మొదలైన జడ్పీ విభజన ప్రక్రియ
ABN , Publish Date - Aug 30 , 2026 | 01:27 AM
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ అంతకంటే ముందే జడ్పీల విభజన పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో చిత్తూరు ఉమ్మడి జిల్లాకు ఉన్న జడ్పీని మూడుగా అంటే తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు కూడా వేర్వేరుగా ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది.
ఎన్నికలకు ముందే విభజన పూర్తయ్యేలా చర్యలు
చంద్రగిరి ఎంపీడీవో కార్యాలయంలో తిరుపతి జిల్లా పరిషత్
మదనపల్లె జడ్పీ బంగ్లాలో అన్నమయ్యకు జడ్పీ కార్యాలయం
చిత్తూరు, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ అంతకంటే ముందే జడ్పీల విభజన పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో చిత్తూరు ఉమ్మడి జిల్లాకు ఉన్న జడ్పీని మూడుగా అంటే తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు కూడా వేర్వేరుగా ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. తొలుత పట్టణ స్థానిక సంస్థలకు (మున్సిపాలిటీలు) ఎన్నికలు నిర్వహించి.. తర్వాత గ్రామీణ స్థానిక సంస్థలకు (పరిషత్, పంచాయతీ) నిర్వహించాలని ప్రభుత్వం ఇది వరకే నిర్ణయం తీసుకుంది. 2020లో పరిషత్ ఎన్నికలు ప్రాంభమైతే వైసీపీ నాయకులు పెద్దఎత్తున అక్రమ ఏకగ్రీవాలు చేసుకున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల్ని వాయిదా వేసింది. తర్వాత కరోనా మహమ్మారితో ఎన్నికలు మరింత ఆలస్యమయ్యాయి. ఏకగ్రీవాలైన స్థానాలు మినహా మిగిలిన స్థానాల్లో 2021 ఏప్రిల్‌లో పోలింగ్ జరిగింది. 2021 సెప్టెంబరులో ఏర్పాటైన ఉమ్మడి జిల్లా జడ్పీ పాలకవర్గం పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబరు 24వ తేదీతో ముగియనుంది. ఆ వెంటనే అక్టోబరులో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
రెండు జిల్లాలకు జడ్పీ కార్యాలయాల గుర్తింపు
అక్టోబరులోనే పరిషత్ ఎన్నికల్నీ నిర్వహించనున్న కారణంగా అంతకంటే ముందే జడ్పీని మూడుగా విభజించాల్సి ఉంది. చిత్తూరులోని ఉమ్మడి జడ్పీ కార్యాలయం ఇక నుంచి చిత్తూరు జిల్లాకే పరిమితం కానుంది. తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో వేర్వేరు జడ్పీలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతానికి తిరుపతి జిల్లాకు చంద్రగిరిలోని ఎంపీడీవో కార్యాలయంలో జడ్పీని నిర్వహించాలని ప్రతిపాదన పంపించారు. మదనపల్లెలోని జడ్పీ బంగ్లా క్యాంప్‌సలో ఉన్న అన్ని శాఖల ఇంజనీరింగ్ కార్యాలయాలను ఖాళీ చేయించి.. అక్కడ జడ్పీ కార్యాలయాన్ని నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. మూడు జిల్లాలకూ ముగ్గురు సీఈవోలు, ముగ్గురు డిప్యూటీ సీఈవోలు పనిచేయనున్నారు.
పరిషత్ ఎన్నికల కసరత్తూ ప్రారంభం
జడ్పీల విభజన అయ్యేవరకు చిత్తూరు ఉమ్మడి జడ్పీ కార్యాలయం నుంచే ఎన్నికల కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆర్వోలు, ఈఆర్వోలు వంటి అధికారుల జాబితాను సిద్ధం చేయగా, కలెక్టర్ ఫైనల్ చేయాల్సి ఉంది. విభజన తర్వాత కూడా కొత్త జడ్పీల్లో సిబ్బంది కుదటపడే వరకు చిత్తూరు నుంచే పాలన సాగనుంది. 2022లో జిల్లాల విభజన జరిగినా.. ఇప్పటికీ కొన్ని శాఖల కార్యకలాపాలు చిత్తూరు నుంచే సాగుతున్నాయి.
పాత రిజర్వేషన్లు పరిగణలోకి లేకుండా..
జిల్లాలతో పాటు జడ్పీలూ కొత్తగా ఏర్పాటయ్యాక జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో పాత రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకోకుండా కొత్తగా ఖరారు చేయనున్నారు. అంటే గతంలో ఫలానా జడ్పీటీసీ స్థానానికి బీసీ రిజర్వు అయింది.. ఈసారి ఓసీ వస్తుందనుకునే పరిస్థితి లేదు. ఇదే సూత్రం చైర్మన్లకూ వర్తించనుంది. దీంతో మూడు జిల్లాలకు జడ్పీ చైర్మన్ల రిజర్వేషన్‌పై అధికార కూటమి, వైసీపీలో ఉత్కంఠ నెలకొంది.
ఉమ్మడి జిల్లా పరిషత్‌కు తెర
సెప్టెంబరు 24తో ముగియనున్న పాలకవర్గ పదవీకాలం
చిత్తూరు, రూరల్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ఇప్పటి వరకు 65 జడ్పీటీసీలతో ఉన్న ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్.. ఇక 27 జడ్పీటీసీలకు పరిమితం కానుంది. జిల్లాల పునర్విభజన జరిగేటప్పటికే జిల్లా పరిషత్‌కు పాలకవర్గం ఉంది. అందుకని జడ్పీని ఉమ్మడిగా ఉంచారు. ఈ ఉమ్మడి పాలకవర్గ పదవీకాలం సెప్టెంబరు 24తో ముగియనుంది. ఆ తర్వాత కొత్తగా తిరుపతి, అన్నమయ్య జిల్లా పరిషత్ కార్యాలయాలు ఆవిర్భవించనున్నాయి. అందుకని ఈసారి కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో 65 జడ్పీటీసీ, 811 ఎంపీటీసీ స్థానాలున్నాయి. జిల్లాల పునర్విభజనతో ఇప్పుడు చిత్తూరు జిల్లాలో 27 జడ్పీటీసీ, 811 ఎంపీటీసీ.. తిరుపతి జిల్లాలో 19 జడ్పీటీసీ, 253 ఎంపీటీసీ.. అన్నమయ్య జిల్లాలో 19 జడ్పీటీసీ, 254 ఎంపీటీసీ స్థానాలు ఉండనున్నాయి. వీటితో పాటు తిరుపతి జడ్పీకి అదనంగా సూళ్లూరుపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాలతో పాటు వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి, వాకాడు, చిట్టమూరు మండలాలకు సంబంధించి జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు కలవనున్నాయి. అన్నమయ్య జడ్పీకి రాయచోటి నియోజకవర్గంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు చేరనున్నాయి.
109 ఏళ్ల జడ్పీ భవనం
ఉమ్మడి చిత్తూరు జడ్పీ భవనానికి 109 ఏళ్ల చరిత్ర ఉంది. జిల్లా బోర్డు నుంచి జడ్పీ కార్యాలయం వరకు సేవలందిస్తూ వస్తోంది. 1971 జనవరి 18న అప్పటి జిల్లా బోర్డు అధ్యక్షుడు హెచ్.ఎల్.బ్రెయిడ్‌వుడ్ ఐసీఎస్ ఈ భవనాన్ని ప్రారంభించారు. ఇంత సుదీర్ఘ కాలం గడిచినా చెక్కుచెదరకుండా ఉంది. ఈ భవనం.. తొలుత జిల్లా బోర్డు కార్యాలయంగా సేవలందించింది. అప్పట్లో గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, విద్య, ఆరోగ్యం తదితర స్థానిక పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా బోర్డు పర్యవేక్షించేది. ఆ తర్వాత 1962లో జిల్లా పరిషత్తులు ఏర్పడటంతో ఇదే భవనం జడ్పీ కార్యాలయంగా మారింది. తొలి జడ్పీ చైర్మన్‌గా బలరామరెడ్డి బాధ్యతలు చేపట్టడంతో జిల్లా పరిషత్ పాలన మొదలైంది. ఇప్పుడు ఉమ్మడి జిల్లాకు చివరి జడ్పీ చైర్మన్‌గా శ్రీనివాసులున్నారు.