వహణలో పాలుపంచుకున్నారు. బహుమతులు పొందాలంటే కనీసం రూ.1.50 లక్షల నుంచి రూ.3 లక్షలు ప్రవేశ రుసుముగా చెల్లించాలని నిబంధన విధించడంతో చాలా మంది వెనక్కుతగ్గారు. దీంతో ముందే ప్రణాళిక సిద్ధం చేసుకున్న వారే పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు.ఈ ప్రచారంతో ఆయా బరుల వద్ద గుండాట వ్యాపా రం కోట్ల వర్షం కురిపించింది.