Share News

దళిత మహిళకే జడ్పీ అధ్యక్ష పీఠం!

ABN , Publish Date - Oct 14 , 2026 | 02:01 AM

తిరుపతి జిల్లా పరిషత్‌ తొలి అధ్యక్ష పీఠంపై దళిత మహిళ ఆశీనురాలు కానున్నారు.దీంతో ఇప్పటివరకూ జడ్పీ ఛైర్మన్‌ పదవిపై కన్నేసి తమవంతు ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్న ప్రధాన పార్టీల ఆశావహులు డీలా పడ్డారు. ముఖ్యంగా టీడీపీలో పలువురు నేతలు జడ్పీ ఛైర్మన్‌ పదవి ఆశించారు.కొందరు ఇప్పటికే పార్టీలో ఓ స్థాయిలో కొనసాగుతున్న వారుండగా మరికొందరు అసలు రాజకీయాల్లోకే రానివారు కూడా వుండడం గమనార్హం.

దళిత మహిళకే జడ్పీ అధ్యక్ష పీఠం!

తిరుపతి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా పరిషత్‌ తొలి అధ్యక్ష పీఠంపై దళిత మహిళ ఆశీనురాలు కానున్నారు.దీంతో ఇప్పటివరకూ జడ్పీ ఛైర్మన్‌ పదవిపై కన్నేసి తమవంతు ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్న ప్రధాన పార్టీల ఆశావహులు డీలా పడ్డారు. ముఖ్యంగా టీడీపీలో పలువురు నేతలు జడ్పీ ఛైర్మన్‌ పదవి ఆశించారు.కొందరు ఇప్పటికే పార్టీలో ఓ స్థాయిలో కొనసాగుతున్న వారుండగా మరికొందరు అసలు రాజకీయాల్లోకే రానివారు కూడా వుండడం గమనార్హం. ఒకరిద్దరు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కూడా మొదలు పెట్టేశారు. ఓ ఆశావహురాలైతే జడ్పీ ఛైర్మన్‌ పదవి కూటమిలో ఏ పార్టీకి ఖరారైతే ఆ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకున్నారు.ఇలాంటి ఆశావహులంతా తాజాగా విడుదలైన రిజర్వేషన్ల జాబితా చూసి నీరుగారిపోయారు. మరోవైపు తిరుపతి జడ్పీ ఛైర్మన్‌ పదవిని దళిత మహిళకు కేటాయించడం ద్వారా రిజర్వేషన్ల ఖరారులో అధికార పార్టీ ప్రమేయం గానీ, ప్రభుత్వ ప్రమేయం గానీ, రాజకీయ ప్రయోజనాలు గానీ లేవన్న సంకేతం ప్రజలకు అందినట్టయింది. నిష్పక్షపాతంగా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ జరిగిందన్న అభిప్రాయం జనంలో వ్యక్తమవుతోంది. మరోవైపు తిరుపతి జడ్పీ తొలి అధ్యక్ష పదవి దళిత మహిళకు దక్కడంతో ఎస్సీ సామాజికవర్గంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటి వరకూ ఈ పదవి కోసం రేసులో సంబంధిత సామాజికవర్గం నుంచీ ఆశావహులెవరూ లేకపోవడంతో ఇపుడు అందరి దృష్టీ దానిపై మళ్ళింది. ఏ పార్టీ తరపున ఎవరు రేసులోకి వస్తారు? కూటమిలో ఏ పార్టీకి పదవి ఖరారవుతుంది? అంతిమంగా ఎవరికి అఽభ్యర్థిత్వం దక్కుతుంది? అన్న దానిపై చర్చ మొదలైంది. ఇప్పటికైతే ప్రధానంగా టీడీపీ పార్లమెంటు కమిటీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి పేరు ప్రచారంలోకి వచ్చింది.సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత, ఆమె కుమార్తె డాక్టర్‌ హెలెన్‌ పేర్లు కూడా తెరమీదకు వస్తున్నాయి. వీరు ఆర్థికంగా కూడా బలంగా వుండడం సానుకూలాంశంగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. డాక్టర్‌ హేమలత ఎమ్మెల్యేగా ఎన్నిక కావడానికి ముందు జడ్పీటీసీగా పనిచేసి వున్నందున పంచాయతీరాజ్‌ వ్యవస్థ పైన, జడ్పీ వ్యవహారాలపైన లోతైన అవగాహన వుంటుందనేది కూడా అనుకూలతగా చెబుతున్నారు. ఇంకోవైపు చిత్తూరు మాజీ ఎంపీ దివంగత శివప్రసాద్‌ చిన్న కుమార్తె డాక్టర్‌ నీలిమ పేరు కూడా పార్టీ వర్గాల్లో చర్చకు వస్తోంది. ఆమె భర్త టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం ఛైర్మన్‌ పంతగాని నరసింహ ప్రసాద్‌ రైల్వే కోడూరు నుంచీ 2019లో టీడీపీ టికెట్‌పై పోటీ చేశారు. చిట్వేలి మండలం నాగవరం దళితవాడలో ఈ దంపతులు ఓటర్లుగా వున్నారు. నీలిమ ప్రస్తుతం తిరుపతిలోని ప్రభుత్వ బాలుర ప్రత్యేక గృహంలో వైద్యురాలిగా కొనసాగుతున్నారు. తెరమీదకు వచ్చిన నలుగురూ కూడా ఆర్థికంగా మంచి స్థితిలో వుండడంతో పాటు రాజకీయ నేపధ్యం కలిగిన కుటుంబాలకు చెందిన వారు. అయితే జడ్పీ ఛైర్మన్‌ పదవి కూటమిలో ఏ పార్టీకి ఖరారవుతుందన్నది తేలాక ఆశావహుల విషయంలో మరింత స్పష్టత రానుంది.

Updated Date - Oct 14 , 2026 | 02:01 AM