Share News

మూడు జిల్లాల వారీగా జడ్పీ ఎన్నికలు

ABN , Publish Date - Mar 18 , 2026 | 01:56 AM

అంతకుముందే జడ్పీ విభజన రాష్ట్ర స్థాయిలో ప్రారంభమైన కసరత్తు

మూడు జిల్లాల వారీగా జడ్పీ ఎన్నికలు
జడ్పీ కార్యాలయం

చిత్తూరు, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): ఆరు నెలల్లో అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తామని, పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి 17తో మున్సిపాలిటీల్లో, ఏప్రిల్‌ 2తో గ్రామ పంచాయతీల్లో పాలకవర్గాల గడువు ముగియనుంది. సెప్టెంబరులో జడ్పీ పాలకవర్గం ముగియనున్న నేపథ్యంలో అన్ని రకాల స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ప్లాన్‌లో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిధలో ఉన్న జడ్పీ.. ఎన్నికల నాటికి మూడు జిల్లాల వారీగా విభజన కానుంది. రాష్ట్ర స్థాయిలో జడ్పీ విభజనకు కసరత్తు ప్రారంభమైంది.

2021 సెప్టెంబరు 25న జిల్లా పరిషత్‌ పాలకవర్గం కొలువుదీరింది. ఈ ఏడాది సెప్టెంబరు 24తో ఈ పాలకవర్గం గడువు ముగియనుంది. నాటి ఎన్నికల సందర్భంగా అధికారంలో ఉన్న వైసీపీ నేతలు ప్రత్యర్థులు నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారు. అలా 65 స్థానాలకుగాను 30 చోట్ల జడ్పీటీసీ స్థానాల్ని ఏకగ్రీవం చేసుకుంది. తర్వాత టీడీపీ ఆ ఎన్నికలను బహిష్కరించడం వైసీపీకి కలిసొచ్చింది. 2022 ఏప్రిల్‌లో జిల్లాల పునర్విభజనతో ఉమ్మడి చిత్తూరు జిల్లా మూడు ముక్కలైంది. చిత్తూరు జడ్పీ మూడు జిల్లాల పరిధిలోనూ పనిచేస్తోంది. జడ్పీ మీటింగులకు మూడు జిల్లాల ఉన్నతాధికారులూ చిత్తూరు రావాలి. సమయం, దూరం కారణంగా వారు గైర్హాజరై, కిందిస్థాయి అధికారులను పంపుతున్నారు. తమ పరిధిలోని సమస్యల్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక జడ్పీటీసీ సభ్యులు గగ్గోలు పడుతున్నారు. జడ్పీ సీఈవో చిత్తూరు నుంచి పనిచేస్తుండగా.. తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో డిప్యూటీ సీఈవోలు పనిచేస్తున్నారు. ఇక, ఈ ఏడాది సెప్టెంబరు 25 నాటికి జడ్పీ పాలకవర్గం గడువు ముగియనుండటంతో.. కొత్త జిల్లాల వారీగా ఎన్నికలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం విభజన కసరత్తు ప్రారంభించింది. దీంతో తిరుపతి, అన్నమయ్య జిల్లాలకూ కొత్తగా జడ్పీలు ఏర్పాటు కానున్నాయి. ఓ చైర్మన్‌, ఇద్దరు వైస్‌ చైర్మన్లు ఉండగా.. చిత్తూరుతో పాటు రెండు కొత్త జిల్లాలకు కలిపి ముగ్గురు చైర్మన్లు, ఆరుగురు వైస్‌ చైర్మన్లు ఉంటారు. జడ్పీటీసీల సంఖ్యలో మార్పు ఉండదు. ఎంపీడీవోలను డిప్యూటీ సీఈవోలుగా, డీఎల్‌డీవోలుగా ఇటీవల పదోన్నతులు పొందిన వారికీ మంచి పోస్టులు దక్కనున్నాయి.

నేటి నుంచి మున్సిపాలిటీల్లో ప్రత్యేక పాలన

కుప్పం మున్సిపాలిటీ మినహా చిత్తూరు నగరపాలక సంస్థ, ఇతర మున్సిపాలిటీల్లో మంగళవారంతో పాలవర్గాల గడువు ముగిసింది. మేయర్‌, కార్పొరేటర్లు, ఆయా మున్సిపాలిటీల్లోని చైర్మన్లు, కౌన్సిలర్లు ఇక మాజీలు కానున్నారు. ఈ నేపథ్యంలో వారం కిందటే ప్రభుత్వం ప్రత్యేకాధిరుల్ని నియమించింది. కార్పొరేషన్లకు ఆయా జిల్లాల కలెక్టర్లు, మున్సిపాలిటీలకు ఆర్డీవో స్థాయి అధికారులతో బుధవారం నుంచి ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం కానుంది.

పంచాయతీల్లో ‘ప్రత్యేక’ కసరత్తు ప్రారంభం

గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల నియమకానికి కసరత్తు ప్రారంభమైంది. సర్పంచుల పదవీకాలం ఏప్రిల్‌ 2న ముగియనున్న నేపథ్యంలో 3 నుంచి ప్రత్యేకాధికారుల పాలన మొదలు కానుంది. ప్రభుత్వ గైడ్‌లైన్స్‌ ప్రకారం కలెక్టర్లు ప్రత్యేకాధికారులను నియమించున్నారు.

Updated Date - Mar 18 , 2026 | 01:56 AM