కుప్పంలో వైసీపీ దాడులు!
ABN , Publish Date - Oct 20 , 2026 | 01:40 AM
ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వైసీపీ తీరు మార్చుకోలేదు. కుప్పంలో ఆ పార్టీ శ్రేణులు టీడీపీ వారిపై దాడులకు తెగబడ్డాయి. ఇద్దరు నాయకులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. పోలీసులు లాఠీఛార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కుప్పం మున్సిపాలిటీ నామినేషన్ల ఘట్టం ఇరు వర్గాల ఘర్షణతో ఉద్రిక్తమైంది.
గాయపడ్డ టీడీపీ నాయకులు
పోలీసుల లాఠీఛార్జీ
నామినేషన్ల పరిశీలన ఘట్టం ఉద్రిక్తం
కుప్పం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వైసీపీ తీరు మార్చుకోలేదు. కుప్పంలో ఆ పార్టీ శ్రేణులు టీడీపీ వారిపై దాడులకు తెగబడ్డాయి. ఇద్దరు నాయకులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. పోలీసులు లాఠీఛార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కుప్పం మున్సిపాలిటీ నామినేషన్ల ఘట్టం ఇరు వర్గాల ఘర్షణతో ఉద్రిక్తమైంది. నామినేషన్ల పరిశీలన కోసం ఆయా పార్టీల అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి బయలుదేరారు. ప్యాలెస్ రోడ్డులోని అంబికా కల్యాణ మండపం సమీపంలో రెండు పార్టీల వారు ఎదురుపడ్డారు. ఆయా పార్టీల శ్రేణుల మధ్య మాటలు పెరిగి.. వివాదం తీవ్రస్థాయికి చేరింది. టీడీపీ అభ్యర్థులను నామినేషన్ల పరిశీలనకు వెళ్లకుండా వైసీపీ శ్రేణులు అడ్డుకుని దాడులకు దిగారు. టీడీపీ నుంచీ అంతేస్థాయిలో ప్రతిఘటన ఎదురైంది. ఈ దాడుల్లో కుప్పం నియోజకవర్గ మైనారిటీ సెల్ అధ్యక్షుడు జాకిర్, గుడుపల్లె మండల మాజీ టీడీపీ అధ్యక్షుడు బాబు తీవ్రంగా గాయపడ్డారు. ఈలోగా ఏఎస్పీ బి.హేమంత్ ఆధ్వర్యంలో పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జీ చేసి గుంపును చెదరగొట్టారు. అదనపు బలగాలను దింపి, బ్యారికేడ్లను ఏర్పాటు చేసి, రాకపోకలను నియంత్రించారు. గాయపడ్డ జాకిర్, బాబును అంబులెన్స్‌లో కుప్పం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. టీడీపీ శ్రేణులే తమ అభ్యర్థులను నామినేషన్ పరిశీలన కేంద్రానికి వెళ్లకండా అడ్డుకుని దాడులు చేశారంటూ వైసీపీ నేత, ఎమ్మెల్సీ భరత్ విలేకరుల సమావేశంలో ఆరోపించారు.
సహనంతో ఉన్నాం.. రెచ్చగొట్టకండి
నామినేషన్ల పరిశీలనకు వెళ్తున్న తమ అభ్యర్థులను వైసీపీ వారు అడ్డుకుని పత్రాలను చించేయడానికి ప్రయత్నించారని టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. తమ అధినేత చంద్రబాబు ఆదేశించారు కాబట్టి కార్యకర్తలు, నాయకులు సహనంతో ఉన్నారన్నారు. రెచ్చగొడితే పరిస్థితులు దారుణంగా మారతాయని హెచ్చరించారు. కుప్పం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న జాకిర్, బాబును ఆయన పరామర్శించి వైసీపీ దాడులను ఖండించారు. తామే దాడులకు దిగుంటే వైసీపీవారు 99 నామినేషన్లు వేసేవారా అని ప్రశ్నించారు. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు వేయనివ్వకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా పోలింగ్ జరగనివ్వకుండా టీడీపీ అభ్యర్థులు, నాయకులు, ప్రజలమీద కూడా వైసీపీ చేసిన దాడుల క్లిప్పింగులను ఆయన ప్రదర్శించారు.
నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు
వైసీపీ చైర్మన్ అభ్యర్థి విజయ కుమార్
తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని కుప్పం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల్లో ఒకరైన బత్తలపల్లి విజయ కుమార్ చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ‘సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది, నేను కిడ్నాప్ అయినట్టు. అలాంటిదేం జరగలేదు. నేను ఒక హాఫ్నవర్లో కుప్పం వచ్చేస్తాను’ అని ఆయన స్పష్టంగా వీడియోలో చెప్పారు. అయితే, అంతకుముందు వైసీపీ నేత, ఎమ్మెల్సీ భరత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ చైర్మన్ అభ్యర్థి బత్తలపల్లి విజయకుమార్‌ను టీడీపీ వాళ్లు కిడ్నాప్ చేశారని ఆరోపించారు.
నగరిలో ఉద్రిక్తత
నగరి: నగరి మున్సిపల్ కార్యాలయం వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం మధ్యాహ్నం 3.25 గంటలకు తన అనుచరులతో మాజీ మంత్రి ఆర్కే రోజా వెళ్లి నామినేషన్లు రిజెక్టా.. యాక్సెప్టా.. అన్న స్లిప్పులను నోటీసుబోర్డులో ఎందుకు అతికించలేదంటూ పోలీసు ఆధికారులతో వాదించారు. రోజా వచ్చిన సమాచారంతో టీడీపీ శ్రేణులూ అక్కడికి చేరుకున్నారు. రోజాకు అనుకూలంగా వైసీపీకి శ్రేణులు.. ఎమ్మెల్యే భానుప్రకా్షకు మద్దతుగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత చైర్మన్ స్థానం టీడీపీకి ఏకగ్రీవమైన విషయం తెలియడంతో మరింత ఎక్కువగా గొడవ చేసి, వైసీపీకి అనుకూలంగా నినాదాలు చేశారు. దీనిపై కలెక్టర్‌కు రోజా ఫిర్యాదు చేశారు.
చిత్తూరులో చెదురు మదురుగా..
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో నామినేషన్ల పరిశీలన సందర్భంగా చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. కొంగారెడ్డిపల్లెలో వైసీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. 14వ వార్డులో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తోపులాటలో వైసీపీ అభ్యర్థి అంజలిరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి.