Share News

జడ్పీ ఇక మూడుగా విభజన

ABN , Publish Date - Aug 19 , 2026 | 01:38 AM

జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్‌(జడ్పీ)లను కూడా పునర్వ్యస్థీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిధి మేరకు ఉన్న చిత్తూరు జడ్పీ.. ఇక నుంచి మూడుగా మారనుంది. చిత్తూరుతో పాటు తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోనూ కొత్తగా జడ్పీ కార్యాలయాలు ఏర్పడనున్నాయి.

జడ్పీ ఇక మూడుగా విభజన
చిత్తూరు జడ్పీ కార్యాలయం

చిత్తూరు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్‌(జడ్పీ)లను కూడా పునర్వ్యస్థీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిధి మేరకు ఉన్న చిత్తూరు జడ్పీ.. ఇక నుంచి మూడుగా మారనుంది. చిత్తూరుతో పాటు తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోనూ కొత్తగా జడ్పీ కార్యాలయాలు ఏర్పడనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ మేరకు మంగళవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినేట్‌ మీటింగులో మంత్రులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం 2022 ఏప్రిల్‌లో జిల్లాల పునర్విభజన చేసింది. అందులో భాగంగా అన్ని శాఖల విభజన జరిగి ఆయా కొత్త జిల్లాలకు కార్యాలయాలు తరలివెళ్లాయి. జడ్పీకి పాలకవర్గం ఉండడంతో చట్టబద్ధంగా విడిపోయేందుకు అవకాశం లేకుండా పోయింది. సెప్టెంబరు ఆఖరున పాలకవర్గ పదవీకాలం పూర్తి కానున్న నేపథ్యంలో ప్రభుత్వం జడ్పీని విభజించేందుకు నిర్ణయించింది.

ప్రస్తుతం చిత్తూరులో ఉన్న జడ్పీకి సంబంధించిన ఆస్తులు, హక్కులు, బాధ్యతలు, రికార్డులు, సిబ్బంది తదితరాలు అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొత్తగా ఏర్పాటుచేసే జిల్లా పరిషత్తులకు బదలాయించనున్నారు. ప్రతి జడ్పీకి ఓ సీఈవో, ఓ డిప్యూటీ సీఈవో పోస్టు మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో సీఈవోగా ఇద్దరు, డిప్యూటీ సీఈవోగా మరో ఇద్దరు.. మొత్తంగా నలుగురు అధికారులకు అవకాశం రానుంది.

చైర్మన్‌ పోస్టు ఆశలు

జిల్లా వ్యాప్తంగా అధికారం కలిగిన జడ్పీ చైర్మన్‌ పోస్టు ఎమ్మెల్యే స్థాయి కంటే ఎక్కువే. ప్రస్తుతం ఇది ఉమ్మడి జిల్లా మేరకు ఉంది. వైసీపీ ప్రభుత్వం ఒకటిగా ఉన్న వైస్‌ చైర్మన్‌ పోస్టును ఆశావహుల కోసం రెండుగా చేసింది. ఇప్పుడు జడ్పీల విభజన నేపథ్యంలో రాజకీయ ఆశావహులకు మంచి అవకాశంగా మారింది. ప్రతి జిల్లాలోనూ ఓ చైర్మన్‌, ఇద్దరు వైస్‌ చైర్మన్లు ఉంటారు. అంటే ముగ్గురికి మంచి పదవులు దక్కనున్నాయి.

Updated Date - Aug 19 , 2026 | 01:39 AM