Share News

అటవీ భూముల్ని స్వాధీనం చేసుకోండి

ABN , Publish Date - May 23 , 2026 | 06:07 AM

అటవీ భూముల పరిరక్షణలో బాధ్యతగా వ్యవహరించని అధికారులపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యాలను పరిగణలోకి తీసుకోకపోయినా...

అటవీ భూముల్ని స్వాధీనం చేసుకోండి

  • 50శాతం గ్రీన్‌ కవర్‌పై శ్రద్ధ పెట్టండి

  • అలసత్వాన్ని సహించను.. బాధ్యతగా పని చేయండి

  • డిప్యూటీ సీఎం పవన్‌ హెచ్చరిక

అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి): అటవీ భూముల పరిరక్షణలో బాధ్యతగా వ్యవహరించని అధికారులపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యాలను పరిగణలోకి తీసుకోకపోయినా, అటవీ ఆస్తులను రక్షించలేకపోయినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ‘చిత్తూరు జిల్లా మంగళంపేట అడవుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిన భూమిని స్వాధీనం చేసుకున్నాం. కడప జిల్లాలో సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం ఆక్రమించుకున్న అటవీ భూమిని వెనక్కి తీసుకొచ్చాం. అలాగే ఇతర ప్రాంతాల్లో ఆక్రమిత భూముల్ని స్వాధీనం చేసుకోవాలి. ఎంత భూమి ఆక్రమణకు గురైంది? ఎంతమందిపై కేసులు పెట్టారో వెబ్‌సైట్‌లో ఉంచాలి’ అని పవన్‌ ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష జరిపారు. ‘శేషాచలం అడవుల నుంచి టన్నుల కొద్దీ ఎర్రచందనం విదేశాలకు తరలిపోయింది. చైనా, జపాన్‌, సింగపూర్‌ వంటి దేశాల కస్టమ్స్‌ అధికారుల వద్ద రూ.వేల కోట్ల మన ఎర్రచందనం సీజ్‌ చేయబడి ఉంది. కేంద్రంతో సమన్వయం చేసుకుని, దానిని తిరిగి దేశానికి రప్పించే ప్రక్రియ ఎంతవరకు వచ్చింది?’ అని పవన్‌ అధికారులను ప్రశ్నించారు. పర్యావరణ పరిరక్షణకు రాష్ట్రం 50శాతం గ్రీన్‌ కవర్‌ను కలిగి ఉండాలని పవన్‌ స్పష్టం చేశారు. ‘గ్రేట్‌ గ్రీన్‌ వాల్‌ ప్రాజెక్టు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లలేరా? నిర్ధేశిత కాల వ్యవధిలో.. బాధ్యతగా పని చేయకపోతే ఎలా?’ అని ప్రశ్నించారు. విత్తన బంతులు వెదజల్లడానికి వర్షాకాలం కోసం ఎదురుచూడకుండా ముందుగానే వేసుకోవచ్చని చెప్పారు. అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతీలాల్‌ దండే, సలహాదారు మల్లికార్జునరావు పాల్గొన్నారు.


పచ్చదనం కోసం హరిత సమరం

రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం సన్నద్ధమయ్యింది. ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక చొరవతో అటవీ శాఖ 2.5 కోట్ల విత్తన బంతుల (సీడ్‌ బాల్స్‌) పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతోంది. ప్రజాప్రతినిధులు, పొదుపు సంఘాల మహిళలు, ఉద్యోగులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ కార్యకర్తలను ఇందులో భాగస్వామ్యం చేయనున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా విత్తన బంతులను విస్తారంగా చల్లడానికి అటవీ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం ప్రత్యేక పద్ధతులను ఉపయోగించనున్నారు. నేరుగా చల్లడం, అత్యాధునిక డ్రోన్ల సాంకేతికతను ఉపయోగించడం, చేతులతో నాటడం చేస్తారు. పచ్చని ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడం ఈ హరిత ఉద్యమం ప్రధాన లక్ష్యం. ఈ అంశంపై ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ శుక్రవారం అటవీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ’మనం చల్లే ప్రతి విత్తన బంతి.. మన భవిష్యత్‌కు ఇచ్చే ఒక నమ్మకమైన హామీ. రాబోయే తరాల కోసం ఆంధ్రప్రదేశ్‌ను మరింత పచ్చగా, ఆరోగ్యకరంగా, సుస్థిరంగా మార్చేందుకు మనమంతా చేతులు కలుపుదామని’ ఆయన పిలుపునిచ్చారు.

Updated Date - May 23 , 2026 | 06:07 AM