Share News

కోస్తాంధ్రకు రెడ్‌ అలర్ట్‌

ABN , Publish Date - Oct 27 , 2026 | 04:15 AM

దేశ తూర్పుతీరంలో ఈ ఏడాది తొలి తుఫాన్‌ సోమవారం బంగాళాఖాతంలో ఏర్పడింది. ఈ తుఫాన్‌కు బంగ్లాదేశ్‌ ప్రభుత్వం సూచించిన పేరు(ఆర్నబ్‌) పెట్టారు. గతేడాది డిసెంబరులో తమిళనాడులో ‘దిత్వా’ తుఫాన్‌ తీరం దాటింది. ఆ తర్వాత సుమారు పది నెలలకు ఆర్నబ్‌ వచ్చింది.

కోస్తాంధ్రకు రెడ్‌ అలర్ట్‌

  • ఉత్తర కోస్తాపై విరుచుకుపడనున్న అతి తీవ్ర తుఫాన్‌ ‘ఆర్నబ్‌’

  • రేపు ఉదయం యానాం వద్ద తీరం దాటే అవకాశం

  • ఆ పరిసరాల్లో ముందుకు రానున్న సముద్రం

  • నేడు, రేపు కుంభవృష్టి, అతి భారీ వర్షాలు

  • గంటకు 115 నుంచి 140 కి.మీ. వేగంతో గాలులు

  • వ్యవసాయ, ఉద్యాన పంటలపై ప్రభావం

  • కాకినాడ, గంగవరంలో మూడో నంబరు హెచ్చరిక

  • పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): దేశ తూర్పుతీరంలో ఈ ఏడాది తొలి తుఫాన్‌ సోమవారం బంగాళాఖాతంలో ఏర్పడింది. ఈ తుఫాన్‌కు బంగ్లాదేశ్‌ ప్రభుత్వం సూచించిన పేరు(ఆర్నబ్‌) పెట్టారు. గతేడాది డిసెంబరులో తమిళనాడులో ‘దిత్వా’ తుఫాన్‌ తీరం దాటింది. ఆ తర్వాత సుమారు పది నెలలకు ఆర్నబ్‌ వచ్చింది. హిందూ మహాసముద్రం నుంచి తేమ మేఘాలు బంగాళాఖాతం వైపు రావడంతో అక్కడ ఉపరితల ఉష్ణోగ్రతలు 29 నుంచి 30 డిగ్రీలు వరకు నమోదవుతున్నాయి. దక్షిణ తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం నుంచి అవసరమైన తేమగాలులు తుఫాన్‌ దిశగా వస్తున్నాయి. వీటన్నింటితో ఆర్నబ్‌ తుఫాన్‌ బలంగా మారుతోందని, ఉత్తర కోస్తాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడనున్నదని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కోస్తాంధ్రకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది.


తూర్పు మధ్య, దానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం ఆదివారం రాత్రి వరకు నైరుతి దిశలో పయనించిన అనంతరం పశ్చిమ వాయవ్యంగా దిశ మార్చుకుంది. సోమవారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి తుఫాన్‌గా బలపడింది. సోమవారం రాత్రికి ఇది తీవ్ర తుఫాన్‌గా మారింది. ఇది గంటకు 13 కి.మీ. వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి మంగళవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాన్‌గా బలపడనుంది. బుధవారం తెల్లవారుజాము నాటికి ఉత్తర కోస్తాకు అతి సమీపంగా వచ్చి అదేరోజు ఉదయం విశాఖపట్నం, మచిలీపట్నం మధ్య యానాం వద్ద తీరం దాటనున్నదని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం తెలిపింది. అతితీవ్ర తుఫాన్‌ తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్లు, అప్పుడప్పుడు 140 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని హెచ్చరించింది. కాగా, మంగవారం మధ్యాహ్నం తర్వాత అత్యంత తీవ్ర తుఫాన్‌గా మారుతుందని ఇస్రో వాతావరణ నిపుణుడు హెచ్చరించారు.

మీటరున్నర ఎత్తుకు ఎగసిపడనున్న అలలు

మంగళవారం రాత్రి నుంచి కాకినాడ, యానాం, కోనసీమ ప్రాంతాల్లో సముద్ర అలలు మీటరు నుంచి మీటరున్నర ఎత్తు వరకు ఎగసిపడతాయని, దీంతో సముద్రం ముందుకు వస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, అల్లూరి జిల్లాలపై పెనుగాలులు, కుంభవృష్టి వర్షాల తీవ్ర ప్రభావం ఉంటుందని, ముఖ్యంగా కాకినాడ, కోనసీమ జిల్లాలు అత్యంత ప్రభావానికి గురవుతాయని వాతావరణ నిపుణుడొకరు పేర్కొన్నారు. మంగళ, బుధవారాల్లో దూరప్రయాణాలు వాయిదా వేసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. తీర ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆ సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్‌ సూచించారు. సంద్రంలోని హోప్‌ ఐలాండ్‌లో నివాసముంటున్న 130మంది మత్స్యకారులను కాకినాడ కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ ఆదేశాల మేరకు సోమవారం తూరంగిలోని తుఫాను షెల్టర్‌లోకి తరలించారు.


స్కూళ్లకు సెలవులు..

తుఫాను నేపథ్యంలో ఉభయగోదావరి, విశాఖ, కాకినాడ, కోనసీమ, కృష్ణా, విజయనగరం, ఎన్టీఆర్‌, బాపట్ల, ఏలూరు, శ్రీకాకుళం జిల్లాల్లో పాఠశాలలకు మంగళ, బుధవారాలు సెలవులు ప్రకటించారు. అనకాపల్లి జిల్లాలో మాత్రం గురువారం కూడా సెలవు ఇచ్చారు.

బీచ్‌లు తాత్కాలికంగా మూసివేత

బాపట్ల జిల్లా పరిధిలోని సూర్యలంక, రామాపురం, ఓడరేవు బీచ్‌లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఎస్పీ ఉమామహేశ్వర్‌ తెలిపారు. మంగళవారం నుంచి తదుపరి ఆదేశాలు వెలువడే వరకు సముద్రతీర ప్రాంతాలకు సందర్శకులకు అనుమతి లేదన్నారు.

నేడు, రేపు అతిభారీ వర్షాలు

కోస్తాంధ్రలో పలుచోట్ల సోమవారం వర్షాలు కురిశాయి. మంగళవారం అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కుంభవృష్టి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అల్లూరి, ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అతిభారీగా, కోస్తాంధ్రలోని మిగిలిన జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయి. బుధవారం విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, ఉభయ గోదావరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కుంభవృష్టి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, బాపట్ల జిల్లాల్లో అతిభారీగా, కోస్తాంధ్రలోని మిగిలిన జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 29వ తేదీ వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, కోస్తాంధ్రలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం తెలిపింది. కాకినాడ, గంగవరం ఓడరేవుల్లో మూడో నంబరు, విశాఖ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం రేవుల్లో రెండో నంబరు ప్రమాద సూచిక జారీచేశారు. వ్యవసాయ, ఉద్యాన పంటలపై ప్రభావం పడనుందని ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ వార్తలనూ చదవండి:

బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’

అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

Updated Date - Oct 27 , 2026 | 04:15 AM