Share News

‘ఆమె’కే జడ్పీ చైర్మన్‌ స్థానం

ABN , Publish Date - Oct 14 , 2026 | 01:59 AM

చిత్తూరు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవిని ‘అన్‌రిజర్వ్‌డ్‌ మహిళ’కు కేటాయించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి రిజర్వేషన్‌ను అధికారులు ప్రకటించారు.

‘ఆమె’కే జడ్పీ చైర్మన్‌ స్థానం

చిత్తూరు రూరల్‌ అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవిని ‘అన్‌రిజర్వ్‌డ్‌ మహిళ’కు కేటాయించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి రిజర్వేషన్‌ను అధికారులు ప్రకటించారు. ఈ కేటాయింపుతో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవిని ఆశిస్తున్న మహిళా నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసే అవకాశం ఉంది. ప్రధాన రాజకీయ పార్టీల్లో ఈ పదవిని ఎవరికి కేటాయించాలనే అంశంపై చర్చలు మొదలయ్యాయి.

తమ ఇంట్లో మహిళలకోసం..

జడ్పీ చైర్మన్‌ అభ్యర్థిత్వానికి నేతల ప్రయత్నాలు

చిత్తూరు, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జడ్పీ చైర్మన్‌ పదవి అన్‌రిజర్వుడ్‌ మహిళకు ఖరారైంది. దీంతో ఇన్నాళ్లు అభ్యర్థిత్వం ఆశించిన ఆయా పార్టీల నేతలంతా.. ఇప్పుడు తమ కుటుంబంలోని మహిళల కోసం ప్రయత్నాలు చేపట్టారు. కొందరు భార్యలను, మరికొందరు కూతుళ్లను రంగంలోకి దించేందుకు చర్యలు చేపట్టారు. ఇక, టీడీపీలో టిక్కెట్‌ను ఆశించే వారిలో ప్రధానంగా చర్చ జరుగుతున్న వారిలో..

జీడీనెల్లూరు మాజీ కోఆర్డినేటర్‌ భీమినేని చిట్టిబాబు తన కూతురు డాక్టర్‌ జాహ్నవిని బరిలో నిలిపేందుకు సిద్ధమవుతున్నారు. ఈయన గతంలో పాలసముద్రం జడ్పీటీసీగా, పుత్తూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా పనిచేవారు. జిల్లా అధ్యక్ష పదవి ఆశించి భంగపడ్డారు. పాలసముద్రం జడ్పీటీసీ స్థానం జనరల్‌ మహిళకు రిజర్వు కావడం ఆయనకు అనుకూలాంశం.

చిత్తూరు రూరల్‌ మండలానికి చెందిన సీనియర్‌ నేత చంద్రప్రకాష్‌ కూడా తన సతీమణి గీర్వాణి లేదా ఇద్దరు కూతుర్లలో ఒకరిని పోటీ చేయించాలనుకుంటున్నారు. ఈయన భార్య గీర్వాణి గతంలో జడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేసి అభివృద్ధిలో తమదైన ముద్ర వేసిన విషయం తెలిసిందే.

ఇక, చిత్తూరు రూరల్‌ మండలానికే చెందిన మాజీ ఎంపీపీ జయచంద్రనాయుడు కూడా మంగళవారం పార్టీ పెద్దల్ని కలిశారు. తన సతీమణి సునీతను పోటీ చేయించేందుకు సిద్ధపడుతున్నారు. చిత్తూరు రూరల్‌ జడ్పీటీసీ స్థానం ఎస్సీలకు రిజర్వు కావడంతో ఈ ఆశావహులు మరో మండలం నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది.

బంగారుపాళ్యం మండలానికి చెందిన ఎన్‌పీ జయప్రకాష్‌ తన భార్య సుచిత్రను పోటీ చేయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈయన గతంలో డీసీసీబీ చైర్మన్‌, జిల్లా అధ్యక్ష పదవి ఆశించినా.. దక్కలేదు. ఇక, బంగారుపాళ్యం జడ్పీటీసీ స్థానం అన్‌రిజర్వుడ్‌ కావడం ఆయనకు అనుకూలంగా మారింది.

బంగారుపాళ్యం మండలం నుంచి బెంగళూరులో బిల్డర్‌గా స్థిరపడిన ఈశ్వర్‌నాయుడు కూడా అధిష్ఠానం వద్ద తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తన సతీమణి మమతశ్రీని పోటీ చేయించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈశ్వరఅభయ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేయడంతో ఈయనకు గుర్తింపు ఉంది.

Updated Date - Oct 14 , 2026 | 01:59 AM