మళ్లీ..బ్లోఅవుట్!
ABN , Publish Date - Jan 06 , 2026 | 01:17 AM
పచ్చని కోన సీమలో భయాందోళన నెలకొంది. సోమవారం ఉదయం వాతావరణం అంతా ఎం తో ప్రశాంతంగా ఉంది..ఆ సమయంలో ఉన్న ట్టుండి ఒక్కసారిగా భారీ శబ్దం.. ఏం జరిగిందో తెలియదు.. ఏమైపోతున్నామో తెలియదు..
ఓఎన్జీసీ రిగ్ వద్ద మంటలు
భయం భయంగా జనం
పునరావాస కేంద్రాల ఏర్పాటు
అదుపులోకి రాని మంటలు
అమలాపురం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి) : పచ్చని కోన సీమలో భయాందోళన నెలకొంది. సోమవారం ఉదయం వాతావరణం అంతా ఎం తో ప్రశాంతంగా ఉంది..ఆ సమయంలో ఉన్న ట్టుండి ఒక్కసారిగా భారీ శబ్దం.. ఏం జరిగిందో తెలియదు.. ఏమైపోతున్నామో తెలియదు.. అం తటా పొగ కమ్మేస్తోంది.. జనం భయంతో వణి కిపోతున్నారు.. బ్లో అవుట్ అని తెలియ డం తో అంతా కంగారుపడ్డారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో మోరి ఫీల్డ్-5 బావిలో ఓఎన్జీసీ డ్రిల్లింగ్ చేస్తున్న రిగ్ వద్ద సోమవారం ఉదయం జరిగిన పేలుడు కారణంగా భారీ విస్ఫోటనంతో బ్లోఅవుట్ సంభవించింది. తొలుత తీవ్ర పీడనంతో పొగ మంచు మాదిరిగా ఘటనా స్థల పరిసరాలను గ్యాస్ కమ్మేసింది. మధ్యాహ్నం 12 గంటలకు గ్యాస్ బ్లోఅవుట్ జరగ్గా అరగంట వ్యవధిలో 12.30 గంటల సమయంలో భారీశబ్దంతో మరోసారి పేలుడు సంభవించి మంటలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. దీంతో ఇరుసుమండ సహా సమీప గ్రామాల ప్రజలు ఆ బ్లోఅవుట్ నుంచి వచ్చే శబ్ధాలకు భయభ్రాంతులకు గురై ప్రాణాలు అరచేత పట్టుకుని పిల్లా పాపలతో పరుగులు తీశారు. బ్లోఅవుట్ సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే కోనసీమ జిల్లా అధికార యంత్రాంగం హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టింది. సోమ వారం అర్ధరాత్రికి బ్లోఅవుట్ మంటల వెలుగుల్లో ఆ పరిసర గ్రామాలు ఉన్నాయి.
పునరావాస కేంద్రాలకు జనం
ఇరుసుమండ, లక్కవరంలోని కొన్ని ప్రాంతాల్లో నివాసగృహాల ప్రజలను ఖాళీ చేయించారు. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో బ్లోఅవుట్ వెలుగుల్లోనే బతుకు జీవుడా అని కాలం గడుపుతున్నారు. ఇంట్లో గ్యాస్ స్టవ్ వెలిగించాలంటే ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయం వారిని నిలువెల్లా వెంటాడుతుండడంతో హడలెత్తి పోతున్నారు. కొందరు బంధువుల ఇళ్లకు వలస వెళితే మరికొందరు అధికారులు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలివెళుతున్నారు. ఇది ఇరుసుమండలోని పచ్చటి పొలాల మధ్య సంభవించిన బ్లోఅవుట్ ప్రాంత పరిస్థితి. ఆ ప్రాంతం నుంచి ఎగసిపడుతున్న మంటలతో సమీపంలోని కొబ్బరిచెట్లు మాడి మసైపోతున్నాయి. పంటచేలు బుగ్గి పాలయ్యాయి. అన్నదాతలు ఆక్రందన చెందుతున్నారు. ఈ బ్లోఅవుట్ మంటల కుంపటి ఎప్పటికి చల్లారుతుందో తెలియని భయంలో ఇరుసుమండ ప్రజలున్నారు. లక్కవరం ఎంజీ గార్డెన్స్‌లో 150 మంది, గుబ్బలపాలెంలో 400 మందికి పునరావాసం కల్పించి వారికి భోజన వసతులు కల్పించారు. అగ్నిమాపక శకటాలన్నీ బ్లోఅవుట్ పరిసర ప్రాంతాల్లో మోహరించాయి.రాష్ట్ర ప్రభుత్వ శకటాలతో పాటు ఓఎన్జీసీ,ప్రైవేటు సంస్థలకు చెందిన అగ్నిమాపక శకటాలు, అంబులెన్సులు సిద్ధం చేశారు. మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు.ఈ రాత్రి గడిస్తే మంగళవారం బ్లోఅవుట్ అదుపుపై సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు.
సచివాలయమే కలెక్టరేట్!
మలికిపురం మండలం లక్కవరం-2 సచివాలయం వద్దకు బ్లో అవుట్ కమ్మే స్తోంది. ప్రస్తుతం ఆ సచివాలయమే జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్, ఎస్పీ రాహుల్ మీనాలతో పాటు రెవెన్యూ అధికారులు, వివిధ శాఖలకు చెందిన అధికారులకు వేదికగా మారింది. అధికారులు ఇక్కడే ఉండి ఇరుసుమండ బ్లోఅవుట్ కారణంగా ఉత్పన్నమైన పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పునరావాస చర్యలు చేపట్టారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను అక్కడకు రప్పించి వారికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఓఎన్జీసీ ఉన్నతాధికారులతో అమలాపురం ఎంపీ గంటి హరీష్‌బాలయోగి చర్చించారు. బ్లోఅవుట్ నివారణకు ఏ విధమైన చర్యలు చేపడుతున్నారో అడిగి తెలుసుకుని అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
సీఎం చంద్రబాబు ఆరా
అమలాపురం, జనవరి 5(ఆంధ్రజ్యోతి): రాజోలు నియోజకవర్గ పరిధిలోని మలికిపురం మండలం ఇరుసుమండ ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సైట్ వద్ద నిర్వహించిన గ్యాస్ లీక్, బ్లోఅవుట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్‌లతో మాట్లాడారు. జిల్లాకు చెందిన అధికారులతో బ్లోఅవుట్ కారణంగా ఉత్పన్నమైన పరిస్థితులు, బాధితులకు పునరావాస చర్యలపై అధికారులు, మంత్రులకు సూచనలిచ్చారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించాలని ఆదేశించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు సంప్రదింపులు జరపడం, నిరంతరం సమన్వయంతో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇరుసుమండ బ్లోఅవుట్ కారణంగా ఉత్పన్నమైన పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. జిల్లా ఇన్‌చార్జి, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌లు కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.ఓఎన్జీసీ ప్రతినిధులతో మాట్లాడి సాంకేతిక నిపుణులచే మంటలు అదుపులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎప్పుడెప్పుడు ఏం జరిగాయంటే..
ఫ 1995, జనవరి 8వ తేదీ రాత్రి బోడసకుర్రులోని దేవర్లంకలో పాశర్లపూడి బ్లోఅవుట్ సంభవించింది. 65 రోజులకు అంటే మార్చి 15 నాటికి మంటలను పూర్తిగా అదుపు చేశారు. ఇదే ఇప్పటి వరకూ అతి పెద్ద బ్లోఅవుట్.
ఫ మామిడికుదురు మండలం కొమరాడలో బ్లోవుట్ సంభవించగా 6 వేల కుటుంబాలు తరలించారు.
ఫ రావులపాలెం మండలం దేవరపల్లి శివారు పితానివారిపాలెం బ్లోఅవుట్ 1997 ఫిబ్రవరి 19న సంభవించగా.. 45 రోజులు శ్రమించారు.
ఫ అమలాపురం మండలం తాండవపల్లిలో 2006, సెప్టెంబరు 19న బ్లోఅవుట్ సంభవించి మంటలు ఎగసిపడ్డాయి.
ఫ మామిడికుదురు మండలం నగరంలో 2014, జూన్ 27న జరిగిన విస్ఫోటనంలో 22 మంది ప్రాణాలు కోల్పోగా 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఏక్షణాన.. ఏం జరిగింది..
ఉదయం 9 గంటలు : రిగ్ నుంచి శబ్దాలు ఆరంభం
11 గంటలు : పొగలు వ్యాపించి.. గ్యాస్ కమ్మేసింది.
11.30 గంటలు : ఇళ్ల నుంచి జనం బయటకొచ్చేశారు.
12 గంటలు : ఒక్కసారిగా గ్యాస్ బ్లోఅవుట్ జరిగింది.
12.30 గంటలు : మంటలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి.
2 గంటలు : జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎంపీ, ఎమ్మెల్యే రాక
2.30 గంటలు : పునరావాస కేంద్రాలకు బాధితులు
రాత్రి 9 గంటలు : ఫైర్ ఫైటర్ విధానంలో ఆపే యత్నం