Share News

తిరుపతి టీడీపీ మేయర్‌ అభ్యర్థిపై వైసీపీ విష ప్రచారం

ABN , Publish Date - Oct 28 , 2026 | 02:02 AM

గుంటూరు గూండాకా?.. శ్రీవారి సన్నిధి గొల్ల యాదవునికా?

తిరుపతి టీడీపీ మేయర్‌ అభ్యర్థిపై వైసీపీ విష ప్రచారం

తిరుపతి- ఆంధ్రజ్యోతి: ‘‘గుంటూరు గూండాకా?.... శ్రీవారి సన్నిధి గొల్ల యాదవునికా?’’... అంటూ తిరుపతి మేయర్‌ అభ్యర్థిని టార్గెట్‌ చేస్తూ వైసీపీ సోషల్‌ మీడియా విష ప్రచారం మొదలు పెట్టింది. దీనికోసం ఏకంగా శ్రీవారిని, శ్రీవారి ఆలయాన్ని, దానితో ముడిపడివున్న పవిత్రమైన సన్నిధి గొల్ల వృత్తినీ ఎన్నికల రాజకీయాల్లోకి లాక్కొచ్చింది. వైసీపీ సోషల్‌ మీడియా విష ప్రచారం శ్రీవారి భక్తులను ఎంతగా వేదనకు గురి చేస్తోందో.. అంతకంటే ఎక్కువగా ఎన్నికల కోడ్‌ను వైసీపీ ఉల్లంఘిస్తున్న తీరు అందరినీ దిగ్ర్భాంతికి గురి చేస్తోంది. తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో మేయర్‌ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా మన్నెం శ్రీనివాస ప్రసాద్‌ అలియాస్‌ జేబీ శ్రీనివాస్‌, వైసీపీ తరపున వాసుదేవ పోటీ చేస్తున్నారు. తిరుపతి రాజకీయాల్లో వైసీపీ దూకుడును, దౌర్జన్యకర పద్ధతులను దీటుగా ఎదుర్కొనే సత్తా ఉందన్న కారణంగా టీడీపీ అధిష్ఠానం జేబీ శ్రీనివాస్‌కు మేయర్‌ టికెట్‌ ఇచ్చింది. టీడీపీ నుంచీ బలమైన ప్రత్యర్థి తలపడుతుండడంతో ఏం చేయాలో పాలుపోని వైసీపీ నేతలు విష ప్రచారానికి దిగుతున్నారు. ఆ క్రమంలో ఎన్నికల కోడ్‌ను కూడా ఉల్లంఘిస్తున్నారు. పుష్ప సినిమా తరహాలో ఎర్రచందనం దుంగల బ్యాక్‌ గ్రౌండ్‌తో టీడీపీ అభ్యర్థి ఫొటో... శ్రీవారు, ఆలయం బ్యాక్‌ గ్రౌండ్‌తో వైసీపీ అభ్యర్థి ఫొటో పక్కపక్కనే పెట్టారు. టీడీపీ అభ్యర్థి ఫొటోపై గుంటూరు గూండాకా?... అని, వైసీపీ అభ్యర్థి ఫొటోపై శ్రీవారి ఆలయ సన్నిధి గొల్ల యాదవునికా?... అనే ప్రశ్నలతో... వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అదికూడా తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన అభినయ్‌ నిర్వహిస్తున్న ‘తిరుపతి వైఎస్‌ఆర్‌సీపీ’ అనే పార్టీ సోషల్‌ మీడియా గ్రూపు నుంచీ పోస్టు చేయడం గమనార్హం. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం అభ్యర్థులపై వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదు. అలాగే ఏ ప్రాంతాన్నీ చులకన చేసేలా వ్యవహరించరాదు. మతాలను, ఆలయాలను, కులాల పేర్లనూ వాడుకోకూడదు. అయితే వైసీపీ నేతలు ఈ మూడింటినీ బహిరంగంగానే ఉల్లంఘించారు. టీడీపీ అభ్యర్థి జేబీ శ్రీనివాస్‌ను గుంటూరు గూండా అంటూ ఆయన ఫొటోపైనే పోస్ట్‌ చేశారు. తద్వారా టీడీపీ అభ్యర్థి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేశారు. దానికంటే మించి వైసీపీ అభ్యర్థిని ఉద్దేశించి శ్రీవారి ఆలయ సన్నిధి గొల్ల యాదవునికా? అంటూ పోస్ట్టు చేశారు. ఎన్నికల రాజకీయాల్లోకి శ్రీవారిని, శ్రీవారి ఆలయాన్ని, ఆలయంలోకి ప్రతిష్టాత్మకమైన సన్నిధి గొల్ల వృత్తిని, యాదవుల కులాన్ని కూడా లాక్కొచ్చారు. ఇంతా చేసి వైసీపీ అభ్యర్థికీ శ్రీవారి ఆలయ సన్నిధి గొల్ల కుటుంబాలకూ ఎలాంటి సంబంధం లేదు. శ్రీవారి ఆలయ సన్నిది గొల్ల అనేది కేవలం మూడు కుటుంబాలకు వంశపారంపర్యంగా వస్తున్న హక్కు. ఆ కుటుంబాలతో వైసీపీ అభ్యర్థికి ఎలాంటి సంబంధం లేదు. ఆ పేరుతో సెంటిమెంటు రేకెత్తించి తిరుపతిలో శ్రీవారి భక్తుల ఓట్లు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Updated Date - Oct 28 , 2026 | 02:02 AM