Share News

అసభ్య పోస్టులపై కఠిన చర్యలు

ABN , Publish Date - Jul 04 , 2026 | 05:17 AM

సోషల్‌ మీడియాలో వ్యక్తులను కించపరుస్తూ పెడుతున్న అసభ్య పోస్టులపై మరింత కఠినంగా వ్యవహరించాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సూచించారు.

అసభ్య పోస్టులపై కఠిన చర్యలు

  • సైబర్‌ క్రైమ్‌ చట్టాలను కఠినతరం చేయాలి

  • సైబర్‌ క్రైమ్‌ ఐజీతో డిప్యూటీ సీఎం పవన్‌

  • ఈగల్‌ వార్షిక నివేదిక అందించిన ఐజీ ఆకే

అమరావతి, జూలై 3 (ఆంధ్రజ్యోతి): సోషల్‌ మీడియాలో వ్యక్తులను కించపరుస్తూ పెడుతున్న అసభ్య పోస్టులపై మరింత కఠినంగా వ్యవహరించాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సూచించారు. సోషల్‌ మీడియా వేధింపుల నేపథ్యంలో సైబర్‌ చట్టాలను మరింత కఠినతరం చేయాలని ఆదేశించారు. ఈగల్‌ విభాగం చీఫ్‌, సైబర్‌ క్రైమ్‌ ఐజీ ఆకే రవికృష్ణ మంగళగిరి క్యాంపు కార్యాలయంలో పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. ఈగల్‌ విభాగానికి సంబంధించిన వార్షిక నివేదికను ఆయనకు అందజేశారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ నివారణకు ఈగల్‌ విభాగం తీసుకుంటున్న చర్యలు, సాధించిన ఫలితాలను నివేదించారు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో వ్యక్తులను కించపరుస్తూ పెడుతున్న పోస్టులు, సైబర్‌ వేధింపులు వంటి అంశాలపై పవన్‌ కల్యాణ్‌ ఆయనతో చర్చించారు. అసభ్య పోస్టులపై మరింత కఠినంగా వ్యవహరించాలని, చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. సోషల్‌ మీడియా వేధింపులు, ట్రోలింగ్‌తో పాటు మహిళలను టార్గెట్‌ చేస్తూ అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై సైబర్‌ క్రైమ్‌ విభాగం ద్వారా తీసుకుంటున్న చర్యలను రవికృష్ణ ఉపముఖ్యమంత్రికి వివరించారు.

సమాచార సేకరణ 5 వరకూ పొడిగింపు..

జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కార్యక్రమాన్ని ఈ నెల 5వ తేదీ వరకూ పొడిగించాలని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారు. శ్రేణుల నుంచి వస్తున్న విజ్ఞప్తులు, పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిశీలకులు అందించిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం తెలిపింది.

Updated Date - Jul 04 , 2026 | 05:19 AM