Share News

నేటి నుంచి గుంటూరు, కుప్పంలో సీఎం పర్యటన

ABN , Publish Date - Jan 30 , 2026 | 05:47 AM

సీఎం చంద్రబాబు రేపటి నుంచి గుంటూరు, కుప్పంలో పర్యటించనున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మాతాశిశు ఆరోగ్య కేంద్ర భవనాన్ని సీఎం శుక్రవారం ప్రారంభిస్తారు

నేటి నుంచి గుంటూరు, కుప్పంలో సీఎం పర్యటన

  • కుప్పంలో 3 రోజులపాటు కార్యక్రమాలు

అమరావతి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు రేపటి నుంచి గుంటూరు, కుప్పంలో పర్యటించనున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మాతాశిశు ఆరోగ్య కేంద్ర భవనాన్ని సీఎం శుక్రవారం ప్రారంభిస్తారు. గుంటూరు మెడికల్‌ కాలేజీ అల్యూమిని ఆఫ్‌ నార్త్‌ అమెరికా(జింకానా) పేరుతో ఈ కాలేజీ పూర్వ విద్యార్థులు రూ.100 కోట్ల విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమం అనంతరం ఆదివారం సాయంత్రం వరకు కుప్పంలో సుమారు రూ.690 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. తొలి రోజు.. రూ.3కోట్లతో నిర్మించిన అగస్త్య విద్యాచల్‌ అకాడమీని ప్రారంభిస్తారు. రూ.10 కోట్లతో నిర్మించనున్న లెర్నర్స్‌ అకామిడేషన్‌ ఫెసిలిటీ సెంటర్‌ను, రూ.2కోట్లతో చేపట్టే ఓబరాయ్‌ విజిటర్స్‌ సెంటర్‌కు శంకుస్థాపన చేస్తారు. రెండోరోజు.. 5,555 ఈ సైకిళ్ల పంపిణీలో పాల్గొంటారు. అనంతరం 7 కొత్త పరిశ్రమలతో ఎంవోయూలు కుదుర్చుకునే కార్యక్రమంలో పాల్గొంటారు. వీటి ద్వారా రూ.675.24 కోట్ల పెట్టుబడులు, 12వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. కుప్పం నియోజకవర్గాన్ని నెట్‌ జీరోగా మార్చే ప్రణాళికను ప్రారంభించడంతోపాటు సుర్బానా జురాంగ్‌ రూపొందించిన కుప్పం మాస్టర్‌ ప్లాన్‌, మోడల్‌ బస్‌స్టాండ్‌ డిజైన్లను సీఎం సమీక్షిస్తారు. చివరి రోజైన ఆదివారం.. పార్టీ క్యాడర్‌తో సమావేశమవుతారు. అదే రోజు తిరిగి అమరావతి చేరుకుంటారు.

Updated Date - Jan 30 , 2026 | 05:47 AM