చొల్లంగి...భక్తి ఉప్పొంగి!
ABN , Publish Date - Jan 19 , 2026 | 01:09 AM
కరప, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): పురాణ ప్రాశస్త్యం కలిగిన చొల్లంగి అమావాస్య తీర్థానికి భక్తులు పోటెత్తారు. కాకినాడ జిల్లా కరప మండలం ఉప్పలంక శివారు మొండి గ్రామం విచ్చేసి సముద్ర తీరాన కొలువుదీరిన బాలత్రిపురసుందరి సమేత సంగమేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజా
తీర్థానికి పోటెత్తిన భక్తులు
సముద్ర స్నానాలు, ప్రత్యేక పూజలు
కరప, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): పురాణ ప్రాశస్త్యం కలిగిన చొల్లంగి అమావాస్య తీర్థానికి భక్తులు పోటెత్తారు. కాకినాడ జిల్లా కరప మండలం ఉప్పలంక శివారు మొండి గ్రామం విచ్చేసి సముద్ర తీరాన కొలువుదీరిన బాలత్రిపురసుందరి సమేత సంగమేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయానికి విచ్చేసి సముద్ర స్నానాలాచరించి స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. చొల్లంగిలోని రాజరాజేశ్వరిదేవి సమేత సోమేశ్వరస్వా మి, కాలభైరవస్వామి, సీతారామాంజనేయ స్వామివార్లను కూడా దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కరప, తాళ్లరేవు, కాజులూరు, తదితర మండలాల నుంచి వీరభద్రుని ప్రభలు, గరగలను భారీ ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామిదర్శనం చేసుకున్నారు. అలాగే అప్పన్నెద్దులను కోలసంబరం పాటలు, నృత్యాలతో తోలుకువచ్చి సముద్ర స్నానాలు చేయించారు. భక్తులకు ఏ ఇబ్బందులు రాకుండా అధికారులు, దేవదాయశాఖ సిబ్బంది స్నానఘట్టాల వద్ద గజ ఈతగాళ్లను, వైద్యసేవల కోసం శిబిరాన్ని, తాగునీటి వసతి, అన్నదానం ఏర్పాటుచేశారు. సంగమ ప్రదేశం వద్ద జంగమ దేవరులు పలువురితో పిండ ప్రధానం చేయించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, ఎం ఎస్‌ఎన్ చారిటీస్ ట్రస్ట్‌బోర్డు చైర్మన్ మల్లాడి కా ర్తీక్‌నాయకర్ దంపతులు స్వామివారి తొలి పూజల్లో పాల్గొని ప్రత్యేక పూజలుచేశారు. భక్తులకు ఇబ్బందులు రాకుండా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో కరప, పెదపూడి, ఇంద్రపాలెం, గొల్లపాలెం, కాకినాడ పోలీస్‌స్టేషన్‌ల ఎస్‌ఐలు, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. స్వామివారిని దాదాపు 80వేలమంది వరకూ దర్శించుకున్నారని అధికారులు అంచనావేశారు. స్వామివారిని సర్పంచ్ బొమ్మిడి నయోమి సతీష్, ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు సందీప్, నాయకులు బోగిరెడ్డి కొండబాబు, నున్న గణేష్‌నాయుడు, షేరు వీరబాబు, ఎంపీడీవో జె.శ్రీనివాస్, ఎంఎస్‌ఎన్ చార్టీస్ ఏసీ చాగంటి సురేష్‌నాయుడు, డిప్యూటీ ఎంపీడీవోలు సలాది శ్రీనివాసరావు, కర్రి శ్రీనివాస్, కార్యదర్శి భవానీ దర్శించుకున్నారు.