మత్తులో యువత చిత్తు
ABN , Publish Date - Aug 08 , 2026 | 01:41 AM
మదనపల్లె, రాయచోటి కేంద్రాలుగా గంజాయి విక్రయాలు అరకు, బిహార్, ఒడిశా రాష్ర్టాల నుంచి దిగుమతి అన్నమయ్య జిల్లాలో పెరుగుతున్న నేరాలు
మదనపల్లె క్రైం, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లాలో గంజాయి మత్తు యువతను చిత్తు చేస్తోంది. మదనపల్లె, రాయచోటి కేంద్రాలుగా యథేచ్ఛగా విక్రయాలు జరుగుతున్నాయి. అరకు, బిహార్, ఒడిశా రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకుని ఆయా ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. తద్వారా యువత మత్తుకు బానిసై నేరాలకు పాల్పడుతున్నారు.
జిల్లా కేంద్రమైన మదనపల్లెలోని ఎస్టేట్, సత్యసాయి కాలనీ, శివాజీనగర్, సీటీఎం రోడ్డు, చంద్రాకాలనీ, అనపగుట్ట, బైపాస్ రోడ్డు, పుంగనూరు రోడ్డు, నిమ్మనపల్లె రోడ్డు, కురబలకోట, బి.కొత్తకోట, రాయచోటి పరిసర ప్రాంతాలతో పాటు రామాపురం, గుర్రంకొండ, వాల్మీకిపురం, కలకడ, కలికిరి, పీలేరు మండలాల్లో గంజాయి విక్రయాలు జోరందుకున్నాయి. బయట రాష్ర్టాల నుంచి తక్కువ ధరకు తెప్పించుకుని ఇక్కడ ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. యువతను టార్గెట్ చేసుకుని వ్యాపారం సాగిస్తున్నారు. తద్వారా యువత మత్తుకు బానిసై జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.
పెరిగిన క్రైం రేటు
జిల్లాలో గంజాయికి బానిసైన యువత మత్తులో వాహనాలు డ్రైవ్ చేయడం, ఇతర నేరాలకు పాల్పడుతుండటంతో క్రైమ్ రేటు భారీగా పెరిగింది. పలువురు యువకులు ప్రమాదాల్లో మృత్యువాత పడటమేగాక కేసుల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల మదనపల్లె, రాయచోటి ప్రాంతాల్లో గంజాయి విక్రయాలపై పోలీసులు వరుస దాడులు నిర్వహించారు. నిందితులను అరెస్ట్ చేసి, పెద్దమొత్తంలో సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. విద్యా సంస్థలున్న ప్రాంతాల్లో నిఘా పెట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని పరీక్షలు నిర్వహిస్తున్నారు. గంజాయి బ్యాచ్, సరఫరా చేసే ముఠా, పాతనేరస్తుల కదలికలపై నిఘా ఉంచి గుట్టు రట్టు చేస్తున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి సరఫరా చేస్తున్న వారిపై నిఘా ఉంచారు. ఇన్ని చర్యలు తీసుకుంటున్నా తరచూ కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
నమోదైన కేసులు..
కొన్ని రోజులుగా జిల్లాలోని ఆయా పోలీస్‌స్టేషన్లలో పెద్దసంఖ్యలో గంజాయి కేసులు నమోదయ్యాయి. రాయచోటి పోలీస్‌స్టేషన్‌లో-5, గుర్రంకొండ-5, వాల్మీకిపురం-2, కలకడ-3, బి.కొత్తకోట-1, ముదివేడు-1, రామాపురం-1, మదనపల్లె వన్‌టౌన్-1, టూటౌన్-3, తాలూకా-2 గంజాయి కేసులు నమోదు కాగా, ఇతర కేసులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మత్తులో మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన, గొడవలు, దాడులు, చిన్నారులపై అఘాయిత్యాలు, లైంగిక దాడులు తదితర కేసులు నమోదు చేశారు.
నిందితుల అరెస్ట్
1) గుర్రంకొండకు చెందిన కరుడుగట్టిన గంజాయి స్మగ్లర్ ఆదిల్(22)ను జూలై 28న పోలీసులు అరెస్ట్ చేసి, 28కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అలాగే జిల్లాలో తొలిసారిగా అతనిపై పిట్ ఎన్‌డీపీఎస్ యాక్ట్ నమోదు చేసి, కడప సెంట్రల్ జైలుకు తరలించారు. నిందితుడిపై ఐదు గంజాయి, ఐదు ఇతర కేసులు ఉన్నాయి.
2) బిహార్‌కు చెందిన బడా స్మగ్లర్ హర్మోద్‌కుమార్(30)ను ఈనెల 3న రాయచోటి అర్బన్ పోలీసులు అరెస్ట్ చేసి ఒక కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ నమోదు చేశారు. నిందితుడు పాతనేరస్తుడు. బిహార్‌తో పాటు జిల్లాలో పలు గంజాయి కేసులున్నాయి.
విచక్షణ కోల్పోయి నేరాల వైపు..
గంజాయి సేవించిన వ్యక్తులు మత్తులో విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడుతున్నారు. వారి బ్రెయిన్‌లో హైపర్ యాక్టివిటీ పెరిగి కోమాలోకి వెళ్తారు. ఫిట్స్ వచ్చి మరణాలు సంభవిస్తాయి. హార్ట్, లంగ్స్, లివర్, కిడ్నీ దెబ్బతింటాయి. నోటి, పెద్దపేగు, చిన్నపేగు క్యాన్సర్లు అటాక్ అవుతాయి. పుట్టే పిల్లలు జన్యులోపంతో జన్మిస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా మసలుకోవాలి.
డాక్టర్ రాధిక, మానసిక వైద్య నిపుణురాలు, ఆర్‌ఎంవో, జిల్లా ఆస్పత్రి