వేట్లపాలెం బాధితులకు అండగా ఉంటాం: సీఎం
ABN , Publish Date - Mar 05 , 2026 | 04:30 AM
కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
అమరావతి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. బుధవారం అసెంబ్లీలో సంతాప ప్రకటన చేశారు. మృతులకు సంతాపం తెలుపుతూ సభ 2 నిమిషాలు మౌనం పాటించింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకూ 26 మంది చనిపోయారని ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆరుగురు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ పరిశ్రమకు గత ప్రభుత్వ హయాంలోనే లైసెన్సులు, అనుమతులు ఇచ్చారని చెప్పారు. ఈ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా తయారీ చేసిందని, కూలీలను పెట్టుకుందన్నారు. ఆర్డర్లు ఉన్నాయని బాణసంచా పెద్ద ఎత్తున తయారు చేసిందని, పరిమితికి మించి మందుగుండు సామగ్రి నిల్వ చేసిందని వెల్లడించారు. అన్ని జాగ్రత్తలూ తీసుకుని బాణసంచా తయారు చేయాలని, దురాశతో ఎక్కువ బాణసంచా తయారు చేయాలని ప్రయత్నించడమే ప్రమాదానికి కారణమైందని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కానివ్వబోమన్నారు. పెద్దాపురం ఆర్డీవో, పెద్దాపురం డీఎస్పీ, జిల్లా ఫైర్ ఆఫీసర్, లేబర్ ఆఫీసర్‌లను సస్పెండ్ చేశామని చెప్పారు. ఘటనకు కారణమైన ఫైర్‌వర్క్స్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించానని తెలిపారు. వారికి కేంద్రం రూ.2 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షలు నష్టపరిహారం ప్రకటించాయన్నారు. ఆ కుటుంబాలకు ఇళ్లు కట్టించి ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఓ పార్టీ ఉన్నా ఇలాంటి ఘటనలు పట్టవన్నారు. ప్రజా సమస్యలపై కాకుండా శ్రీవారి లడ్డూ ప్రసాదంపై రాజకీయం చేస్తోందని విమర్శించారు. వేట్లపాలెం ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసేందుకు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్‌కుమార్, ఐజీ రామకృష్ణతో ఉన్నతాధికారుల కమిటీ వేశామని వివరించారు.