డ్రోన్ నుంచి క్షిపణి దాడి
ABN , Publish Date - May 20 , 2026 | 04:41 AM
ఆత్మనిర్భర్ భారత్ విజన్ దిశగా భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) మరో కీలక ముందడుగు వేసింది.
యూఎల్‌పీజీఎం-వీ3 డెవల్‌పమెంట్ ట్రయల్ విజయవంతం
కర్నూలు సమీపంలోని డీఆర్‌డీవో టెస్ట్ రేంజ్‌లో పరీక్ష
ఆల్వాల్, మే 19 (ఆంధ్రజ్యోతి): ఆత్మనిర్భర్ భారత్ విజన్ దిశగా భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) మరో కీలక ముందడుగు వేసింది. డ్రోన్ల ద్వారా ప్రయోగించే గైడెడ్ మిసైల్ (యూఏవీ లాంచ్‌డ్ ప్రెసిషన్ గైడెడ్ మిస్సైల్(యూఎల్‌పీజీఎం)-వీ3) డెవల్‌పమెంట్ ట్రయల్స్‌ను ఏపీలోని కర్నూలు సమీపంలో ఉన్న డీఆర్‌డీవో టెస్ట్ రేంజ్‌లో విజయవంతంగా పూర్తిచేసింది. సాధారణంగా డ్రోన్ల నుంచి ప్రయోగించే క్షిపణులను.. భూమిపై ఉన్న శత్రువుల యుద్ధ ట్యాంకులు, బంకర్లు, రేడార్లను ధ్వంసం చేయడానికే వాడతారు. కానీ, ఈ మిస్సైల్ భూమిపై ఉన్న శత్రుట్యాంకులు, వాహనాలతో పాటు.. ఆకాశంలో శత్రు డ్రోన్లను, హెలికాప్టర్లను సైతం ధ్వంసం చేయగలదు. దీనివల్ల లాభం ఏంటంటే.. సరిహద్దుల్లో ఉండే మన డ్రోన్లు అవతలివైపు నుంచి వచ్చే శత్రు డ్రోన్లు, రవాణా, దాడి హెలికాప్టర్ల వంటి వాటిని ఆకాశంలోనే కూల్చేయగలవు. దేశంలోని పలు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సహకారంతో పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ మిస్సైల్‌ను మన అవసరాలకు తగ్గట్టుగా మార్చుకునే వీలుంది. ఈ క్షిపణి అభివృద్ధిలో హైదరాబాద్‌లోని రిసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ), డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవల్‌పమెంట్ లాబొరేటరీ (డీఆర్‌డీఎల్), చండీగఢ్‌లోని టెర్మినల్ బాలిస్టిక్స్ రిసెర్చ్ ల్యాబొరేటరీ (టీబీఆర్‌ఎల్), పుణెలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రిసెర్చ్ ల్యాబొరేటరీ కీలకపాత్ర పోషించాయి. పెద్ద ఎత్తున ఈ క్షిపణుల అభివృద్ధి, ఉత్పత్తి కోసం డీఆర్‌డీవో హైదరాబాద్‌కు చెందిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్, అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. బెంగళూరుకు చెందిన ‘న్యూస్పేస్ రిసెర్చ్ అండ్ టెక్నాలజీస్’ అభివృద్ధి చేసిన డ్రోన్లపై ఈ యూఎల్‌పీజీఎం-వీ3 క్షిపణిని, దాని కనెక్టింగ్ సిస్టమ్స్‌ను అమర్చి ఈ పరీక్ష నిర్వహించారు. కాగా.. యూఎల్‌పీజీఎం-వీ3 డెవల్‌పమెంట్ ట్రయల్స్ విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. రక్షణరంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించే దిశగా ఇదొక వ్యూహాత్మక మైలురాయి అని ఆయన పేర్కొన్నారు.