ముగిసిన జడ్పీ కాలపరిమితి
ABN , Publish Date - Sep 24 , 2026 | 12:37 AM
తాజా పాలకవర్గంతో పాటు ఉమ్మడి జడ్పీ కాలపరిమితి కూడా నేటితో ముగియనుంది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు వేర్వేరు జడ్పీలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
చిత్తూరు రూరల్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): తాజా పాలకవర్గంతో పాటు ఉమ్మడి జడ్పీ కాలపరిమితి కూడా నేటితో ముగియనుంది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు వేర్వేరు జడ్పీలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 25వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో జడ్పీలు పనిచేయనున్నాయి. ఆయా జడ్పీల్లో పాలకవర్గాలు ఏర్పాటయ్యేవరకు ప్రత్యేకాధికారుల పాలన కొనసాగనుంది. తాజా పాలకవర్గం ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చివరి పాలకవర్గంగా నిలిచిపోనుంది. అధికారుల్ని, పోలీసుల్ని అడ్డుపెట్టుకుని 2021లో ఏకగ్రీవంగా ఎన్నికైన వైసీపీ జడ్పీటీసీలకు ఐదేళ్ల కాలపరిమితి నేటితో పూర్తి కానుంది.తమ పార్టీయే రెండున్నరేళ్లు అధికారంలో వున్నా పెద్దగా సాధించిందేమీ లేకపోగా కొంతమంది అధికారులు కూడా వైసీపీ నేతల తరహాలోనే విధులు నిర్వహించి అపకీర్తి మూటగట్టుకున్నారు.వీరిలో జడ్పీ సీఈవోగా పనిచేసిన ప్రభాకర రెడ్డి ముఖ్యుడు.వైసీపీ ప్రభుత్వమున్న రెండున్నరేళ్లలో రూ.83.35 కోట్లను ఖర్చు చేస్తే.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రెండున్నరేళ్లలో జడ్పీ రూ.138.06 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది.గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, పాఠశాలలు, ఇతర మౌలిక వసతుల కోసం నిధులు కేటాయించాలని పలువురు జడ్పీటీసీలు వైసీపీ ప్రభుత్వ హయాంలో గగ్గోలు పెట్టేవారు. అయినా పనులు జరిగేవి కాదు.కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జడ్పీ నిధులతో అభివృద్ధి పనులకు ప్రాధాన్యం పెరిగిందని జడ్పీటీసీ సభ్యులే చెప్పుకుంటున్నారు.వైసీపీ హయాంలో చేసిన పనులకూ కూటమి ప్రభుత్వమే బిల్లులు ఇచ్చిందంటున్నారు.ఆఖరుకు వైసీపీ ప్రభుత్వం ఇవ్వకుండా నిలిపేసిన గౌరవ వేతనం కూడా కూటమి ప్రభుత్వం వచ్చాకే విడుదల చేసిందంటున్నారు. రాజకీయాలతో సంబంధం లేని శ్రీనివాసులు తన సోదరుడితో జగన్ కుటుంబానికున్న సాన్నిహిత్యం కారణంగా జడ్పీ ఛైర్మన్ కాగలిగారు.అయితే వైసీపీ నాయకుల తరహాలో కాకుండా ఈయన వివాదాలకు, అరాచకాలకు దూరంగానే ఉన్నారు. కానీ, పాలనలో తనదైన ముద్ర వేయలేకపోయారు.
పెద్దిరెడ్డి అండతో చెలరేగిన ప్రభాకర రెడ్డి
జడ్పీ సీఈవోగా పనిచేసిన ప్రభాకర రెడ్డి వ్యవహారశైలి ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు మిగిల్చింది.2008 నుంచి 2017వరకూ వరకు జడ్పీలో సూపరింటెండెంట్‌గా పనిచేసిన ఆయనకు ఎంపీడీవోగా పదోన్నతి వచ్చినప్పటికీ తిరిగి డిప్యుటేషన్‌పై జడ్పీలోనే కొనసాగారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి మంత్రి పెద్దిరెడ్డి అండదండలతో ఏఓ, డిప్యూటీ సీఈవోతో పాటు ఇన్‌చార్జి సీఈవో బాధ్యతలను ఏకకాలంలో నిర్వహించారు.ఆయన హయాంలోనే ఉద్యోగులను రాత్రి వేళల్లోనూ కార్యాలయంలో ఉంచుకోవడంతోపాటు, సస్పెన్షన్లు, ఇంక్రిమెంట్లు నిలిపివేయడం, వేతనాల ఫిక్సేషన్‌లో జాప్యం, సర్వీస్ రిజిస్టర్లు, చివరి వేతన ధ్రువీకరణ పత్రాల జారీలో ఇబ్బందులు వంటివి చోటుచేసుకున్నాయి. ఉద్యోగులపై నిఘా కోసం కార్యాలయంలో టాయిలెట్ల వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారనే అంశం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రభాకర రెడ్డి వేధింపుల కారణంగానే నాగలాపురం ఎంపీడీవో బాలగణేష్, జడ్పీ సీనియర్ అసిస్టెంట్ పురుషోత్తంరెడ్డి, టైపిస్టు కెనడీ, రికార్డు అసిస్టెంట్ యుగంధర్ ప్రాణాలు కోల్పోయారని జడ్పీ ఉద్యోగులు అప్పట్లో పీఆర్ కమిషనర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. మరోవైపు జడ్పీకి వచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులు, ఇతర సాధారణ నిధులు, వాటిపై వచ్చిన వడ్డీ మొత్తాల నిర్వహణతో పాటు నిధుల వినియోగానికి సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్ల విషయంలోనూ పలు అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నిధులను సేవింగ్స్ ఖాతాల్లో ఉంచడం, వాటి వినియోగం, లెక్కలు,యుటిలైజేషన్ సర్టిఫికెట్ల జారీ తదితర అంశాలు కూడా వివాదానికి దారితీశాయి. ఉద్యోగులతో వ్యవహరించిన తీరుతో పాటు పరిపాలనాపరమైన అంశాలకు సంబంధించి ప్రభాకర రెడ్డిపై ప్రభుత్వం తొమ్మిది అభియోగాలను నమోదు చేసి వివరణ కోరింది. అనంతరం ప్రభుత్వం ఆయనపై చర్యలు చేపట్టి సస్పెండ్ చేసింది. సస్పెన్షన్‌లో ఉండగానే ఆయన రిటైరై పోయారు.